సర్కారు బడుల్లో మిథ్యగా విద్య.. 2వ తరగతి తెలుగు పాఠాలు కూడా చదవలేకపోతున్న 8వ తరగతి విద్యార్ధులు!

ఒకప్పుడు ప్రభుత్వ బడుల్లో చదువుకున్న ఎందరో ఇప్పుడు పెద్ద పెద్ద డాక్టర్లు, కలెక్టర్లు ఉద్యోగాలు చేస్తున్నారు. నాటి బడుల్లో విద్యా ప్రమాణాలు అంత మెరుగ్గా ఉండేవి. కానీ నేటి కాలంలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. కనీసం రెండో తరగతి తెలుగు పాఠాలను కూడా 8వ తరగతి విద్యార్ధులు చదవలేకపోతున్నారు. ఈ మేరకు అసర్ తాజా సర్వేలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి..

సర్కారు బడుల్లో మిథ్యగా విద్య.. 2వ తరగతి తెలుగు పాఠాలు కూడా చదవలేకపోతున్న 8వ తరగతి విద్యార్ధులు!
Learning Abilities Of Govt School Students
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 29, 2025 | 7:46 AM

హైదరాబాద్, జనవరి 29: ప్రభుత్వ బడుల్లో చదువులు నానాటికీ అడుగంటుతున్నాయి. కనీసం అక్షరాలు కూడా నేర్చుకోకుండానే విద్యార్ధులు పదో తరగతి వరకు వెళ్తున్నారు. చాలా మంది విద్యార్ధులకి చదవడం, రాయడం కూడా రావడం లేదు. ఎనిమిదో తరగతి చదివే విద్యార్థుల్లో దాదాపు సగం మంది 2వ తరగతి తెలుగు పాఠాన్ని తప్పులు లేకుండా చదవలేకపోతున్నట్లు తాజాగా అసర్‌ సర్వేలో వెల్లడైంది. ఈ విషయంలో ప్రైవేట్‌ పాఠశాలల్లోని పిల్లల పరిస్థితి కాస్త మెరుగ్గా మెరుగ్గా ఉందని తెలిపింది.

2024 సంవత్సరానికి సంబంధించిన వార్షిక విద్యాస్థాయి నివేదిక (అసర్‌)ను స్వచ్ఛంద సంస్థ ప్రథమ్‌ మంగళవారం విడుదల చేసింది. తెలంగాణ రాష్ట్రంలోని 270 గ్రామాల్లో మొత్తం 5,306 ఇళ్లకు వెళ్లి 3 నుంచి 16 సంవత్సరాల వయసున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు పరీక్షించింది. అలాగే 14 నుంచి 16 ఏళ్ల వయసు వారిలో డిజిటల్‌ అక్షరాస్యతపై సర్వే నిర్వహించి ఈ వివరాలు వెల్లడించింది. అధిక మంది విద్యార్ధులు తెలుగు పాఠ్యాంశాలను చదవలేకపోతున్నట్లు వీరి సర్వేలో తేలింది. ఇక తీసివేతలు, భాగహారాలు చేయడంలోనూ పిల్లల్లో కనీస సామర్ధ్యాలు కొరవడుతున్నట్లు పేర్కొంది. 96 శాతం విద్యార్థుల ఇళ్లల్లో స్మార్ట్‌ఫోన్‌ ఉందని, వారిలో 74.70 శాతం మంది విద్యార్ధులు వాటిని బడులకు తెచ్చుకునే పరిస్థితిలో కూడా ఉన్నారని తెలిపింది. సర్కార్‌ బడులకు వచ్చే విద్యార్థుల హాజరు 2022లో 75.50 శాతం ఉండగా అది 2024కి 73.50 శాతానికి పడిపోయినట్లు సర్వే వెల్లడించింది. కానీ టీచర్ల హాజరు శాతం మాత్రం గత సర్వే మాదిరిగానే 85.50 శాతంగా ఉంది. అంటే టీచర్లు బడులకు వస్తున్నా.. విద్యార్ధుల ప్రగతిపై వారి శ్రద్ధ ఏమాత్రం ఉందో దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.

క్రమంగా రాష్ట్రంలో 60 శాతం అంతకంటే తక్కువ పిల్లలున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల శాతం భారీగా పెరుగుతోంది. 2010లో ఇలాంటి పాఠశాలలు 17.20 శాతం ఉండగా.. 2024లో 45.20 శాతానికి చేరుకుంది. దీనిని బట్టి చూస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత ప్రమాణాలు అడుగంటుతున్నాయనడంతో ఏ మాత్రం సందేహం లేదు. ఇక 53.20 శాతం పాఠశాలల్లో మాత్రమే తాగునీరు అందుబాటులో ఉంది. 5.4% పాఠశాలల్లో మూత్రశాలలు లేవు.. 18.90 శాతం పాఠశాలల్లో ఇవి ఉన్నా వినియోగంలో లేవు. ఇదీ తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల దుస్థితి. అందుకే అధిక మంది తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కార్‌ బడుల కంటే అప్పొసప్పో చేసి ప్రైవేట్ బడుల్లో చేర్పించేందుకు మొగ్గు చూపుతున్నట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.