India – China: భారత్- చైన్ సరిహద్దు రగడకు ముగింపు పలికేందుకు రంగం సిద్ధం.. ఇరుదేశాల రక్షణ మంత్రుల భేటీ..
భారత్- చైన్ సరిహద్దు రగడకు ముగింపు పలికేందుకు రంగం సిద్ధమైంది. ఇవాళ భారత్, చైనా రక్షణ మంత్రులు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో తూర్పు లద్దాఖ్ వివాదానికి సత్వర పరిష్కారంపై చర్చించనున్నారు ఇరుదేశాల రక్షణమంత్రులు.
చైనాతో సరిహద్దు వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్, చైనా రక్షణశాఖ మంత్రుల భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. షాంఘై సహకార సంస్థ సమావేశంలో పాల్గొనేందుకు భారత్‌కు రానున్న చైనా రక్షణశాఖ మంత్రి జనరల్ లీ షాంగ్‌ఫూ.. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో ఇవాళ సమావేశం కానున్నారు. ఇరువురు నేతలు.. ద్వైపాక్షిక చర్చలు జరపనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. లీ షాంగ్‌ఫూ భారత పర్యటనను చైనా ఇప్పటికే ధ్రువీకరించింది. 2020 నాటి గల్వాన్ ఘర్షణ తర్వాత చైనా రక్షణమంత్రి భారత్‌ను సందర్శించడం, ఇరు పక్షాల నేతలు భేటీ కావడం ఇదే తొలిసారి.
ఇవాళ, రేపు రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన ఎస్‌సీవో రక్షణ మంత్రుల సమావేశం జరగనుంది. భారత్, చైనాలతోపాటు రష్యా, పాకిస్థాన్, కజకిస్థాన్, కిర్గిస్థాన్, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్ దేశాలు ఈ సదస్సులో పాల్గొననున్నాయి. పరిశీలక దేశాలుగా బెలారస్, ఇరాన్ ప్రతినిధులు సైతం హాజరుకానున్నారు. అయితే.. పాక్ రక్షణమంత్రి మాత్రం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అటెండ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో ఉగ్రవాదం, ప్రాంతీయ భద్రత, అఫ్గానిస్థాన్ పరిస్థితుల వంటి అంశాలపై చర్చించనున్నారు.
తూర్పు లద్దాఖ్‌లో దీర్ఘకాలంగా కొనసాగుతున్న వివాదాలను వేగంగా పరిష్కరించుకునేందుకు భారత్, చైనా ఇప్పటికే అంగీకరించాయి. ఈ మేరకు ఇటీవలి సైనిక చర్చల్లో అంగీకారం కుదిరినట్లు చైనా రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది. సరిహద్దు ప్రాంతాల్లో శాంతిని పరిరక్షించాలని కూడా నిర్ణయించినట్లు చైనా వెల్లడించింది. రెండు దేశాల సైనిక చర్చలు ఈ నెల 23న తూర్పు లద్దాఖ్‌లోని చుషుల్-మోల్దో ప్రాంతంలో జరిగాయి. వాస్తవానికి.. ప్రపంచంలో దేశ రక్షణ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్న దేశాల్లో భారత్ ఒకటిగా ఉంది.
భారత్ చుట్టూ చైనా, పాకిస్తాన్ వంటి దేశాలు ఉన్నాయి. దాంతో.. భారత్.. ఇటీవల కాలంలో సరిహద్దుల్లో రక్షణ కోసం ఎక్కువగా ఖర్చు పెడుతోంది. 2022లో అత్యధికంగా సైనిక వ్యయం చేసిన దేశాల్లో అమెరికా, చైనా, రష్యాలే 50 శాతాన్ని కలిగి ఉన్నాయి. 2021లో భారత్ సైనిక వ్యయం పరంగా 76.6 బిలియన్ డాలర్లతో ప్రపంచంలోనే మూడో స్థానంలో నిలిచింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..