Supreme Court: ఆ భూముల పర్యవేక్షణ హక్కులు ఉన్నంత మాత్రాన భూస్వాములు కాలేరు.. సంచలన తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు

Balaraju Goud

Balaraju Goud |

Updated on: Sep 07, 2021 | 4:42 PM

ఆలయ భూములకు సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఆలయానికి ఇచ్చిన భూములకు దేవుడే యజమాని అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

Supreme Court: ఆ భూముల పర్యవేక్షణ హక్కులు ఉన్నంత మాత్రాన భూస్వాములు కాలేరు.. సంచలన తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు
Supreme Court

Supreme Court on Temple Land: ఆలయ భూములకు సంబంధించి భారత అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించింది. ఆలయానికి ఇచ్చిన భూములకు దేవుడే యజమాని అని, పూజారికి ఎలాంటి యాజమాన్య హక్కులు ఉండబోవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. దేవుడి భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డుల్లో పూజారులు పేర్లు రాయాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పింది. పూజారులు కేవలం దేవుడి ఆస్తులను అన్యాక్రాంతం కాకుండా చూసే సంరక్షకులు మాత్రమేనని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దేవుడి భూములపై పర్యవేక్షణ హక్కులు ఉన్నంత మాత్రాన వారు ఎప్పటికీ భూస్వాములు కాలేరని స్పష్టం చేసింది. మధ్యప్రదేశ్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం వేసిన ఓ పిటిషన్‌‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

ఆలయాల ఆస్తులను పూజారులు అనధికారికంగా విక్రయించకుండా ఉండేందుకు మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఇటీవల కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆలయ భూములకు సంబంధించిన రెవెన్యూ రికార్డుల నుంచి పూజారుల పేర్లు తొలగించాలంటూ రెండు సర్క్యులర్లు జారీ చేసింది. అయితే, దీనిపై కొందరు హైకోర్టుకు వెళ్లగా.. ఈ ఆదేశాలను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం.. ఆలయ భూములకు దేవుడే యజమాని అని స్పష్టం చేసింది. ‘‘ఆలయ భూములకు సంబంధించిన రికార్డుల్లో ఓనర్‌షిప్‌ కాలమ్‌ వద్ద కేవలం దేవుడి పేరు మాత్రమే ఉండాలి. అనుభవదారు అనే కాలమ్‌లోనూ దేవుడే పేరే ఉండాలి. ఎందుకంటే ఆ భూములకు దేవుడే యజమాని. పూజారి కేవలం దేవుడి ఆస్తులను నిర్వహిస్తూ, పర్యవేక్షిస్తుంటాడు. అయినంత మాత్రాన పూజారుల పేర్లు అక్కడ రాయాల్సిన అవసరం లేదని ధర్మాసనం పేర్కొంది. చట్టప్రకారం.. పూజారి అంటే వ్యవసాయంలో కౌలుదారుడు కాదు. దేవుడికి పూజలు చేసే వ్యక్తి. అయితే దేవస్థానం తరఫున ఆ భూమిని కలిగి ఉంటాడు. దేవుడి ఆస్తులను పరిరక్షిస్తుంటాడు. అంతమాత్రాన అతడు భూస్వామి కాలేడు’’ అని సుప్రీం ధర్మాసనం తీర్పు వెలువరించింది.

Read Also… Amit Shah Tour: తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన ఖరారు.. వెయ్యి ఊడల మర్రి సాక్షిగా భారీ బహిరంగసభ..!

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu