Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Politics: సిసోడియా విడుదలతో AAPకి కొత్త ఊపిరి.. ఒక్కసారిగా మారిన ఢిల్లీ రాజకీయ ముఖచిత్రం..!

ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా.. ఇద్దరూ ఢిల్లీలోని తిహాడ్ జైలు జీవితం గడపాల్సి వచ్చింది. పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొద్ది నెలల క్రితం అరెస్టవగా, మనీశ్ సిసోడియా 17 నెలల జైలు జీవితం అనంతరం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.

Delhi Politics: సిసోడియా విడుదలతో AAPకి కొత్త ఊపిరి.. ఒక్కసారిగా మారిన ఢిల్లీ రాజకీయ ముఖచిత్రం..!
Arvind Kejriwal, Manish Sisodia (File Photo)
Follow us
Mahatma Kodiyar, Delhi, TV9 Telugu

| Edited By: Janardhan Veluru

Updated on: Aug 10, 2024 | 6:55 PM

ఢిల్లీ(10, ఆగస్టు 2024): నాయకుడు లేని రాజకీయ పార్టీ.. కెప్టెన్ లేని పడవ ప్రయాణం ఒక్కటే. రాజకీయాల్లో పార్టీల అధినేతలకు ఉన్న ప్రాముఖ్యత అలాంటిది. సిద్ధాంతాలపై నిర్మితమైన పార్టీలకు సైతం నాయకత్వ సమర్థత, వారు తీసుకునే నిర్ణయాలు, అమలు చేసే వ్యూహాలే పార్టీ జయాపజయాలను నిర్ణయిస్తాయి. కొద్ది నెలల్లో దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పూర్తిగా పట్టణ రాష్ట్రమైన ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) గత దశాబ్దకాలంగా అధికార పీఠంపై పాగా వేసింది. అంతకంటే ముందు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కనీసం ప్రధాన ప్రత్యర్థిగా నిలబడలేకపోయింది. ఈ మధ్య కాలంలో జరిగిన అనేక ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) – భారతీయ జనతా పార్టీ (BJP) మధ్యనే ప్రధాన పోటీ నెలకొంది. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో విపక్ష కూటమి (INDIA)లో భాగంగా ఆప్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోటీ చేసినా సరే.. కమలదళాన్ని నిలువరించలేకపోయాయి. ఈ సంగతెలా ఉన్నా.. జైలు నుంచి మనీశ్ సిసోడియా విడుదల ఆమ్ ఆద్మీ పార్టీకి ఎంతో ఉపశమనం కల్గించింది. అసెంబ్లీ ఎన్నికల పోరులో ఆ పార్టీ పైచేయి సాధించేందుకు ఆస్కారం కల్పించింది.

ఢిల్లీ మద్యం పాలసీ అక్రమాల కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా.. ఇద్దరూ ఢిల్లీలోని తిహాడ్ జైలు జీవితం గడపాల్సి వచ్చింది. పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కొద్ది నెలల క్రితం అరెస్టవగా, మనీశ్ సిసోడియా 17 నెలల జైలు జీవితం అనంతరం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు. లోక్‌సభ ఎన్నికల సమయంలో అరెస్టయిన కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఎన్నికల ప్రచారం చేయగలిగారు. ఆ తర్వాత మళ్లీ లొంగిపోయి జైలు జీవితాన్ని గడుపుతున్నారు. ఆ పార్టీకి వ్యూహకర్తలుగా వ్యవహరిస్తూ సమయానుకూలంగా రాజకీయ ఎత్తుగడలు వేస్తూ అతి తక్కువ సమయంలోనే పార్టీకి జాతీయ హోదా తీసుకురావడంలో అరవింద్ కేజ్రీవాల్ చతురత అత్యంత కీలకం.

అలాగే ఆ పార్టీలో సెకండ్-ఇన్-కమాండ్ హోదాలో ఉన్న మనీశ్ సిసోడియా సైతం కేజ్రీవాల్‌కు అన్ని అంశాల్లో చేదోడువాదోడుగా నిలిచారు. ఇద్దరు నేతలు తమ వాక్పటిమతో ఓటర్లను ఆకట్టుకోగలరు. వాగ్ధాటితో ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టించగలరు. అలాంటి నేతలిద్దరూ జైల్లో ఉంటే ఇక ఆ పార్టీని ఈ ఇద్దరు నేతల మాదిరిగా నడిపించగల సమర్థత మిగతా ఎవరిలోనూ లేదు. ఇదే కేసులో జైలుపాలై విడుదలైన సంజయ్ సింగ్, ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అతీషి మర్లేనా, కేజ్రీవాల్ సతీమణి సునీత కేజ్రీవాల్ సహా మరెవరూ ఈ ఇద్దరు నేతల స్థాయిని అందుకోలేకపోయారు. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా కొద్ది నెలలు మాత్రమే మిగిలున్న సమయంలో అగ్రనేతల్లో ఒక్కరైనా బయటకు రాకుండా ఆ పార్టీని ఎన్నికల రణరంగంలో నడిపించడం మిగతావారికి కష్టంగా మారేది. సరిగ్గా ఇదే సమయంలో సిసోడియా విడుదల కావడం ఆ పార్టీకి కొత్త ఊపిరి అందించినట్టయింది.

2025 ఫిబ్రవరిలో ఢిల్లీలోని 70 స్థానాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సైతం ప్రధాన పోరు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) – బీజేపీ (BJP) మధ్యనే ఉంటుంది. అయితే పూర్వవైభవం కోసం ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ముక్కోణపు పోటీగా మార్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ పరిస్థితుల్లో సిసోడియా విడుదల కారణంగా ఆప్ ఎదుర్కొంటున్న నాయకత్వలేమి సమస్యను కొంతమేర అధిగమించగల్గుతుంది. కారణాలను విశ్లేషిస్తే..

1. అరవింద్ కేజ్రీవాల్ తరహాలోనే మనీష్ సిసోడియా కూడా ప్రజల్లో ఆదరణ కల్గిన నాయకుడు. తన ప్రసంగాల ద్వారా జనాన్ని పోగుచేసి ప్రజలకు సందేశం ఇవ్వడంలో నిపుణుడు. 2013లో ఢిల్లీలో ఆప్ తొలి ప్రభుత్వం ఏర్పడినప్పుడు, సిసోడియాను కేజ్రీవాల్ డిప్యూటీ సీఎంగా ఎంపిక చేశారు. జైలుకు వెళ్లే వరకు సిసోడియా డిప్యూటీ సీఎంగా కొనసాగారు.

2. సిసోడియా ఆప్ (AAP) వ్యవస్థాపక సభ్యుడు. ఎన్నికల పోరాట వ్యూహం నుంచి కార్యకర్తల వరకు పార్టీలో అన్నీ ఆయనకు తెలుసు. ఇది మాత్రమే కాదు, ఢిల్లీలోని పాఠశాలలకు సంబంధించి ఆయన చేసిన కృషి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంది. ప్రైవేటు విద్యాసంస్థలకు ధీటుగా అధునాతన సదుపాయలతో నాణ్యమైన విద్యను ప్రభుత్వ పాఠశాలల్లో అందించేలా చేయడంలో సిసోడియా చేసిన కృషి మరువలేనిది. అదే ఇప్పుడు ఆయనకు ప్రచారాస్త్రంగా మారనుంది.

3. సిసోడియా బెయిల్ ద్వారా విడుదలవడం ఢిల్లీ రాజకీయాలను ఉద్వేగానికి గురి చేస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సైతం జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్, విడుదలైన సిసోడియా ద్వారా భావోద్వేగాలను పండించి ఓట్లు పిండుకోవాలని చూస్తోంది. జైలు నుంచి విడుదలైన తర్వాత మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి వెళ్లి కేజ్రీవాల్‌ అరెస్టు గురించి, జైలు జీవితం గురించి చెప్పాలని సూచించారు. తద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని చిత్రీకరిస్తూ ప్రజల సానుభూతి పొందాలని పథక రచన చేశారు. అది అమలైతే.. సానుభూతి అస్త్రంగా మారే అవకాశం లేకపోలేదు.

ఢిల్లీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి?

జైలుకు వెళ్లే ముందు వరకు మనీశ్ సిసోడియా ఢిల్లీ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఆయనకు విద్య, ఎక్సైజ్ వంటి కీలకమైన శాఖల బాధ్యతలు ఉండేవి. ఇప్పుడు జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్లీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టగలరా అన్న ప్రశ్న తలెత్తింది. సిసోడియా మాట్లాడుతూ.. తన శక్తిని నాశనం చేయడానికే జైలులో పెట్టారని, అయితే రెట్టింపు శక్తితో తాను జనం మధ్యకు వచ్చానని అన్నారు. ప్రభుత్వ విద్య వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్తానని కూడా అన్నారు. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల్ని చదివించుకునే సామాన్య మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పటికిప్పుడు ఆయన డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టే అవకాశాలు కనిపించడం లేదు. ఇందుక్కారణం.. ముఖ్యమంత్రి సిఫార్సు చేయకుండా మంత్రివర్గంలోకి ఎవరినీ తీసుకోవడం సాధ్యం కాదు. అలాగని కేజ్రీవాల్ తానున్న తిహాడ్ జైలు నుంచి ఈ సిఫార్సులు చేయడం కూడా సాధ్యపడదు. ఈ క్రమంలో సిసోడియా ముందు రెండు ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి.

1. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతం జైలులో ఉన్నందున కేజ్రీవాల్ స్థానంలో ఎన్నికల ప్రచార బాధ్యతలను మనీశ్ సిసోడియా భుజానికి ఎతుకోవాలి. ఆప్ ప్రధాన కార్యాలయంలో సిసోడియా ఇప్పటికే ప్రచార పర్వానికి తెరలేపారు. క్విట్ నియంతృత్వ భారత్ పేరుతో ఒక ప్రచార నినాదాన్ని రూపొందించారు.

2. అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ సెప్టెంబర్ 5న హైకోర్టులో విచారణకు రానుంది. గత విచారణ సందర్భంగా హైకోర్టు ఈడీకి పలు ప్రశ్నలు సంధించింది. ఇప్పటికే సిసోడియాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినందున, ఆ ప్రభావం కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై ఉంటుంది. హైకోర్టు బెయిల్ మంజూరు చేయకపోతే వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. బెయిల్ మంజూరైతే.. ఇద్దరు అగ్రనేతలు పార్టీ ప్రచారాన్ని హోరెత్తించడానికి ఆస్కారం ఉంటుంది.

మరోవైపు ఢిల్లీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న భారతీయ జనతా పార్టీ (BJP) ఇప్పటివరకు మద్యం కుంభకోణం ఆప్ సర్కారుపై పదునైన విమర్శలు చేస్తూ వచ్చింది. అయితే తొలుత సంజయ్ సింగ్, ఇప్పుడు మనీష్ సిసోడియా బెయిల్ పొందడం, కేసుల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యానించిన తీరు కమలదళాన్ని వెనుకడుగు వేసేలా చేసింది. అయితే బీజేపీ నేతలు సిసోడియాకు బెయిల్ మాత్రమే వచ్చిందని, కేసులో నిర్దోషిగా బయటపడలేదని ఆప్ సానుభూతి ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా సిసోడియా విడుదల ఢిల్లీ రాజకీయ ముఖచిత్రాన్ని మార్చిందనే చెప్పవచ్చు.

మరిన్ని జాతీయ వార్తలు చదవండి