Collector Suspended: రెచ్చిపోయిన కలెక్టర్.. వేటు వేసిన రాష్ట్ర సర్కార్.. అసలు మ్యాటర్ ఏంటంటే..
Collector Suspended: కోవిడ్ నిబంధనల పేరుతో పెళ్లిని మధ్యలోనే ఆపేసిన త్రిపుర పశ్చిమ జిల్లా మేజిస్ట్రేట్(కలెక్టర్) శైలేష్ కుమార్ యాదవ్‌పై వేటు పడింది.

Collector Suspended: కోవిడ్ నిబంధనల పేరుతో పెళ్లిని మధ్యలోనే ఆపేసిన త్రిపుర పశ్చిమ జిల్లా మేజిస్ట్రేట్(కలెక్టర్) శైలేష్ కుమార్ యాదవ్‌పై వేటు పడింది. పెళ్లి తంతుని మధ్యలోనే ఆపివేసిన వీడియో వైరల్ అవగా.. ఆ వీడియో ఆధారంగా రాష్ట్ర సర్కార్ అతనిపై చర్యలకు ఉపక్రమించింది. అతన్ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఏప్రిల్ 26వ తేదీన అగర్తలాలోని ఫంక్షన్ హాల్‌లో ఓ జంట వివాహం జరుగుతోంది. వీరి వివాహానికి అధికారుల అనుమతి కూడా తీసుకున్నారు. అయితే, వివాహంపై సమాచారం అందుకున్న త్రిపుర వెస్ట్ జిల్లా మేజిస్ట్రేట్ శైలేష్ కుమార్.. అధికార యంత్రాంగంతో కలిసి ఫంక్షన్ హాల్ వద్దకు చేరుకున్నారు. పురోహితుడిపై శైలేష్ కుమార్ చేయి చేసుకున్నారు. వివాహాన్ని రద్దు చేయాలని.. వధూవరుల కుటుంబాలకు వార్నింగ్ ఇచ్చారు. అయితే, ఇరు కుటుంబాల సభ్యులు.. వివాహానికి ప్రభుత్వం నుంచి తీసుకున్న అనుమతి పత్రం శైలేష్ కుమార్‌కి చూపించినప్పటికీ దానిని ఆయన చించివేశారు. మరోవైపు వివాహ వేడుకకు హాజరైన బంధువులపై పోలీసులు దాడులకు పాల్పడ్డారు. వీరి అరాచకం అంతా కొందరు తమ ఫోన్లలో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.
కాగా, ఈ వ్యవహారంపై పలువురు బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్రంగా స్పందించారు. శైలేష్ కుమార్‌ను విధుల నుంచి తొలగించాలని కోరుతూ త్రిపుర ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. ముఖ్యమంత్రి దృష్టికి కూడా తీసుకెళ్లారు. వీరి ఫిర్యాదు మేరకు శైలేష్ కుమార్ వ్యవహారంపై ప్రభుత్వం ఇద్దరు సభ్యులతో కూడాని విచారణ కమిటీని నియమించింది. అన్నీ పరిశిలీంచిన కమిటీ.. శైలేష్ కుమార్ అతిగా ప్రవర్తించారని నిర్ధారించి అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది.
ఇదిలాఉంటే.. డీఎం శైలేష్ కుమార్ తన చర్యలపట్ల క్షమాపణలు చేబుతూనే తనను తాను సమర్థించుకున్నారు. ‘‘శాంతిభద్రతలను అమలు చేయడం, కోవిడ్-19 వ్యాప్తిని నివారించడం నా కర్తవ్యం. ఆ రాత్రి నేను చేసింది సరైనదే.’’ అని కమిటీకి శైలేష్ వివరణ ఇచ్చుకున్నారు. మరోవైపు.. మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘ఆ రోజు తాను తీసుకున్న చర్యలతో ఎవరైనా బాధపడితే క్షమించండి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజల శ్రేయస్సు కోసం కఠినంగా వ్యవహరించాల్సి వచ్చింది. అంతేతప్ప ఎవరినీ బాధపెట్టాలనుకోవడం, అవమానించడం నా ఉద్దేశ్యం కాదు.’ అని ప్రకటించారు.
Also read:




