త్వరలో మీ చేతికి ఇంకు పడుద్ది.. చెరిగిపోని సిరా.. వెనుక దాగిన కథ.!

మన దేశంలో జరిగే ఎన్నికల్లో ఒకే వ్యక్తి తన ఓటుతో పాటు మరొకరి ఓటు వేయడం లేదా చనిపోయినవారి పేరుతో వచ్చి ఓటేయడం మనం చూస్తూనే ఉంటాం. వీటితో పాటు ఒకే వ్యక్తికి ఒకటికి మించిన నియోజకవర్గాల్లో ఓటు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ నగరంలో నివసించే చాలా మందికి సిటీతో పాటు తమ స్వగ్రామాల్లోనూ ఓటు ఉంటుంది..

త్వరలో మీ చేతికి ఇంకు పడుద్ది.. చెరిగిపోని సిరా.. వెనుక దాగిన కథ.!
Election Ink
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Apr 09, 2024 | 6:15 PM

మన దేశంలో జరిగే ఎన్నికల్లో ఒకే వ్యక్తి తన ఓటుతో పాటు మరొకరి ఓటు వేయడం లేదా చనిపోయినవారి పేరుతో వచ్చి ఓటేయడం మనం చూస్తూనే ఉంటాం. వీటితో పాటు ఒకే వ్యక్తికి ఒకటికి మించిన నియోజకవర్గాల్లో ఓటు ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ నగరంలో నివసించే చాలా మందికి సిటీతో పాటు తమ స్వగ్రామాల్లోనూ ఓటు ఉంటుంది. గతంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రాంతాల్లో వేర్వేరు దశల్లో పోలింగ్ జరిగినప్పుడు ఓటర్లు రెండు చోట్లా తమ ఓటు వేసిన సందర్భాలున్నాయి. మొత్తంగా డూప్లికేట్ ఓటింగ్ అనేక రూపాల్లో జరుగుతోంది. ఇది ఈ మధ్య కొత్తగా గుర్తించిన అంశమేమీ కాదు. స్వాతంత్ర్యం వచ్చిన దశాబ్దకాలానికే ఈ తరహా తప్పుడు విధానాలను కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. దీన్ని అరికట్టేందుకు తీసుకొచ్చిన విధానమే ఓటరు చేతి వేళ్లపై చెరగని ఇంకుతో గుర్తు. సాంకేతిక పరిజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా, ఎన్ని కొత్త విధానాలు అందుబాటులోకి వచ్చినా సరే గత 6-7 దశాబ్దాలుగా ఈ ఇంకును ప్రతి ఎన్నికల్లో వినియోగిస్తూ వస్తున్నారు. మరి కొద్ది రోజుల్లోనే ప్రారంభం కానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఉపయోగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రూ. 55 కోట్ల ఖర్చుతో ఇంకును ఖరీదు చేసింది. ప్రత్యేకమైన ఈ ఇంకును దేశంలో మైసూరు పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ (MPVL) సంస్థ ఒక్కటే తయారు చేస్తోంది. 2019లో జరిగిన ఎన్నికల్లో రూ. 33 కోట్ల ఖర్చుతో 26 లక్షల వయల్స్ (చిన్న సీసా) ఉపయోగించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈసారి ఎన్నికలకు 26.55 లక్షల వయల్స్ ఆర్డర్ చేసింది. అయితే ఈసారి ఖర్చు కూడా పెరిగింది. కేవలం ఈ చెరిగిపోని ఇంకు కోసం రూ. 55 కోట్లు వెచ్చించాల్సి వచ్చింది. ఈసీ ఆర్డర్ చేసిన ఈ ప్రత్యేక ఇంక్ వయల్స్‌లో అత్యధికంగా 3.58 లక్షల వయల్స్ ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లగా.. అత్యల్పంగా లక్షద్వీప్‌కు 110 వయల్స్ చేరుకున్నాయి.

700 మంది ఓటర్లకు ఒక సీసా..

ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో 97 కోట్ల మంది ఓటుహక్కు కలిగి ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో అత్యధికంగా 15.30 కోట్ల మంది ఓటర్లు ఉండగా.. అత్యల్పంగా లక్షద్వీప్‌లో 57,500 మంది ఓటర్లు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్రకు 2.68 లక్షల ఇంక్ వయల్స్ పంపించారు. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్‌కు 2 లక్షలు, బీహార్‌కు 1.93 లక్షలు, తమిళనాడుకు 1.75 లక్షలు, మధ్యప్రదేశ్‌కు 1.52 లక్షలు, తెలంగాణకు 1.50 లక్షలు, కర్ణాటకకు 1.32 లక్షలు, రాజస్థాన్‌కు 1.30 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌కు 1.16 లక్షలు, గుజరాత్‌కు 1.13 లక్షలు ఇంక్ వయల్స్ పంపిణీ జరిగింది. ఒక సీసాలో 10 మి.లీ సిరా ఉంటుంది. ఒక సీసాతో దాదాపు 700 మంది వ్యక్తుల వేళ్లపై సిరా గుర్తు వేయవచ్చు. ఒక పోలింగ్ బూత్‌లో దాదాపు 15 వందల మంది ఓటర్లు ఉంటారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ఈసారి దేశవ్యాప్తంగా 12 లక్షలకు పైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

మన ఇంక్ 25 దేశాలకు ఎగుమతి..

