తూ.. మీ బతుకులు.. తల్లి శవాన్ని ఇంట్లోకి తేనివ్వని కొడుకులు.. చివరకు..
గోరఖ్‌పూర్‌లో మానవత్వాన్ని మరిచిపోయిన ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు కొడుకులు తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి నిరాకరించారు. అంత్యక్రియలకు బదులు, మృతదేహాన్ని నాలుగు రోజులు ఫ్రీజర్‌లో ఉంచమని చెప్పడం దిగ్భ్రాంతిని కలిగించింది. నిస్సహాయ స్థితిలో భర్త గ్రామస్తులతో కలిసి భార్య మృతదేహాన్ని ఒక ఘాట్ పక్కన పాతిపెట్టారు.

ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో మానవత్వం మరిచిపోయిన ఒక హృదయ విదారక సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో శుభకార్యం జరుగుతోందని సాకు చెప్పి తల్లి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి ఇద్దరు కొడుకులు నిరాకరించారు. అంత్యక్రియలు జరపడానికి బదులు “నాలుగు రోజుల పాటు తల్లి మృతదేహాన్ని ఫ్రీజర్‌లో ఉంచండి. పెళ్లి తర్వాత చూసుకుంటాం” అని చెప్పడం ఆశ్చర్యం కలిగించింది. అంత్యక్రియలు చేయలేని పరిస్థితిలో దిక్కుతోచని ఆ వృద్ధుడి భార్య మృతదేహాన్ని గ్రామస్తులు ఒక ఘాట్ పక్కన బురదలో పాతిపెట్టారు.
గోరఖ్‌పూర్‌కు చెందిన భుయల్ గుప్తా, ఆయన భార్య శోభా దేవికి ముగ్గురు కొడుకులు, ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. అందరూ వివాహితులు, స్థిరపడినవారే. అయితే ఏడాది క్రితం వారి పెద్ద కొడుకు ఈ వృద్ధ దంపతులను నాకు భారంగా మారారు అని చెప్పి ఇంటి నుండి గెంటేశాడు. కుమారుడి మాటలతో తీవ్రంగా గాయపడిన ఆ దంపతులు ఆత్మహత్య చేసుకోవాలని రాజ్‌ఘాట్‌కు వెళ్లారు. అక్కడ ఒక వ్యక్తి వారిని ఆపి జౌన్‌పూర్‌లోని ఒక వృద్ధాశ్రమానికి చేర్చడానికి సహాయం చేశాడు. అప్పటి నుంచి శోభా దేవి, భుయల్ గుప్తా జౌన్‌పూర్ వికాస్ సమితి వృద్ధాశ్రమంలో కలిసి ఉంటున్నారు.
పెళ్లి కారణంగా తల్లి మృతదేహం
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న శోభా దేవి నవంబర్ 19న ఆసుపత్రిలో మరణించారు. ఆమెకు రెండు మూత్రపిండాలు చెడిపోయినట్లు వైద్యులు తెలిపారు. భార్య మరణంతో ఒంటరిగా మారిన భుయల్, అంత్యక్రియలు నిర్వహించడానికి వృద్ధాశ్రమం నిర్వాహకుల ద్వారా చిన్న కొడుకుకు ఫోన్ చేయించారు. తల్లి మరణ వార్త విని కూడా చిన్న కొడుకు “మా అన్నయ్య ఇంట్లో కొడుకు పెళ్లి జరుగుతోంది. మాట్లాడి చెప్తాను” అని ఫోన్ పెట్టేశాడు.
కొద్దిసేపటి తర్వాత తిరిగి ఫోన్ చేసిన చిన్న కొడుకు అన్నయ్య ఆదేశం మేరకు మృతదేహాన్ని నాలుగు రోజులు ఫ్రీజర్‌లో ఉంచమని, పెళ్లి తర్వాత అంత్యక్రియలు చేస్తానని చెప్పాడు. కుమారుల మాటలు విని ఆగ్రహించిన భుయల్, జౌన్‌పూర్‌లోనే అంత్యక్రియలు నిర్వహించడానికి ప్రయత్నించగా, కూతుళ్లు ఫోన్ చేసి అమ్మ మృతదేహాన్ని గోరఖ్‌పూర్ తీసుకురండి.. మేమే అంత్యక్రియలు చేస్తాం అని చెప్పారు.
గ్రామస్తుల జోక్యంతో..
గోరఖ్‌పూర్ చేరుకున్న భుయల్ గుప్తా, శోభా దేవి మృతదేహాన్ని ఇంటికి తీసుకురావడానికి ప్రయత్నించగా పెద్ద కొడుకు ఇంట్లో పెళ్లి జరుగుతోందని చెప్పి మృతదేహాన్ని లోపలికి తీసుకెళ్లడానికి నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు, బంధువులు జోక్యం చేసుకుని చివరకు భుయల్ భార్య మృతదేహాన్ని కాంపియర్‌గంజ్‌లోని ఒక ఘాట్ సమీపంలో బురదలో పాతిపెట్టారు. తమ భార్యకు కనీసం దహన సంస్కారాలు కూడా చేయలేకపోయానని భయల్ ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
