Former CEC Navin Chawla: మాజీ సీఈసీ నవీన్ చావ్లా కన్నుమూత.. థర్డ్ జెండర్లకు ఓటు హక్కు కల్పించింది ఆయనే!
దేశంలో 16వ ప్రధాన ఎన్నికల అధికారిగా సేవలు అందించిన నవీన్ చావ్లా 79 ఏళ్ల వయసులో కన్నుమూశారు. థర్డ్ జెండర్ ఓటర్ల కోసం కీలక సంస్కరణకు నాంది పలికిన నవీన్ చావ్లా శనివారం అపోలోలో కన్నుమూశారు. చావ్లా మరణం పట్ల ఎన్నికల కమిషన్ సంతాపం తెలుపుతూ ట్వీట్ చేసింది. ఈయన కృషి వల్లనే థర్డ్ జెండర్ ఓటర్లకు ఓటు వేసేందుకు 'ఇతరులు' అనే కొత్త కేటగిరీనీ తీసుకువచ్చినట్లు గుర్తు చేసుకుంది..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 2: మాజీ మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) నవీన్ చావ్లా (79) శనివారం కన్నుమూశారు. అపొలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన శనివారం ఉదయం తుదిశ్వాస విడిచినట్లు మరో మాజీ సీఈసీ ఎస్‌వై ఖురేషి సోషల్ మీడియా వేదికగా తెలిపారు. పది రోజుల క్రితం బ్రెయిన్ సర్జరీ కోసం ఆస్పత్రిలో చేరారని, ఆరోగ్యం విషమించి మరణించారని ఆయన చెప్పారు. ఆయన మృతి పట్ల ఎన్నికల కమిషన్ సంతాపం తెలిపింది. 1969 బ్యాచ్ ఐఏఎస్ అయిన చావ్లా 2005 నుంచి 2009 వరకు ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన ఆయన.. 2009 ఏప్రిల్ నుంచి 2010 జులై వరకు సీఈసీగా పనిచేశారు. ఈ సమయంలో ఆయన అనేక సంస్కరణలు చేశారని, థర్డ్ జెండర్ ఓటర్లను ‘ఇతరులు’ విభాగంలో మూడో లింగంగా చేర్చి ఓటు వేసేందుకు అవకాశం కల్పించారని ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్ పేర్కొంది.
16వ సీఈసీ నవీన్ చావ్లా హయాంలో కీలక ఎన్నికలు సంస్కరణలు అమలయ్యాయి. కమిషనర్‌గా చావ్లా సీఈసీతో సమానంగా కమిషనర్లను అభిశంసించాలన్నా పార్లమెంట్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ అవసరమయ్యేలా రాజ్యాంగ సవరణ తేవాలని.. ఎన్నికల కమిషనర్ల తొలగింపు ప్రక్రియపై నిరాటంకంగా పోరాడారు. అయితే నాటి ప్రభుత్వం స్పందన కొరవడడంతో ఇది కార్యరూపం దాల్చలేదు. అలాగే స్త్రీ, పురుషతోపాటు థర్డ్ జెండర్ వ్యక్తులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ‘ఇతరులు’అనే కేటగిరీని తీసుకురావడం అందులో మరొకటి. నవీన్ చావ్లా 1992లో మదర్ థెరిసా జీవిత చరిత్ర పుస్తకానికి రచయితగా,1997లో ప్రచురితమైన లైఫ్ అండ్ వర్క్ ఆఫ్ మదర్ థెరిసా అనే పుస్తకానికి సహ రచయితగా ఉన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.