ఎన్నికల్లో ఉపయోగించే ఈ చెరగని సిరా భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల్లో కూడా ఉపయోగిస్తున్నారు. కెనడా, ఘనా, నైజీరియా, మంగోలియా, మలేషియా, నేపాల్, దక్షిణాఫ్రికా, మాల్దీవులు సహా 25కి పైగా దేశాలకు ఈ చెరగని సిరాను భారత్ దిగుమతి చేసుకుంటున్నాయని మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్ కంపెనీ ఎండీ ఇర్ఫాన్ తెలిపారు. అయితే ఆయా దేశాల్లో సిరా వేసే పద్ధతి భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు కంబోడియా, మాల్దీవులలో ఓటరు తన వేలిని సిరాలో ముంచాల్సి ఉంటుంది. బుర్కినా ఫాసోలో బ్రష్‌తో ముద్ర వేస్తారు. తుర్కియే (టర్కీ)లో సిరా నాజిల్ ద్వారా ఓటరుకు నేరుగా అంటిస్తారు.

సిరా ఎంతకాలంగా ఉపయోగిస్తున్నారు?

భారతదేశంలో మొదటిసారిగా 1952లో జరిగిన ఎన్నికలతో పాటు ఆ తర్వాత 1957 ఎన్నికలలో ఎలాంటి ఇంకు గుర్తు ఉపయోగించలేదు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఒకరికి బదులుగా మరొకరు ఓటు వేసి రెండు పర్యాయాలు లేదా అంతకుమించి ఓటు వేసినట్లు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో దీనికొక పరిష్కారం కోసం కేంద్ర ఎన్నికల సంఘం సమాలోచనలు చేసింది. ఏదైనా ప్రత్యేక రసాయనం ద్వారా చెరిపివేయలేని సిరాను తయారు చేయాలని ఎన్నికల సంఘం “నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ ఆఫ్ ఇండియా (NPL)”ను కోరింది. పరిశోధనల అనంతరం నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీ ఇచ్చిన ఫార్ములా ప్రకారం కర్ణాటకకు చెందిన “మైసూర్ పెయింట్స్ అండ్ వార్నిష్ లిమిటెడ్” కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది. ఈ సంస్థను 1937లో మైసూర్ మహారాజా కృష్ణరాజ వడియార్ స్థాపించారు. స్వాతంత్య్రానంతరం ఈ కంపెనీని కర్ణాటక ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1962 ఎన్నికల్లో తొలిసారిగా చెరగని సిరాను ఉపయోగించారు. భారత ఎన్నికలలో ఈ సిరాను ఉపయోగించిన ఘనత మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుకుమార్ సేన్‌కు దక్కుతుంది. 1962 నుంచి ప్రతి ఎన్నికల్లోనూ ఈ సిరా ఉపయోగిస్తూ వస్తున్నారు.

ఈ సిరా ఎందుకు చెరిపివేయబడదు?

ఈ సిరా తయారీకి సంబంధించిన ఫార్ములాను కంపెనీ ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. ఈ సిరా తయారీకి సిల్వర్ నైట్రేట్ రసాయనాన్ని ఉపయోగిస్తారు. సిల్వర్ నైట్రేట్ ఈ సిరాను ప్రకృతిలో ఫోటోసెన్సిటివ్‌గా చేస్తుంది. ఈ కారణంగా సూర్యరశ్మికి గురైనప్పుడు అది ముదురు రంగులోకి మారుతుంది. ఇది మాత్రమే కాదు, నీటితో జతచేస్తే ఆ ఇంకు శరీరంలోపలకు కొంత మేర ఇంకుతుంది. ఈ సిరా వేలిపై పూస్తే అది గోధుమ రంగులో ఉంటుంది. తర్వాత కొంత సమయానికి ముదురు ఊదా రంగులోకి మారుతుంది. ఆపై అది నల్లగా మారుతుంది. ఈ సిరా వేలికి పూస్తే అందులో ఉండే సిల్వర్ నైట్రేట్ మన శరీరంలో ఉండే ఉప్పుతో కలిసి సిల్వర్ క్లోరైడ్‌గా మారుతుంది. సిల్వర్ క్లోరైడ్ చర్మానికి అంటుకుంటుంది. నీరు లేదా ఇతర రసాయనాల ద్వారా దీన్ని తొలగించలేం. చర్మ కణాలు పాతబడి, మృతకణాలు ఒక్కొక్కటిగా పోతున్నప్పుడు మాత్రమే ఈ సిరా గుర్తు క్రమంగా అదృశ్యమవుతుంది. 2014 ఎన్నికల సమయంలో చాలా మంది ఈ చెరగని సిరా తక్కువ సమయంలో తొలగిపోయిందని ఫిర్యాదులు వచ్చాయి. ఈ సిరాను పూర్తిగా తొలగించేందుకు 15 రోజుల సమయం పడుతుందని ఎన్నికల సంఘం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది.