Gujarat: గుజరాత్ కు తరలిపోయిన మెగా ప్రాజెక్టు.. మహారాష్ట్రలో రాజకీయ రచ్చ..
ఈ ఏడాది చివరిలో గుజరాత్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు గుజరాత్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. మరోవైపు యువతకు ఉద్యోగ..

ఈ ఏడాది చివరిలో గుజరాత్ శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు గుజరాత్ ప్రభుత్వం వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతోంది. మరోవైపు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టిసారించింది. దీనిలో భాగంగా వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టే మెగా ప్రాజెక్టులను గుజరాత్ ప్రభుత్వం దక్కించుకుంటోంది. తాజాగా టాటా, ఎయిర్ బస్ తో గుజరాత్ ప్రభుత్వం భారీ ఒప్పందం కుదుర్చుకుంది. టాటా, ఎయిర్ బస్ లు భారత సైన్యం కోసం రవాణా విమానాలను తయారుచేయనున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రూ.22వేల కోట్ల ఒప్పందాన్ని గుజరాత్ ప్రభుత్వం కుదుర్చుకుంది. దేశంలో ఒక ప్రైవేట్ కంపెనీ ద్వారా సైన్యానికి సంబంధించిన ఎయిర్‌క్రాఫ్ట్‌ను తయారు చేసే మొదటి ప్రాజెక్ట్ ఇదే కానుంది. ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.21,935 కోట్ల రూపాయలు అని, ఈ విమానాన్ని పౌర అవసరాలకు కూడా ఉపయోగించవచ్చని రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ తెలిపారు. ఈ మెగా ప్రాజెక్టుకు సంబధించిన తయారీ కర్మాగారాన్ని వడోదరలో ఈనెల 30వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇప్పటికే ఉద్యోగ, ఉపాధి కల్పనపై దృష్టి కేంద్రీకరించిన గుజరాత్ ప్రభుత్వం ఇటీవల కాలంలో అనేక ప్రాజెక్టులకు సంబంధించి వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటూ వస్తున్నాయి.
ఎయిర్‌బస్ నుంచి మొత్తం 56 రవాణా విమానాల కొనుగోలుకు కేంద్రప్రభుత్వం గత నెలలో ఆమోదం తెలిపింది. కాంట్రాక్ట్‌లో భాగంగా 16 విమానాలు ఫ్లై అవే కండిషన్‌లో డెలివరీ చేయనున్నారు. కాగా.. భారత్ లో మరో 40 విమానాలను కూడా తయారు చేయనున్నారు. మొదటి 16 ఫ్లై-అవే విమానాలు సెప్టెంబర్ 2023 నుంచి ఆగస్టు 2025 మధ్య అందుబాటులోకి రానున్నాయి. గుజరాత్ లో మొదటిసారి తయారుచేయబడే విమానం2026 సెప్టెంబర్ నెలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మేకిన్ ఇండియాలో భాగంగా దేశంలో తొలిసారిగా ప్రైవేట్ కంపెనీలు మిలిటరీ ప్లేన్ ల నిర్మాణం చేపట్టనున్నాయి.
మహారాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే విమర్శలు..
గుజరాత్‌లోని వడోదరలో భారత వైమానిక దళం (ఐఎఎఫ్) కోసం ఎయిర్‌బస్, టాటా గ్రూప్‌ల కన్సార్టియం సి-295 రవాణా విమానాలను తయారు చేయనున్నట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించిన నేపథ్యంలో మహారాష్ట్ర మాజీ మంత్రి ఆదిత్య ఠాక్రే మహారాష్ట్ర ప్రభుత్వం, సీఏం ఏక్ నాథ్ షిండే పై పలు విమర్శలు చేశారు. మహారాష్ట్రలో రావాల్సిన ప్రాజెక్ట్ పొరుగు రాష్ట్రానికి ఎందుకు వెళ్లిందని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మహారాష్ట్ర అభివృద్ధిపై ఏక్ నాధ్ షిండే ప్రభుత్వం సీరియస్‌గా లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో సీఏం విఫలమయ్యారని విమర్శించారు. పుణే జిల్లాలో ఆదిత్యఠాక్రే మీడియాతో మాట్లాడుతూ.. మహారాష్ట్రకు రావాల్సిన ప్రాజెక్టులు ఎందుకు బయటకు వెళ్లిపోతున్నాయో రాష్ట్ర ప్రభుత్వం సమాదానం చెబుతుందా అని అడిగారు. ఏక్ నాధ్ షిండే అధికారంలోకి వచ్చిన తర్వాత మహారాష్ట్ర నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోయిన నాలుగో ప్రాజెక్టు ఇది అని ఆరోపించారు. తమది డబుల్ ఇంజన్ ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్నారని, కానీ కేంద్ర ప్రభుత్వంలోని ఒక ఇంజన్ పని చేస్తున్నప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వ ఇంజన్ ఫెయిల్ అయిందని విమర్శించారు. వేదాంత-ఫాక్స్‌కాన్ చిప్ ప్లాంట్ డీల్, బల్క్ డ్రగ్ పార్క్, మెడికల్ డివైస్ పార్క్ టాటా-ఎయిర్‌బస్ ఎయిర్‌క్రాఫ్ట్ ప్రాజెక్టు వంటివి మహారాష్ట్ర నుంచి ఇతర రాష్ట్రాలకు తరలివెళ్లిపోయాయని ఆరోపించారు ఆదిత్య ఠాక్రే.




గతంలో తన తండ్రి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ మహా వికాస్ అఘాడి ప్రభుత్వం కరోనా మహమ్మారి సమయంలో కూడా రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురాగలిగిందని, ప్రభుత్వం అలా చేయడంలో విఫలమైందని ఆదిత్య ఠాక్రే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. సీఎం షిండే తరచూ ఢిల్లీకి వెళ్తుంటారని, కానీ ఆయన తన కోసమే వెళ్తారని, మహారాష్ట్ర అభివృద్ధి కోసం కాదన్నారు. టాటా-ఎయిర్‌బస్ ప్రాజెక్టు మహారాష్ట్రకు రావాలని ఏక్ నాధ్ షిండే మాట్లాడినట్లు తాను ఎప్పుడూ వినలేదన్నారు.
ఆదిత్యఠాక్రేకు బీజేపీ కౌంటర్
ఆదిత్యఠాక్రే విమర్శలపై బీజేపీ స్పందించింది. ఆ పార్టీ శాసనసభ్యుడు ప్రవీణ్ దారేకర్ మాట్లాడుతూ, టాటా-ఎయిర్‌బస్ ప్రాజెక్ట్ కోసం ఒప్పందం ఒక సంవత్సరం క్రితం కుదిరిందని, ఆ సమయంలో ఎవరు అధికారంలో ఉన్నారో తెలుసుకోవాలని హితవు పలికారు. గత ప్రభుత్వం దాని గురించి ఏమీ చేయలేదని, రాష్ట్రంలో ఈ ప్రాజెక్టును సులభతరం చేసేందుకు కేంద్రప్రభుత్వంతో ఎలాంటి ఉత్తరప్రత్యుత్తరాలు గత ప్రభుత్వం జరపలేదన్నారు. ప్రతిపక్షాలు నిరాధార ఆరోపణలు చేయకూడదని సూచించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..