Stage Collapsed: లడ్డూ మహోత్సవంలో అపశృతి.. కుప్పకూలిన 65 అడుగుల ఎత్తైన వేదిక! ఏడుగురు భక్తులు మృతి
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో బాగ్‌పత్‌లో ఆదినాథుడి ఆలయంలో లడ్డూ వేడుక సందర్భంగా చెక్కతో నిర్మించిన వేదిక ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. దీంతో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. క్షతగాత్రులను హుటా హుటీన ఆస్పత్రికి తరలించారు..

బాగ్‌పత్, జనవరి 28: ఉత్తరప్రదేశ్‌లోని బాగ్‌పత్‌లో మంగళవారం ఉదయం ఘోర ఘటన చోటు చేసుకుంది. ఆదినాథ్ ఆలయంతో ఏర్పాటు చేసిన నిర్వాణ లడ్డూ మహోత్సవం సందర్భంగా మాన్ స్తంభ్ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన ఓ స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. 50 మందికి పైగా భక్తులు స్టేజ్ కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ఏడుగురు భక్తులు మరణించగా.. మరో 40 మందికిపైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తొక్కిసలాటను అదుపు చేసేందుకు యత్నించిన ఐదుగురు పోలీసులు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డారు. బరౌత్ నగరంలోని కొత్వాలి ప్రాంతంలోని గాంధీ రోడ్డులో ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. డీఎం అస్మితాలాల్, ఎస్పీ అర్పిత్ విజయవర్గీయ ఆసుపత్రులకు చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు.
శ్రీ దిగంబర్ జైన్ డిగ్రీ కళాశాల మైదానంలో లడ్డూ నిర్వాణ మహోత్సవం కింద మతపరమైన కార్యక్రమం జరగాల్సి ఉంది. ఇందుకోసం 65 అడుగుల ఎత్తులో చెక్కలతో వేదికను నిర్మించారు. దానిపై 4-5 అడుగుల ఎత్తున్న దేవుడి విగ్రహం పెట్టారు. దేవుడి విగ్రహాన్ని సందర్శించడానికి భక్తులు చెక్కలతో నిర్మించిన మెట్లు ఎక్కుతున్నారు. ఇంతలో అధిక బరువు కారణంగా దానికి నిర్మించిన మెట్లు విరిగిపోయాయి. దీంతో స్టేజీ మొత్తం కుప్పకూలింది. దీంతో పలువురు భక్తులు స్జేజీ కింద పడిపోయారు. దీంతో భక్తులు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి భయంతో అటుఇటు పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు, అధికారులు సంఘటనా స్థలంలో పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Chief Minister Yogi Adityanath took cognizance of the incident in Baghpat district. Chief Minister directed the officials to immediately reach the spot and expedite the relief work. Chief Minister gave instructions for proper treatment of the injured. Along with this, he also… https://t.co/2Gix8vk7AH
— ANI UP/Uttarakhand (@ANINewsUP) January 28, 2025
బాగ్‌పత్ జిల్లాలో జరిగిన ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని సీఎం యోగి అధికారులను ఆదేశించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.