AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతరిక్ష ప్రయోగాల్లో మరో ‘గేమ్-ఛేంజర్’.. జంబో రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో రెడీ!

చంద్రయాన్-3, మంగళ్‌యాన్ వంటి మిషన్ల విజయాలు మనకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చిపెట్టాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) భారీ టార్గెట్‌నే ఎంచుకుంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేసిన ఇస్రో శాస్త్ర వేత్తలు.. ఇప్పుడు జంబో రాకెట్‌ ప్రయోగానికి రెడీ అవుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 అంతస్తుల పొడవైన ప్రాజెక్ట్‌కు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు.

అంతరిక్ష ప్రయోగాల్లో మరో 'గేమ్-ఛేంజర్'.. జంబో రాకెట్‌ ప్రయోగానికి ఇస్రో రెడీ!
Isro Mega Project
Balaraju Goud
|

Updated on: Aug 20, 2025 | 7:35 AM

Share

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) భారీ టార్గెట్‌నే ఎంచుకుంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు భారత్ వైపు చూసేలా చేసిన ఇస్రో శాస్త్ర వేత్తలు.. ఇప్పుడు జంబో రాకెట్‌ ప్రయోగానికి రెడీ అవుతున్నారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 అంతస్తుల పొడవైన ప్రాజెక్ట్‌కు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు.

వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో ఘనత సాధించేందుకు రెడీ అయింది. ఈసారి ఏకంగా 40 అంతస్తుల పొడవైన రాకెట్‌ ద్వారా 75 టన్నుల ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్ ఈ విషయం వెల్లడించారు. 35 కిలోల పేలోడ్‌తో మొదలు పెట్టిన భారతీయ అంతరిక్ష ప్రయాణం.. ఇప్పుడు 75,000 కిలోల బరువైన ఉపగ్రహాలను లో ఎర్త్ ఆర్బిట్ లోకి తీసుకెళ్లగలిగే ఒక మెగా రాకెట్‌ను తయారు చేసే స్థాయికి ఎదిగిందన్నారు.

అంతరిక్ష ప్రయోగాల్లో ఇది ఒక ‘గేమ్-ఛేంజర్’గా మారబోతుందని నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న అమెరికా, రష్యా, చైనా వంటి దేశాలు కూడా ఇలాంటి సూపర్-హెవీ లాంచ్ వెహికిల్స్‌ను అభివృద్ధి చేస్తున్నాయి. ఈ జాబితాలో భారత్ చేరడం ద్వారా.. అంతర్జాతీయ అంతరిక్ష యానంలో మన స్థానం మరింత పదిలం అవుతుంది. వాణిజ్య ఉపగ్రహ ప్రయోగ మార్కెట్‌లో మన దేశ వాటా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే భారత్‌కు కక్ష్యలో55 ఉపగ్రహాలు ఉన్నాయి. వచ్చే మూడు లేదా నాలుగేళ్లలో వీటి సంఖ్య మూడు లేదా నాలుగు రెట్లు పెరగనుందున్నారు ఇస్రో ఛైర్మన్ వి.నారాయణన్. ముఖ్యంగా తక్కువ ఖర్చుతో కూడిన ప్రయోగాలకు ఇస్రో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. చంద్రయాన్-3, మంగళ్‌యాన్ వంటి మిషన్ల విజయాలు మనకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు తెచ్చిపెట్టాయి.

ఈ మెగా రాకెట్ కేవలం అంతరిక్ష పరిశోధనలకు మాత్రమే పరిమితం కాదు. దీనికి వ్యూహాత్మక ప్రాముఖ్యత కూడా ఉంది. దీని ద్వారా రక్షణ రంగానికి అవసరమైన భారీ కమ్యూనికేషన్, నిఘా ఉపగ్రహాలను సులభంగా అంతరిక్షంలోకి పంపవచ్చు. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంలో దేశ రక్షణ సన్నద్ధతను ఇది మరింత బలోపేతం చేస్తుంది. భవిష్యత్తులో దేశ భద్రతకు, ఆర్థిక ప్రగతికి అంతరిక్ష సామర్థ్యం ఒక కీలకమైన అంశంగా మారనుంది. మరోవైపు ఇస్రో ఈ ఏడాది డిసెంబర్‌లో తన గగన్‌యాన్-1 టెస్ట్ మిషన్ ప్రయోగానికి కూడా సిద్ధమవుతోంది. ఇటీవలే యాక్సియమ్-4 మిషన్‌ ద్వారా తన అంతరిక్ష యాత్రను దిగ్విజయంగా పూర్తి చేసుకుని వచ్చిన శుభాంశు శుక్లా అనుభవం ఈ భారత తొలి మానవసహిత అంతరిక్ష మిషన్​కు కీలకం కానుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us