NEET UG Topper: రోజుకు 4 గంటలే చదువు.. నో ఫిక్స్‌డ్ టైం టేబుల్.. అయినా నీట్‌లో 1st ర్యాంకు కొట్టిన హైదరాబాద్ కుర్రోడు!
NEET UG Topper Success Story.. కష్టించి సాధించిన విజయాలు కొవ్వొత్తి వెలుగు లాంటివి. ఇవి భవిష్యత్తు తరాలకు మార్గనిర్దేశం చేయడంలో దారి చూపుతాయి. చీకట్లను పారద్రోలడమే కాకుండా కలలు కనేవారి మనస్సులో సంకల్పం, ప్రేరణ జ్వాలని రేకెత్తిస్తాయి. అలాంటిదే మృణాల్ కుట్టేరి అనే హైదరాబాద్ కుర్రాడి విజయగాథ. దేశంలోనే అత్యంత కఠినమైన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET)లో ఉత్తీర్ణత సాధించడమే కాకుండా జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE)లో కూడా ఉత్తీర్ణత సాధించి అందరినీ అబ్బురపరిచాడు..

మృణాల్ కుట్టేరి హైదరాబాద్‌లో పుట్టి పెరిగాడు. తల్లిదండ్రులు, తమ్ముడు, తాతయ్యలు కుటుంబ సభ్యులు. మృణాల్ తల్లిదండ్రులు వాస్తవానికి కేరళకు చెందినవారు. వీరి కుటుంబంలో ఇప్పటి వరకూ ఎవరూ డాక్టర్ కాలేదు. మృణాల్‌కి మాత్రం డాక్టర్ కావాలనే కల బలంగా ఉండేది. దీంతో పట్టుదలతో నీట్‌కు ప్రిపేరై 720 మార్కులకు 720 మార్కులు సాధించి NEET UG 2021 ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచాడు. అంతేకాకుండా ఏకంగా 99.9 పర్సంటైల్‌తో JEEని కూడా క్రాక్ చేశాడు. 8-9 తరగతుల నుంచే మృణాల్‌కు జీవశాస్త్రం, రసాయన శాస్త్రంపై అమిత ఆసక్తిని పెంచుకున్నాడు. NEET వైపు అతని ప్రయాణం సుమారు 3.5 సంవత్సరాలు సాగింది. ఆకాష్ ఇన్స్టిట్యూట్ ద్వారా 11-12 తరగతులు చదివే సమయంలోనే నీట్ ప్రిపరేషన్ సాగించాడు. ఆ తర్వాత నీట్ యూజీ 2021లో పరీక్ష రాసి ఫస్ట్ ర్యాంకు సాధించాడు.
ఓ ఇంటర్వ్యూలో మృణాల్ మాట్లాడుతూ.. మొదట్లో నేను ఆర్మీ డాక్టర్‌ని కావాలనుకున్నాను. మెడిసిన్, అడ్వెంచర్ జీవితాన్ని గడపాలనుకున్నాను. కానీ అది క్రమంగా మెడిసిన్‌పై ఆసక్తిగా మారింది. అలాగే, కరోనా మహమ్మారి సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైద్యులను ఫ్రంట్‌లైన్‌లో చూడటం స్ఫూర్తిదాయకంగా అనిపించిందని చెప్పుకొచ్చాడు. సరిగ్గా COVID-19 మహమ్మారి సమయంలోనే మృణాల్ నీట్ టాపర్‌గా నిలిచాడు. నిజానికి, ఆ టైంలో ఆఫ్‌లైన్ నుంచి ఆన్‌లైన్ క్లాస్‌లకు మారడం వల్ల చాలా మంది విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది ఎదురైంది. మృణాల్ మాత్రం తన ప్రిపరేషన్ సాఫీగా సాగించాడు.
చాలా మంది టాపర్‌ల మాదిరిగానే మృణాల్ టైమ్‌టేబుల్‌ను ఖచ్చితంగా పాటించడం వంటివి చేయలేదట. కఠినమైన షెడ్యూల్‌ను సృష్టించడం, దానికి కట్టుబడి ఉండటం ఎన్నడూ చేయలేదని చెబుతున్నాడు. బదులుగా.. ప్రతిరోజూ కొన్ని చిన్నచిన్న లక్ష్యాలు ఏర్పరచుకుని వాటిని పూర్తి చేసేవాడినని, అయితే ఇలా అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయిన రోజులు కూడా చాలా ఉన్నాయని, కానీ తాను డిమోటివేట్ అవ్వలేదని అన్నాడు. స్టడీ అవర్స్ రోజురోజుకూ మారుతూ ఉండేవని చెప్పాడు. అధికంగా చదివిన రోజులేకాదు.. అస్సలు చదవని రోజులు కూడా ఉన్నాయట. ఇలా తన స్టడీ రొటీన్‌లో వైవిధ్యం ఉన్నప్పటికీ, మృణాల్ సగటున రోజుకు 4 గంటలు చదువుకునేవాడినని.. 5 గంటలకు మించి ఏ రోజూ ఎక్కువ చదవలేదని తన ప్రిపరేషన్ మోథడ్స్‌ను వెల్లడించాడు. ఖాళీ సమయంలో పాటలు వినడం, కామెడీ మువీలు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్‌లలో చూసేవాడినని తెలిపాడు. మృణాల్ ఆటలు కూడా బాగా అడుతాడట. ICSE 10వ తరగతి బోర్డు పరీక్షలలో 98.16%, 12వ తరగతి బోర్డులలో 88.6% స్కోర్ చేశాడు. టెన్త్ క్లాస్ చదివేటప్పుడు ఒలింపియాడ్‌లు, స్పెల్‌బీస్, క్విజ్‌లలో పాల్గొన్నన్నా.. 11-12 తరగతుల సమయంలోనే అతని దృష్టి NEET ప్రిపరేషన్‌పైకి మళ్లిందని చెప్పాడు.
12వ తరగతిలో కేవలం NEETకి మాత్రమే ప్రిపరేషన్ సాగించిన.. ఎటువంటి ప్రిపరేషన్ లేకుండా KVPY, JEE మెయిన్‌లను క్రాక్ చేశాడు. JEE మెయిన్ పరీక్షలో 99.9 శాతం స్కోర్ సాధించాడు. NTA NEET 2021 ప్రవేశ పరీక్షలో 720కి 720 స్కోర్‌తో ఆల్ ఇండియా ర్యాంక్ 1ని సాధించాడు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.