AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Delhi Blast: బాంబు పేల్చిన మృగం వీడే.. తేల్చిన డీఎన్ఏ.. వెలుగులోకి సంచలన విషయాలు..

ఢిల్లీ కారు పేలుడు అసలు నిందితుడిని దర్యాప్తు బృందాలు గుర్తించాయి. కారు నడిపింది డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని తేల్చాయి. ఉమర్ డీఎన్ఏ అతడి తల్లి డీఎన్ఏతో మ్యాచ్ అయినట్లు అధికారులు తెలిపారు. అయితే జైష్-ఏ-మొహమ్మద్ మాడ్యూల్ ప్లాన్ చేసిన ఆ పెద్ద ఉగ్రవాద కుట్ర ఏమిటో ఇంకా అస్పష్టంగానే ఉంది. ప్రాథమిక విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Delhi Blast: బాంబు పేల్చిన మృగం వీడే.. తేల్చిన డీఎన్ఏ.. వెలుగులోకి సంచలన విషయాలు..
Dna Confirms Umar Un Nabi As Red Fort Car Bomber
Krishna S
|

Updated on: Nov 13, 2025 | 8:50 AM

Share

దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సాయంత్రం జరిగిన కారు పేలుడు ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పేలిపోయిన కారును నడిపిన ప్రధాన నిందితుడు మరెవరో కాదు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ అని DNA పరీక్ష ద్వారా నిర్ధారించారు. ఈ పేలుడులో 12 మంది మరణించగా.. 20మందికిపైగా గాయపడ్డారు. దర్యాప్తు సంస్థలు డాక్టర్ ఉమర్ ఉన్ నబీ తల్లి DNA నమూనాలను, పేలుడు జరిగిన ప్రదేశం నుండి, ముఖ్యంగా కారు నుంచి స్వాధీనం చేసుకున్న ఎముకలు, దంతాల DNA నమూనాలతో సరిపోల్చాయి. DNA నమూనాలు పూర్తిగా సరిపోలాయి. పేలుడు తర్వాత డాక్టర్ ఉమర్ కాలు స్టీరింగ్ వీల్, యాక్సిలరేటర్ మధ్య చిక్కుకుపోయినట్లు కూడా దర్యాప్తులో తేలింది. ఈ వివరాలు ఉమరే కారును నడిపినట్లు స్పష్టం చేస్తున్నాయి.

వరుస పేలుళ్లకు ప్లాన్

అరెస్టు చేసిన ఇతర ఉగ్రవాద అనుమానితులను ప్రశ్నించగా.. డాక్టర్ ఉమర్ ఏదో అద్భుతమైనది చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పినట్లు దర్యాప్తు వర్గాలు వెల్లడించాయి. అయితే జైష్-ఏ-మొహమ్మద్ మాడ్యూల్ ప్లాన్ చేసిన ఆ పెద్ద ఉగ్రవాద కుట్ర ఏమిటో ఇంకా అస్పష్టంగానే ఉంది. ప్రాథమిక దర్యాప్తులో ఉమర్ బృందం.. నేషనల్ క్యాపిటల్ రీజియన్‌తో సహా దేశవ్యాప్తంగా వరుస పేలుళ్లకు ప్రణాళికలు వేస్తున్నట్లు వెల్లడైంది. ఈ పేలుడుకు ముందు పోలీసులు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో దాడులు చేసి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అనుమానితులను అరెస్టు చేయడం, భారీగా పేలుడు పదార్థాలను పట్టుకోవడం వంటి చర్యలు ఉమర్‌ను భయపెట్టి ఉండవచ్చని, అందుకే అతను తమ ప్రణాళిక కంటే ముందే తొందరగా దాడి చేశాడని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి.

ఉమర్, అతని సహచరులు ఐఈడీలు, అసాల్ట్ రైఫిళ్లను ఉపయోగించి భారీ దాడులు చేయడానికి మూడు మూడు వాహనాలను కొనుగోలు చేసినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఫరీదాబాద్‌లోని ఒక గ్రామంలో స్వాధీనం చేసుకున్న ఎర్ర ఎకోస్పోర్ట్‌ను మరో ఉగ్రవాద అనుమానితుడు డాక్టర్ ముజమ్మిల్ ఉపయోగించినట్లు దర్యాప్తులో తేలింది. పేలుడుకు సంబంధించిన కారు అమ్మకం, కొనుగోలుతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

ఉమర్ కుటుంబం దిగ్భ్రాంతి

ఉమర్ నబీ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడాన్ని కుటుంబ సభ్యులు నమ్మలేకపోతున్నారు. ఉమర్ నబీ వదిన ముజామిల్ మాట్లాడుతూ.. ఉమర్ చిన్నప్పటి నుంచీ సైలెంట్‌గా ఉండేవాడని.. స్నేహితులు తక్కువని, చదువుపై మాత్రమే దృష్టి పెట్టేవారని తెలిపారు. ‘‘అతను ఫరీదాబాద్‌లోని ఒక కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. పరీక్షలతో బిజీగా ఉన్నానని, మూడు రోజుల తర్వాత ఇంటికి తిరిగి వస్తానని శుక్రవారం ఫోన్ చేశాడు. అతని లాంటి వ్యక్తి ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొనడం షాక్‌కు గురిచేసింది’’ అని ముజామిల్ ఆవేదన వ్యక్తం చేశారు.

రంగంలోకి ఎన్ఐఏ

ఈ పేలుడులో అమ్మోనియం నైట్రేట్, ఇంధన నూనె, డిటోనేటర్లను ఉపయోగించినట్లు ప్రాథమిక పరిశోధనలు వెల్లడించాయి. దీనికి ఫరీదాబాద్‌లో బయటపడిన 2,900 కిలోల పేలుడు పదార్థాలతో సంబంధం ఉంది. ప్రస్తుతం చట్టవిరుద్ధ కార్యకలాపాల చట్టం, పేలుడు పదార్థాల చట్టం కింద పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తును హోంశాఖ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి అప్పగించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..