Heart Attack: గర్బా నృత్యం చేస్తూ గుండెపోటుతో 10 మంది మృతి.. 24 గంటల్లోనే అంబులెన్స్‌లకు 500 ఫోన్‌ కాల్స్‌! పిట్టల్లా రాలిపోతున్న యువత

నవరాత్రుల వేళ గుజ‌రాత్‌లో చేసే గర్బా నృత్యోత్సవాల్లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. పసి గుండెలు ఒక్కసారిగా ఆగిపోతున్నాయి. సంప్రదాయ గర్బా నృత్యంలో పాల్గొన్నవారిలో పలువురు గుండెపోటుకు గురై అర్ధాంతరంగా ప్రాణాలొదులుతున్నారు. శుక్రవారం ఒక్క రోజే గుజరాత్‌లోని పలుచోట్ల 10 మందికి పైగా గుండెపోటుతో మృతిచెందారు. బాధితులు 13 నుంచి 17 ఏళ్ల మధ్య వయసు ఉన్న టీనేజర్లు కావడం మరింత..

Heart Attack: గర్బా నృత్యం చేస్తూ గుండెపోటుతో 10 మంది మృతి.. 24 గంటల్లోనే అంబులెన్స్‌లకు 500 ఫోన్‌ కాల్స్‌! పిట్టల్లా రాలిపోతున్న యువత
Garba Event Deaths
Follow us
Srilakshmi C

|

Updated on: Oct 23, 2023 | 10:08 AM

అహ్మదాబాద్, అక్టోబర్ 23: నవరాత్రుల వేళ గుజ‌రాత్‌లో చేసే గర్బా నృత్యోత్సవాల్లో వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. పసి గుండెలు ఒక్కసారిగా ఆగిపోతున్నాయి. సంప్రదాయ గర్బా నృత్యంలో పాల్గొన్నవారిలో పలువురు గుండెపోటుకు గురై అర్ధాంతరంగా ప్రాణాలొదులుతున్నారు. శుక్రవారం ఒక్క రోజే గుజరాత్‌లోని పలుచోట్ల 10 మందికి పైగా గుండెపోటుతో మృతిచెందారు. బాధితులు 13 నుంచి 17 ఏళ్ల మధ్య వయసు ఉన్న టీనేజర్లు కావడం మరింత కలకలం సృష్టిస్తోంది. 24 గంటల్లోనే అంబులెన్స్‌ సర్వీసులకు 500 ఫోన్‌ కాల్స్‌ వచ్చాయంటే పరిస్థితి ఎంత తీవ్రతరం అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.

గర్బా నృత్యం చేస్తూ ఖేడా జిల్లాలోని క‌ప‌ద్వంజ్‌లో 17 ఏళ్ల యువకుడు వీర్‌ షా అకస్మాత్తుగా కుప్పకూలాడు. గర్బా ఆడుతుండగా వీర్‌ షా ముక్కు నుంచి రక్తం కారడంతో సృహతప్పి పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అదే సమయంలో వేరే చోట వేడుకల్లో ఉన్న అతడి తల్లిదండ్రులు ఈ విషయం తెలిసి ఆస్పత్రికి పరుగు పరుగున వెళ్లగా అప్పటికే యువకుడు గుండెపోటుతో మరణించినట్టు వైద్యులు తెలిపారు. దీంతో ఆ తల్లిదండ్రులు కొడుకును పట్టుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కుమారుడికి జరిగినట్టుగా ఇంకెవరికీ జరగకూడదని చేతులు జోడించి నమస్కారం చేస్తూ మృతుడి తండ్రి రాయ్‌పాల్‌ షా విజ్ఞప్తి చేశాడు. దయచేసి అప్రమత్తంగా ఉండండి. విరామం తీసుకోకుండా ఎక్కువ సేపు గర్బా ఆడకండి. నా కొడుకును కోల్పోయాను. నా కొడుకు మాదిరి మరెవ్వరూ చనిపోకూడదంటూ వేడుకున్నాడు. ఈ ఘటనతో నిర్వాహకులు ఆదివారం రోజు గర్బా ఈవెంట్‌ను రద్దు చేశారు. కపంద్వాజ్‌లోని వేర్వేరు చోట్ల కూడా నిర్వాహకులు గర్బా ఈవెంట్లను రద్దు చేశారు. అహ్మదాబాద్, నవ్సారి, రాజ్‌కోట్‌లలో కూడా 20 ఏళ్లలోపు వయసున్న పలువురు గుండెపోటుతో మరణించినట్లు సమాచారం.

వడోదరలో మరో ఘటన

వడోదర జిల్లాలోని దభోయిలో 13 ఏళ్ల బాలుడు గర్బా నృత్యం చేస్తూ గుండెపోటుతో మరణించాడు. వైభవ్‌ సోనీ అనే 13 ఏళ్ల బాలుడు గర్బా ఆడి సైకిల్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా కింద పడిపోవడంతో స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో బాలుడిని కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చికిత్స చేయించి ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత కొద్ది సేపటికి బాలుడికి ఛాతీ నొప్పి రావడంతో మందులు వేసి తల్లిదండ్రులు నిద్రపుచ్చారు. కొన్ని గంటల తర్వాత బాలుడిని నిద్ర లేపగా బాలుడు స్పందించలేదు. దీంతో ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు వెంటనే మళ్లీ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. గర్బా నృత్యం కారణంగానే బాలుడు గుండె పోటు వచ్చిందా అనే విషయాన్ని వైద్యులు స్పష్టం చేయలేదు.

ఇవి కూడా చదవండి

సిద్ధ్ హాస్పిటల్‌లోని కార్డియాలజీ విభాగం ఛైర్మన్ డాక్టర్ అనురాగ్ మెహ్రోత్రా మాట్లాడుతూ.. భారతదేశంలో 11% మందికి పైగా ప్రజలు మధుమేహంతో, 15% కంటే ఎక్కువ మంది ప్రీ-డయాబెటిక్, 36% మంది అధిక రక్తపోటు, 50% కంటే ఎక్కువ మంది ఊబకాయంతో ఉన్నారు. ఇవన్నీ గుండె ధమనులలో సమస్యలకు దారితీస్తాయని, అలవాటులేని పని పనులు చేస్తే గుండె పోటు వచ్చే ప్రమాదం ఉందని మిస్టర్ మెహ్రోత్రా పేర్కొన్నారు. మరోవైపు గుజరాత్ ప్రభుత్వం కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఏ మాత్రం అనారోగ్యం అనిపించినా ఆలస్యం చేయకుండా వెంటనే ఆసుపత్రికి వెళ్లాలని సూచించింది. పండగ వేళ కార్యక్రమాలు నిర్వహించేవారు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.