AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Himachal Bhawan: హిమాచల్ భవన్‌ను అటాచ్ చేయండి.. ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన ఆదేశం.. ఇంతకీ ఎందుకంటే?

మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి. అసలే ఓవైపు ఉద్యోగుల జీతాలు చెల్లించలేక సతమతమవుతున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఓ ప్రైవేట్ విద్యుత్ సంస్థకు బాకీపడ్డ సొమ్ము కట్టలేక ఆ రాష్ట్ర హైకోర్టుతో మొట్టికాయలు తింటోంది. బాకీ సొమ్ము కింద ఢిల్లీలోని హిమాచల్ భవన్‌ను అటాచ్ చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశాలివ్వడంతో ఈ అంశం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Himachal Bhawan: హిమాచల్ భవన్‌ను అటాచ్ చేయండి.. ఆ రాష్ట్ర హైకోర్టు సంచలన ఆదేశం.. ఇంతకీ ఎందుకంటే?
Himachal Bhawan
Mahatma Kodiyar
| Edited By: Shaik Madar Saheb|

Updated on: Nov 20, 2024 | 9:37 AM

Share

మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి. అసలే ఓవైపు ఉద్యోగుల జీతాలు చెల్లించలేక సతమతమవుతున్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం.. ఇప్పుడు ఓ ప్రైవేట్ విద్యుత్ సంస్థకు బాకీపడ్డ సొమ్ము కట్టలేక ఆ రాష్ట్ర హైకోర్టుతో మొట్టికాయలు తింటోంది. బాకీ సొమ్ము కింద ఢిల్లీలోని హిమాచల్ భవన్‌ను అటాచ్ చేయాల్సిందిగా హైకోర్టు ఆదేశాలివ్వడంతో ఈ అంశం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో గెలుపు కోసం ప్రకటించిన ఉచిత పథకాలు, మితిమీరిన సంక్షేమ పథకాలు రాష్ట్ర ఖజానాను గుల్ల చేశాయి. చివరకు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు సైతం చెల్లించక సతమతమవుతోంది. మొత్తంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాళా తీసింది. ఈ పరిస్థితుల్లో హిమాచల్ హైకోర్టు ఇచ్చిన ఆదేశం రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్టను మరింత దిగజార్చింది.

విద్యుత్ సంస్థకు రూ. 150 కోట్ల బకాయి

హిమాచల్ ప్రదేశ్‌లోని లాహౌల్-స్పితి జిల్లాలో చీనాబ్ నదిపై ఓ హైడ్రోపవర్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం 2009లో నిర్ణయించింది. ఇందుకోసం సేలీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ లిమిటెడ్ (మోసర్ బేర్)కు 2009 ఫిబ్రవరి 28న లెటర్ ఆఫ్ అలాట్‌మెంట్ (LoA) ఇచ్చింది. ఈ మేరకు ఆ సంస్థ అప్‌ఫ్రంట్ ప్రీమియం కింద రూ. 64 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేసింది. అయితే వివిధ కారణాలతో ప్రాజెక్టు ముందుకు సాగలేదు. రాష్ట్ర ప్రుత్వం లెటర్ ఆఫ్ అలాట్‌మెంట్ రద్దు చేయడంతో పాటు అప్‌ఫ్రంట్ ప్రీమియంను జప్తు చేసుకుంటున్నట్టు ఆర్డర్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసిన ఆ ప్రైవేట్ విద్యుత్ సంస్థకు అనుకూలంగా ఆర్బిట్రేటర్ తీర్పునిచ్చారు. అప్‌ఫ్రంట్ ప్రీమియం కింద చెల్లించిన మొత్తానికి వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని ఆదేశించారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్పును అమలు చేయకపోవడంతో సదరు విద్యుత్ సంస్థ హిమాచల్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

వాదోపవాదాల అనంతరం ప్రాజెక్టు ఆర్థికంగా, సాంకేతికంగా సాధ్యపడదని, అందుకే విద్యుత్ సంస్థ వెనక్కితగ్గడాన్ని ఆమోదించవచ్చని అభిప్రాయపడింది. అంతేకాదు, 2023 జనవరి 13న ఆర్బిట్రేటర్ ఇచ్చిన తీర్పుు కూడా సమర్ధించింది. కేసు తుది తీర్పు ఇచ్చేలోగా రాష్ట్ర ప్రభుత్వం అప్‌ఫ్రంట్ ప్రీమియం కింద తీసుకున్న సొమ్ముకు వడ్డీతో కలిపి హైకోర్టు రిజిస్ట్రీ వద్ద డిపాజిట్ చేయాలని ఆదేశించింది. కోర్టు చెప్పినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేయకపోవడంతో ఆ సొమ్ము కాస్తా 7% వడ్డీతో కలిపి మొత్తం రూ. 150 కోట్లకు చేరుకుంది. అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం డిపాజిట్ చేయలేకపోవడంతో.. ఢిల్లీలో ఉన్న ఆ రాష్ట్ర భవన్ (హిమాచల్ భవన్)ను అటాచ్ చేయాల్సిందిగా ఆదేశించింది. హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ అజయ్ మోహన్ గోయల్ ఈ తీర్పునిచ్చారు. తదుపరి విచారణ డిసెంబర్ 6 వరకు వాయిదా వేస్తూ.. ఆలోగా నిర్లక్ష్యానికి బాధ్యులైన అధికారులను గుర్తించాలని విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శికి ఆదేశాలు జారీ చేశారు. ఈ తీర్పు రాష్ట్ర ప్రభుత్వాన్ని యావద్దేశం ముందు తలదించుకునేలా చేసింది. ఈ తీర్పుపై రాష్ట్ర అడ్వకేట్ జనరల్ అనూప్ రతన్ స్పందిస్తూ.. హైకోర్టు ఆదేశాలను సవాల్ చేశామని, వచ్చే నెల కేసు విచారణకు వస్తుందని వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..