Sulagitti Narasamma: 15,000 మందికి పైగా ఉచిత సుఖప్రసవాలు చేసిన మంత్రసాని.. ఆమె జీవితం ఎందరికో ఆదర్శం
Sulagitti Narasamma: పుట్టిన మనిషి మరణించక తప్పదు ఇది అందరికీ తెలిసిన విషయమే.. అయితే కొంతమంది మరణించి చిరంజీవులు.. వారు చేసిన పనులు ప్రజల మనస్సులో జ్ఞాపకాలుగా మారి..
Sulagitti Narasamma: పుట్టిన మనిషి మరణించక తప్పదు ఇది అందరికీ తెలిసిన విషయమే.. అయితే కొంతమంది మరణించి చిరంజీవులు.. వారు చేసిన పనులు ప్రజల మనస్సులో జ్ఞాపకాలుగా మారి వారిని చిరంజీవులుగా మారుస్తాయి. అలాంటి ఒక మహనీయురాలు సులగిట్టి నర్సమ్మ. ఏమీ చదవు రాని మంత్రసాని . నూటికి 99 శాతం ఫ్రీ డెలివరీలు సక్సెస్ గా చేశారు నర్సమ్మ. అంతేకాదు.. పెద్ద పెద్ద చదువులు చదివిన డాక్టర్లు నార్మల్ డెలివరీ చేయని కేసులను కూడా ఈమె నార్మల్ డెలివరీ చేసిన ఘనతసొంతం చేసుకున్నారు. నర్సమ్మ చేసిన సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ తో సత్కరిస్తే.. కర్ణాటక ప్రభుత్వం అనేక అవార్డులను ఇచ్చి గౌరవించింది.
సులగిట్టి నర్సమ్మ కర్ణాటక రాష్ట్రానికి చెందిన సామాజిక కార్యకర్త, మంత్రసాని. సులగిట్టి అంటే కన్నడ భాషలో ప్రసవాలు చేసే దాది లేదా మంత్రసాని అని అర్ధం. 1920లో కర్ణాటక రాష్ట్రంలోని తుమ్కూర్ జిల్లాలోని పావగడ గ్రామంలో జన్మించారు. డిసెంబర్ 25, 2018న మరణించారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత మాతృభాష తెలుగు. నర్సమ్మ 12 సంవత్సరాల వయసులో అంజినప్పతో వివాహం జరిగింది. ఈ దంపతులకు 12 మంది సంతానం, వీరిలో నలుగురు చిన్నతనంలోనే మరణించారు. మంత్రసాని నైపుణ్యాలను మంత్రసాని మారిగెమ్మా అనే మహిళ నుంచి నేర్చుకున్నారు. గర్భిణీ స్త్రీలకు సహజ ఔషదం తయారుచేసే కళను, శిశువు యొక్క ఆరోగ్యస్థితి, గర్భంలో ఉన్నప్పుడు పిండం యొక్క నాడిని ఏ పరికరాలు లేకుండా గుర్తించగలిగేవారు. నర్సమ్మ మరణించిన 2018 నాటికి 15,000 మందికి పైగా సుఖప్రసవాలను చేశారు.
నరసమ్మ కర్ణాటక రాష్ట్రంలోని వెనుకబడిన కొండ ప్రాంతంలో ఎటువంటి వైద్య సదుపాయాలు లేని, కనీసం రోడ్డు సదుపాయాలు కూడా లేని తాండాల్లో ప్రక్రృతి వైద్యం చేశారు, ముఖ్యంగా గర్భవతులకు సుఖప్రసవం చేయించడంలో ఈవిడ దిట్ట. ఆధునిక స్కానింగ్ సైతం గుర్తించలేని కొన్ని గర్భస్త శిశువు లక్షణాలను నర్సమ్మ తన ప్రక్రృతి వైద్య విధానం ద్వారా ఖచ్చితంగా గుర్తించగలిగేదట. స్పెషలిస్ట్ గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు సైతం నర్సమ్మ ప్రతిభకు ఆశ్చర్య పోయేవారట. ఇప్పటికీ నర్సమ్మ కు బెంగుళూరులోని అనేక మల్టీ /సూపర్ స్పెషలిటీ ఆసుపత్రుల డాక్టర్లు అభిమానులుగా ఉన్నారు.
తల్లి గర్భంలోని శిశువు నాడి ఎలా కొట్టుకుంటుంది, తల ఏ దిశలో ఉంది, ఉమ్మనీరు పరిస్థితి, శిశువు ఆరోగ్యంగా ఉందా, అంగవైకల్యం ఏమైనా ఉందా, ప్రసవం ఎన్ని రోజుల్లో కాగలదు, సిజేరియన్ తప్పనిసరా, పుట్టబోయే బిడ్డ బరువు ….వంటి విషయాలు ఖచ్చితంగా చెప్పి.. గర్భిణికి ఒకవేళ సిజేరియన్ తప్పనిసరి అయితే ముందే హెచ్చరించి తగిన సూచనలు చేసి సమీప ఆసుపత్రికి ముందే చేరేలా చేసి ప్రమాదాన్ని నివారించేవారట.
నిరుపేద కుటుంబంలో జన్మించిన ఈమె తన జీవిత కాలంలో 15,000 పైగా ప్రసవాలు చేసింది. ఎటువంటి డబ్బులూ తీసుకోలేదు.. పైగా ఎవరైనా నర్సమ్మ చేసిన సేవలకు కృతజ్ఞతగా డబ్బులు గాని, బహుమతులు తన ఇంటికి పంపిస్తే వాటిని మళ్ళీ ఆవిడ స్వయంగా పంపించినవారికి అందజేసేడట. ఆమె మరణించే సమయం వరకూ రోజువారీ వ్యవసాయ కూలీగా పనిచేసి బతికారు. నర్సమ్మ సేవలను గుర్తించి తుమకూరు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. డబ్బుకోసం ఏ పనులైనా చేసే ప్రస్తుత జమానాలో నర్సమ్మ లాంటి నిస్వార్ధ పరులు కూడా ఉన్నారు.. తమకు తోచిన విధంగా సాటి మనిషికి సాయం అందించి మహనీయులుగా చరిత్రలో నిలిచిపోయారు.