AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Heavy Rains: ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు.. వచ్చే 48 గంటలు అత్యంత కీలకం..

మహారాష్ట్ర అతలాకుతలం అవుతోంది. భారీ వర్షాలతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. రాబోయే 48 గంటలు ముంబైకి చాలా కీలకమైనవి. ఇప్పటికే ముంబైలో 84 గంటల్లో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబై, థానే, పాల్ఘర్‌లకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు.

Heavy Rains: ముంబైని ముంచెత్తిన భారీ వర్షాలు.. వచ్చే 48 గంటలు అత్యంత కీలకం..
Heavy Rains In Mumbai
Krishna S
|

Updated on: Aug 20, 2025 | 6:01 AM

Share

మహారాష్ట్రలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. క్లౌడ్‌బరస్ట్‌లు, కొండచరియలు విరిగిపడటం, తెరుచుకున్న మ్యాన్‌హోల్స్‌తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముంబై, పుణే, నాందేడ్‌లలో కుండపోత వర్షం కురుస్తోంది. నాందేడ్‌లో జరిగిన క్లౌడ్‌బరస్ట్ వల్ల ఎనిమిది మంది మరణించారు. ఈ విపత్కర పరిస్థితులపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సమీక్ష నిర్వహించారు. రాబోయే 48 గంటలు కీలకమని, అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆయన ఆదేశించారు.

ముంబైలో రోడ్లు ప్రాజెక్టు కాలువలను తలపిస్తున్నాయి. చాలా చోట్ల కార్లు నీటిలో మునిగిపోయాయి. ప్రయాణికులు అతి కష్టం మీద ముందుకు సాగుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో నడుం లోతు నీటిలో ప్రయాణం చేయాల్సి వస్తోంది. ప్రజలు బయటకు రావాలంటే ఈత కొట్టడం తప్పనిసరి అన్నట్లుగా పరిస్థితి మారింది. వరదల కారణంగా లోకల్ ట్రైన్‌లు నడుస్తున్నప్పటికీ, రైల్వే స్టేషన్‌లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. రోడ్లపై రవాణా పూర్తిగా స్తంభించింది.

విమాన రాకపోకలకు అంతరాయం

ముంబై విమానాశ్రయం నుండి బయలుదేరాల్సిన 155 విమానాలు, అలాగే అక్కడికి చేరుకోవాల్సిన 100 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. విమానాశ్రయానికి వెళ్లే మార్గాలు నీట మునగడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భారీ వర్షాల మధ్య ముంబై విమానాశ్రయం టెర్మినల్ T1 దగ్గర ఒక అగ్నిప్రమాదం సంభవించింది. విమానాశ్రయం లోపల ప్రయాణికులను తీసుకెళ్లే బస్సులో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపు చేశారు.

ముంబైలోని పోవాయ్‌ సమీపంలో ఒక వ్యక్తి వరదల్లో కొట్టుకుపోయాడు. అలాగే థానేలోని అండర్‌పాస్‌లో మునిగిన కారులోని ఇద్దరు వ్యక్తులను స్థానికులు కాపాడారు. అటు కొంకణ్ ప్రాంతం కూడా వరదలతో వణికిపోతోంది. రత్నగిరి జిల్లాలో జగ్బుడి, వశిష్టి, శాస్త్రి, కజలి, బవ్నాది, కొడవలి నదులు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఖేడ్, చిప్లున్, సంగమేశ్వర్, రాజపూర్ నగరాల్లోకి వరద నీరు చేరి జనజీవనం అస్తవ్యస్తమైంది.

ప్రభుత్వ హెచ్చరికలు

రాబోయే 48 గంటలు ముంబైకి చాలా కీలకమైనవి. ఇప్పటికే ముంబైలో 84 గంటల్లో 50 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ముంబై, థానే, పాల్ఘర్‌లకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. సముద్రంలో 3.75 మీటర్ల ఎత్తులో అలలు ఎగసిపడే ప్రమాదం ఉంది. మెరైన్ డ్రైవ్, గేట్‌వే ఆఫ్ ఇండియా వంటి తీర ప్రాంతాలకు ప్రజలు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. థానేలో వరద ప్రభావిత ప్రాంతాలను డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే పర్యటించి, బాధితులను ఓదార్చారు. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఎవరూ బయటకు రావద్దని ఫడ్నవీస్ విజ్ఞప్తి చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి..