Prison: జైళ్లలో ఖైదీల వద్ద 117 సెల్ ఫోన్లు, కత్తులు లభ్యం.. కారాగారం నుంచే దేశాన్ని ఏలుతున్న గ్యాంగ్‌స్టర్లు
జైళ్లలోని కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ల వద్ద సెల్ ఫోన్లు, కత్తులు భారీ సంఖ్యలో లభ్యమ్యాయి. జైళ్లలోని ఖైదీలకు ఇటువంటి నిషేధ వస్తువులను అందించినందుకు గానూ దాదాపు ఐదుగురు అధికారులు సస్పెండ్ అయ్యారు..
దేశ రాజధాని జైళ్లలోని కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్ల వద్ద సెల్ ఫోన్లు, కత్తులు భారీ సంఖ్యలో లభ్యమ్యాయి. జైళ్లలోని ఖైదీలకు ఇటువంటి నిషేధ వస్తువులను అందించినందుకు గానూ దాదాపు ఐదుగురు అధికారులు సస్పెండ్ అయ్యారు. ఢిల్లీలోని పలు జైళ్లలో ఖైదీలకు వీఐపీ ట్రీట్‌మెంట్ జరుగుతున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు నిర్వహించవల్సిందిగా జైలు సూపరింటెండెంట్‌లకు జైళ్ల డైరెక్టర్ జనరల్ సంజయ్ బనివాల్ ఆదేశాలు జారీ చేశారు.
ఈ క్రమంలో ఖైదీల వద్ద మొబైల్ ఫోన్స్, కత్తులు, హీటర్స్, ఫోన్ చార్జర్లు, పెన్ డ్రైవ్‌లు లభ్యమయ్యాయి. ఢిల్లీలోని తీహార్, మండోలి, రోహిణిలోని 3 జైళ్లలో అధికారులు చేపట్టిన సెర్చ్ ఆపరేషన్లలో 115 మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. గ్యాంగ్‌స్టర్ల వద్ద కొన్ని మొబైల్స్ దొరికాయి. ఫోన్లతోపాటు 3 కత్తులు,1 గది హీటర్, చేతితో తయారు చేసిన హీటర్లు 7, పెన్ డ్రైవ్‌లు 2, కెటిల్స్ 2 లభ్యమయ్యాయి. ఆయా జైళ్లకు సంబంధించి పక్కా సమాచారం అందడంతో ఈమేరకు గత 15 రోజులుగా అధికారులు తనిఖీలు చేపట్టారు. ఐదుగురు జైలు అధికారులను తీహార్ డీజీ సంజయ్ బెనివాల్ సస్పెండ్ చేశారు.
అందుకే తీహార్ జైలు నుంచి బదిలీ ..
జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్లు జైలు నుంచే బయట తమ పనులు యదేచ్ఛగా నిర్వహిస్తున్నారనే ఆరోపణలు జైలు అధికారులపై ఉన్నాయి. ఇక తాజా సంఘటన ఈ ఆరోపణలకు ఆజ్యం పోసినట్లైంది. డీజీ (జైళ్లు) సందీప్ గోయల్ నవంబర్‌లో తీహార్ జైలు నుంచి బదిలీ అయిన సంగతి తెలిసిందే. జైలులో తనకు భద్రత కల్పించేందుకు అధికారులకు ఆప్ నేత సత్యేందర్ జైన్ రూ.10 కోట్లు ఇచ్చినట్లు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాకు చంద్రశేఖర్ లేఖ రాశారు. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో మండోలి జైలులో శిక్ష అనుభవిస్తున్న చంద్రశేఖర్, ఆప్ నేత సత్యేందర్ జైన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. చంద్రశేఖర్ ఆరోపించిన కొద్ది రోజులకే వీడియో క్లిప్‌లు బయటకు రావడంతో అక్కడి డైరెక్టర్ జనరల్ సందీప్ గోయల్‌ను తీహార్ జైలు నుంచి బదిలీ చేస్తూ శుక్రవారం (నవంబర్ 4)న ఉత్తర్వులు జారీ చేశారు. అతని స్థానంలో ఐపీఎస్ అధికారి సంజయ్ బెనివాల్ నియమితులయ్యారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.