AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టార్గెట్ డిసెంబర్ 6.. బాబ్రీ మసీదు ఘటనకు ప్రతీకారం.. దర్యాప్తులో సంచలన విషయాలు..

ఢిల్లీలో జైష్-ఎ-మొహమ్మద్ మరో ఉగ్ర కుట్ర భగ్నమైంది. డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా రాజధానిలోని ఆరు ప్రాంతాల్లో పేలుళ్లకు ప్లాన్ చేశారు. ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు దర్యాప్తులో ఈ భయంకరమైన ప్రణాళిక వెల్లడైంది. ఉన్నత విద్యావంతులతో కూడిన ఈ ఉగ్రవాద మాడ్యూల్‌ ఐదు దశల్లో దాడులను ప్లాన్ చేసింది.

టార్గెట్ డిసెంబర్ 6.. బాబ్రీ మసీదు ఘటనకు ప్రతీకారం.. దర్యాప్తులో సంచలన విషయాలు..
Jem Planned 6 Blasts In Delhi On Dec 6
Krishna S
|

Updated on: Nov 13, 2025 | 11:45 AM

Share

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. ఈ క్రమంలో అధికారులు ఒక భయంకరమైన ఉగ్రవాద కుట్రను ఛేదించారు. జైష్-ఎ-మొహమ్మద్ అనుబంధ ఉగ్రవాద మాడ్యూల్.. డిసెంబర్ 6న ఢిల్లీలోని ఆరు ప్రధాన ప్రదేశాలలో పేలుళ్లు జరపడానికి ప్రణాళిక వేసినట్లు అధికారులు తెలిపారు. డిసెంబర్ 6ను ఉగ్రవాదులు వ్యూహాత్మకంగా ఎంచుకున్నారు. 1992లో అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత జరిగిన రోజు ఇది. అరెస్ట్ అయిన అనుమానిత ఉగ్రవాదులు విచారణలో బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ తేదీని లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు.

5 దశల్లో దాడులకు ప్లాన్

జైష్ చీఫ్ మసూద్ అజార్ కూడా గతంలో తన కాలమ్‌లలో అయోధ్యను లక్ష్యంగా చేసుకుంటానని బెదిరింపులు జారీ చేసిన నేపథ్యంలో ఈ తేదీ ఎంపికకు ప్రాధాన్యత ఏర్పడింది. ఉన్నత నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. ఉగ్రవాద మాడ్యూల్ సభ్యులు ఢిల్లీలో వరుస పేలుళ్లు నిర్వహించడానికి ఒక ఐదు దశల ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు.

దశ 1: మాడ్యూల్ ఏర్పాటు: జైష్-ఎ-మొహమ్మద్, అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్‌లతో సంబంధం ఉన్న ఉగ్రవాద మాడ్యూల్‌ను ఏర్పాటు చేశారు. ఈ మాడ్యూల్‌లో ఉన్నత విద్యావంతులైన నిపుణులు, ముఖ్యంగా వైద్యులు ఉన్నారు.

దశ 2: ముడిసరుకు సేకరణ: హర్యానాలోని నుహ్, గురుగ్రామ్ నుండి ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌లు అసెంబుల్ చేయడానికి అవసరమైన మందుగుండు సామగ్రిని, ముడి పదార్థాలను సేకరించారు.

దశ 3: ఐఈడీల తయారీ – నిఘా: ఐఈడీలను తయారు చేసి, పేలుళ్లు జరపడానికి ఉద్దేశించిన ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించడం.

దశ 4: బాంబుల పంపిణీ: నిఘా పూర్తయిన తర్వాత అసెంబుల్ చేసిన బాంబులను మాడ్యూల్ సభ్యుల మధ్య పంపిణీ చేయడానికి సిద్ధమయ్యారు.

దశ 5: సమన్వయ దాడులు: ఢిల్లీలోని ఆరు నుండి ఏడు వేర్వేరు ప్రదేశాలలో సమన్వయంతో బాంబు దాడులు నిర్వహించడం.

ఎర్రకోట పేలుడు: వెలుగులోకి కుట్ర

ఈ ఉగ్రవాద మాడ్యూల్ మొదట ఆగస్టులో దాడులు చేయాలని భావించింది. కానీ కార్యాచరణ ఆలస్యం కావడంతో డిసెంబర్ 6ను ఎంచుకుంది. ఇక ఢిల్లీ పేలుడు ఘటనలో 12 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఫరీదాబాద్‌లో భారీ దాడుల కోసం నిల్వ చేసిన అమ్మోనియం నైట్రేట్‌ను స్వాధీనం చేసుకుని, ఉమర్ సహచరులైన వైద్యులు ముజమ్మిల్ షేక్, షాహీన్ సయీద్‌లను అరెస్టు చేయడంతో ఉమర్ భయాందోళనకు గురయ్యాడు. సహచరుల అరెస్ట్‌తో ఉమర్ టెన్షన్ పడి.. భయంతోనే ఆ కారు పేలుడుకు పాల్పడ్డాడు.

ఈ వైద్యులు అంతా జైష్ కొత్తగా ఏర్పడిన, అత్యంత విద్యావంతులైన నిపుణులతో కూడిన ఉగ్రవాద మాడ్యూల్‌లో భాగమని అధికారులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతోంది. దేశ రాజధాని ప్రాంతంలో భారీ విధ్వంసానికి పన్నిన ఈ కుట్ర భగ్నమైనందుకు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..