Congress Downfall Reason: కాంగ్రెస్ పార్టీ పతనానికి ఆయన అబద్ధాలే కారణం.. ఒక్క మాటలో తేల్చేసిన సీనియర్ నేత సంజయ్ నిరుపమ్
జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మునుపెన్నడూ లేనంతగా ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. శతాబ్ధానికి పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత దుస్థితికి కారణాలపై రాజకీయ పండితులు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు.

Sanjay Nirupam: జాతీయ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ మునుపెన్నడూ లేనంతగా ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. శతాబ్ధానికి పైగా చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత దుస్థితికి కారణాలపై రాజకీయ పండితులు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలు, రాహుల్ గాంధీ అసమర్థత దీనికి కారణమన్నది కొందరి విశ్లేషణ. ప్రాంతీయ పార్టీలు దేశ వ్యాప్తంగా బలం పుంజుకోవడమే కారణమన్నది మరికొందరి అభిప్రాయం. కాంగ్రెస్ పతనానికి కారణాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ.. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత సంజయ్ నిరుపమ్ తనదైన విశ్లేషణ చేశారు. మాజీ కాగ్ వినోద్ రాయ్ అబద్ధాలే కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణమని ఔట్ లుక్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తేల్చేశారు. 2జీ స్పెక్ట్రమ్ స్కామ్ కేసు రాజకీయ ప్రేరేపితమైనదిగా ఆయన అభిప్రాయపడ్డారు. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో రూ.1.75 లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని కాగ్ నివేదికలో పేర్కొనడం రాజకీయంగా కాంగ్రెస్‌కు తీవ్ర నష్టం కలిగించిందన్నారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసేందుకు రాజకీయ ప్రత్యర్థులు కాగ్ నివేదికను అస్త్రంగా వాడుకున్నారని పేర్కొన్నారు.
2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులకు వినోద్ రాయ్ సమర్పించిన కాగ్ నివేదికను కోర్టు తోసిపుచ్చిందని సంజయ్ నిరుపమ్ గుర్తుచేశారు. ఏడేళ్ల విచారణ తర్వాత 2జీ కేటాయింపుల్లో అవకతవకలు జరిగినట్లు ఎలాంటి ఆధారాలేవీ లేవని ప్రత్యేక కోర్టు నిర్థారణకు వచ్చిందన్నారు. అందుకే మాజీ కేంద్ర టెలికాం మంత్రి ఏ.రాజా సహా నిందితులందరికీ ప్రత్యేక కోర్టు క్లీన్ చిట్ ఇచ్చిందని పేర్కొన్నారు. మరో గత్యంతరం లేకపోవడంతో ఈ నివేదిక సమర్పించినందుకు వినోద్ రాయ్ కోర్టుకు బేషరతు క్షమాపణ చెప్పారని గుర్తుచేశారు. లోపభూయిష్టమైన కాగ్ నివేదికను సమర్పించినందుకు వినోద్ రాయ్ దేశ ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బొగ్గు గనులను వేలం వేయకపోవడంపై వినోద్ రాయ్ ఇచ్చిన కాగ్ నివేదిక కూడా సరైనది కాదని పేర్కొన్నారు. మునుపటి విధానాలకు లోబడే బొగ్గు గనులను యూపీఏ సర్కారు కేటాయించిందన్నారు. ఈ విషయంలో కూడా వినోద్ రాయ్ దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.

Congress Sr Leader Sanjay Nirupam
వినోద్ రాయ్ తప్పుడు నివేదికలు, అబద్ధాల కారణంగానే కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఈ దుస్థితిని ఎదుర్కొంటోందని సంజయ్ నిరుపమ్ అభిప్రాయపడ్డారు. 2జీ కేటాయింపులకు సంబంధించి కాగ్ సమర్పించిన నాటి నివేదిక.. రాజకీయ ప్రేరేపితమైనదిగా అభిప్రాయపడ్డారు. కాగ్ నివేదిక మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రతిష్టను మసకబార్చిందన్నారు.
అలాంటి కాగ్ నివేదికను సమర్పించినందుకు వినోద్ రాయ్‌కి బీజేపీ అధికారంలోకి వచ్చాక తగిన బహుమానం ఇచ్చిందని ఆరోపించారు. ఎన్డీయే అధికారంలోకి వచ్చాక బ్యాంక్స్ బోర్డ్ బ్యూర్ ఛైర్మన్‌గా వినోద్ రాయ్‌ని కేంద్రం నియమించిందని గుర్తుచేశారు.
కాగ్ ముసాయిదా నివేదిక మీడియాకు ఎలా లీక్ అయ్యిందో అర్థంకావడం లేదని సంజయ్ నిరుపుమ్ అన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మీడియా, బీజేపీ పెద్ద ఎత్తున దేశ వ్యాప్త అవినీతి వ్యతిరేక ఉద్యమ ప్రచారం చేశాయని.. దీని కారణంగానే 2014 ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించిందని విశ్లేషించారు. 2జీ, బొగ్గు గనుల కేటాయింపులపై కాగ్ నివేదికలతో కాంగ్రెస్ పార్టీకి జరిగిన నష్టం భర్తీ చేయలేనిదిగా అభిప్రాయపడ్డారు.
2జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల్లో అవినీతి కారణంగా ప్రభుత్వ ఖజానాకు రూ.1.75 లక్షల కోట్లు, కోల్ స్కామ్ కారణంగా రూ.1.8 లక్షల కోట్ల నష్టంవాటిల్లినట్లు అప్పట్లో కాగ్ నివేదికలు సమర్పించడం తెలిసిందే.
Also Read..
Rajinikanth Health Bulletin: సూపర్ స్టార్ రజినీకాంత్ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల..
Leander Paes – TMC: గోవా రాజకీయాల్లో మరో సంచలనం.. టీఎంసీలో చేరిన టెన్నిస్ స్టార్ ప్లేయర్




