Tanuku SI Suicide: తుపాకీతో కాల్చుకుని తణుకు పోలీస్ స్టేషన్‌లో ఎస్సై సూసైడ్.. అసలేం జరిగిందంటే?
శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఎస్సై అందరూ చూస్తుండగానే తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని సూసైడ్ చేసుకున్న ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలోని తణుకులో కలకలం రేపింది. ఇటీవల అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేయడంతో.. అవమానంతో ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తుంది..

తణుకు, జనవరి 31: విధుల నిర్వహణలో ఉన్న ఓ ఎస్‌ఐ పోలీస్ స్టేషన్‌లోనే గన్‌తో కాల్చుకుని ఆత్మహత్య పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా తణుకులో శుక్రవారం (జనవరి 31) ఉదయం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
పశ్చిమగోదావరి జిల్లా తణుకులో ఎస్సై ఏజీఎస్ మూర్తి తణుకు రూరల్ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఇటీవల ఆయనపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. గేదెల అపహరణ కేసులో ఎస్సై మూర్తిపై పలు ఆరోపణలు రావడంతో ఆయన్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రస్తుతం ఆయన వీఆర్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో తనపై వచ్చిన ఆరోపణల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన ఎస్సై మూర్తి శుక్రవారం ఉదయం స్టేషన్‌కు వచ్చారు. పెనుగొండలో సీఎం పర్యటన బందోబస్తుకు వెళ్లే క్రమంలో స్టేషన్‌కు వచ్చిన ఆయన కొంతసేపు కూర్చొని.. ఆ తర్వాత బాత్‌రూమ్‌లోకి వెళ్లి.. తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని సూసైడ్ చేసుకున్నాడు.
దీంతో అప్రమత్తమైన పోలీసు సిబ్బంది ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మూర్తి ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న కుటుంబసభ్యులు మూర్తి మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎస్‌ఐ ఆత్మహత్య ఘటన జిల్లాలో సంచలనం రేకెత్తించింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.