Heat Waves: దేశంలో మండిపోతున్న ఎండలు.. 11 సంవత్సరాల రికార్డు బద్దలు..
జూన్ రెండో వారం ముగిసినప్పటికి దేశంలో చాలా చోట్ల రుతుపవనాల జాడలేదు. మే నెలల్లో కొట్టాల్సిన ఎండలు ఇప్పుడు దంచికొడుతున్నాయి. యూపీ ,బీహార్‌లో మూడు రోజుల్లో ఎండల తీవ్రతకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
జూన్ రెండో వారం ముగిసినప్పటికి దేశంలో చాలా చోట్ల రుతుపవనాల జాడలేదు. మే నెలల్లో కొట్టాల్సిన ఎండలు ఇప్పుడు దంచికొడుతున్నాయి. యూపీ, బీహార్‌లో మూడు రోజుల్లో ఎండల తీవ్రతకు 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బీహార్‌లో రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
దేశంలో మండిపోతున్న ఎండలు..
దేశంలో మండిపోతున్నాయి ఎండలు . జూన్ నెల సగం గడిచిపోయినా ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. ఎండలకు తోడు వేడిగాలులు వీస్తున్నాయి. రాబోయే రోజుల్లో పది రాష్ట్రాల్లో వేడిగాలులు వీస్తాయని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, మధ్యప్రదేశ్, జార్ఖండ్, మహారాష్ట్రలోని విదర్భ, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రాగల మూడు రోజులు వేడిగాలుల తీవ్రత పెరుగుతుందని హెచ్చరించింది. వడగాల్పుల కారణంగా బీహార్‌లో 7 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు.
బీహార్ , ఉత్తరప్రదేశ్‌లో చాలా ప్రాంతాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. . యూపీ లోని బలియాలో 72 గంటల్లో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్, బీహార్ లలో ఎండల తీవ్రతకు చాలామంది అనారోగ్యం పాలవుతున్నారు. గడిచిన మూడు రోజులలోనే యూపీ, బీహార్ లో వంద మంది చనిపోయారు. మృతుల్లో లో 60 ఏళ్లు పైబడిన వారే ఎక్కువని అధికారులు వెల్లడించారు.
బీహార్‌లో 45 మంది, యూపీలో 55 మంది ఎండల తీవ్రతకు చనిపోయారు. వడగాలులకు డీహైడ్రేషన్, జ్వరం, డయేరియా తదితర అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులకు జనం క్యూ కడుతున్నారు. ఎండల తీవ్రత కారణంగా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. సాధారణ అనారోగ్యాలతో పాటు గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది.
11 సంవత్సరాల రికార్డు బద్దలు..
ఎండలు తగ్గకపోవడంతో పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వేసవి సెలవులు పెంచుతున్నట్లు బీహార్ ప్రభుత్వం ప్రకటించింది. బీహార్ ఈ నెల 24 వరకు స్కూళ్లకు సెలవులు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో చాలా వేడి గాలులు వీస్తాయని, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్‌లో వచ్చే మూడు రోజులు వేడి మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణశాఖ పేర్కొంది. కో, ఉత్తరప్రదేశ్, బీహార్, తూర్పు మధ్యప్రదేశ్‌లో రాబోయే రెండు రోజుల పాటు వేడిగాలులు వీస్తాయని తెలిపింది. తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ మధ్యప్రదేశ్‌లలో రానున్న 24 గంటలపాటు వేడిగాలులు వీస్తాయని పేర్కొంది. మరో వైపు బీహార్‌లో హీట్‌వేవ్ గత 11 సంవత్సరాల రికార్డును బద్దలు కొట్టింది. అంతకుముందు 2012లో 19 రోజుల పాటు నిరంతరంగా వేడిగాలులు వీచాయి. ఈ సారి 20 రోజులుగా వేడిగాలులు వీస్తున్నాయి.
తీవ్ర ఎండల కారణంగా గోవా, ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎండవేడిని దృష్టిలో ఉంచుకొని సెలవులను పొడిగించారు. . పశ్చిమ, ఆగ్నేయ ప్రాంతాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వివరించింది. ఈశాన్య రాజస్థాన్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. సోమ, మంగళవారాల్లో పశ్చిమ మధ్యప్రదేశ్, నైరుతి ఉత్తరప్రదేశ్‌లో వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. రాబోయే రోజుల్లో ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలుంటాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..