Rewind 2025: మన హీరోలను ఢీకొట్టిన హిందీ విలన్లు.. బాక్సాఫీస్ వద్ద నార్త్ వర్సెస్ సౌత్ సెన్సేషన్!
ప్రస్తుతం భారతీయ సినీ ప్రపంచంలో టాలీవుడ్ ఒక పవర్ హౌస్‌లా మారిపోయింది. తెలుగు సినిమా రేంజ్ పెరగడంతో, ఒకప్పుడు ఇక్కడ నటించడం అంటే చిన్నచూపు చూసిన వారే ఇప్పుడు మన సినిమాల్లో ఒక్క ఛాన్స్ దొరికితే చాలు అని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ..

ప్రస్తుతం భారతీయ సినీ ప్రపంచంలో టాలీవుడ్ ఒక పవర్ హౌస్‌లా మారిపోయింది. తెలుగు సినిమా రేంజ్ పెరగడంతో, ఒకప్పుడు ఇక్కడ నటించడం అంటే చిన్నచూపు చూసిన వారే ఇప్పుడు మన సినిమాల్లో ఒక్క ఛాన్స్ దొరికితే చాలు అని లక్ష్యంగా పెట్టుకుంటున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం టాలీవుడ్‌లో విలన్లుగా నటించడానికి ఆసక్తి చూపిస్తుండటం విశేషం. 2025 ఏడాదిలో ఉత్తరాది నుంచి వచ్చిన పలువురు అగ్ర నటులు మన వెండితెరపై మెరిశారు. ఒకరు శివుడిగా కనిపించి సర్ ప్రైజ్ చేయగా, మరొకరు కరుడుగట్టిన విలన్లుగా మన హీరోలను ఢీకొన్నారు.
ఒకప్పటి లవర్ బాయ్ ఇమేజ్ ఉన్న నటులు కూడా ఇక్కడ క్రూరమైన ప్రతినాయకులుగా మారిపోయారు. మరి ఈ ఏడాది టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆ బాలీవుడ్ స్టార్స్ ఎవరు?
బాలీవుడ్ స్టార్ హీరోగా దశాబ్దాల కాలం పాటు అలరించిన బాబీ డియోల్ ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ విలన్‌గా మారిపోయారు. ‘యానిమల్’ సినిమాతో వచ్చిన గుర్తింపు ఆయన కెరీర్‌ను పూర్తిగా మార్చేసింది. నిజానికి ఈయన తెలుగులో మొదట ‘హరిహర వీరమల్లు’ ప్రాజెక్టులో నటించినప్పటికీ, దానికంటే ముందే బాలకృష్ణ నటించిన ‘డాకూ మహారాజ్’ విడుదల కావడంతో అదే ఆయన తొలి తెలుగు సినిమాగా రికార్డుల్లో నిలిచింది.
ప్రస్తుతం తెలుగులో ఏ పెద్ద సినిమా మొదలైనా విలన్ పాత్ర కోసం దర్శకుల మొదటి ఛాయిస్ ఈయనే అవుతున్నారు. అలాగే బాలీవుడ్‌లో సీరియల్ కిస్సర్‌గా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీ కూడా ఈ ఏడాది టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమాలో ఓమీ అనే స్టైలిష్ విలన్ పాత్రలో ఆయన అదరగొట్టారు. తెలుగు ప్రేక్షకులకు ఈయన విలనిజం బాగా నచ్చడంతో ముందు ముందు మరిన్ని అవకాశాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ ఏడాది అందరినీ ఆశ్చర్యపరిచిన మరో ఎంట్రీ అక్షయ్ కుమార్. బాలీవుడ్ ఖిలాడీగా గుర్తింపు పొందిన ఈయన, ఎవరూ ఊహించని విధంగా మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ‘కన్నప్ప’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు. ఇందులో శివుడి పాత్రలో ఒక చిన్న క్యామియోలో కనిపించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.
భవిష్యత్తులో ఈయన పూర్తిస్థాయి విలన్ పాత్రలో కనిపిస్తారేమో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు నాగార్జున, ధనుష్ కాంబినేషన్ లో వచ్చిన ‘కుబేర’ సినిమాతో జిమ్ సర్బ్ అనే నటుడు తెలుగు తెరకు పరిచయమయ్యారు. బాలీవుడ్‌లో తనదైన నటనతో గుర్తింపు పొందిన ఈయన, కుబేరలో తన అద్భుతమైన అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యారు.
సల్మాన్ ఖాన్ సోదరుడిగా బాలీవుడ్‌లో పరిచయమైన సొహైల్ ఖాన్ కూడా ఈ ఏడాది టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. కళ్యాణ్ రామ్ నటించిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతీ’ సినిమాలో కరుడుగట్టిన తీవ్రవాదిగా విలన్ పాత్ర పోషించారు. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోవడంతో ఆయనకు తెలుగులో ఆశించిన గుర్తింపు లభించలేదు. ఇలా ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీకి పరభాషల నుంచి వచ్చిన నటుల తాకిడి ఎక్కువగా ఉంది. తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి వెళ్లడంతో, ఇక్కడి నటులతో స్క్రీన్ షేర్ చేసుకోవడానికి బాలీవుడ్ స్టార్స్ ఆరాటపడుతున్నారు.
మొత్తానికి 2025 ఏడాది టాలీవుడ్‌కు ఒక గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌గా నిలిచింది. బాబీ డియోల్, ఇమ్రాన్ హష్మీ, అక్షయ్ కుమార్ వంటి స్టార్లు మన సినిమాల్లో భాగమవ్వడం వల్ల టాలీవుడ్ రేంజ్ మరింత పెరిగింది. రాబోయే 2026లో ఇంకెంత మంది బాలీవుడ్ దిగ్గజాలు మన వెండితెరపై మెరుస్తారో చూడాలి.
