AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CM Revanth Reddy: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. ఆ ప్రాజెక్టులపైనే మెయిన్ ఫోకస్

తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలకు కేంద్రం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర భవిష్యత్తు అవసరాలకు గోదావరి జలాల వినియోగం అత్యంత ముఖ్యమని తాజాగా ఢిల్లీలో జరిగిన భేటీ సందర్భంగా ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.

CM Revanth Reddy: ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ.. ఆ ప్రాజెక్టులపైనే మెయిన్ ఫోకస్
Cm Revanth Reddy Meets Pm Modi
Gopikrishna Meka
| Edited By: |

Updated on: Jun 11, 2026 | 9:54 PM

Share

తాజాగా ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించి పలు కీలక అంశాలపై ఆయనతో చర్చించారు. తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. అలాగే హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఫేజ్‌–2 విస్తరణ ప్రతిపాదనలను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఫేజ్‌–2లో 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు రూ.38,595 కోట్ల ప్రతిపాదనలు సమర్పించినట్టు వివరించారు. ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్‌ వెంచర్‌గా మంజూరు చేయాలని కోరారు.

రీజినల్ రింగ్ రోడ్ పనుల వేగవంతం

హైదరాబాద్‌ రీజినల్‌ రింగ్‌ రోడ్‌ పనులకు వెంటనే ఆమోదం తెలపాలని ముఖ్యమంత్రి కోరారు. ఉత్తర భాగంలో భూసేకరణ ఖర్చులో 50 శాతం వాటా భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించిందని, ఎన్‌హెచ్‌ఏఐకి రూ.626 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. ఉత్తర భాగానికి సంబంధించి 90 శాతానికి పైగా భూసేకరణ అవార్డు పూర్తయిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.

ట్రిపుల్‌ ఆర్‌లో దక్షిణ భాగం నిర్మాణం కూడా అంతే కీలకమని ముఖ్యమంత్రి వివరించారు. చౌటుప్పల్‌ నుంచి సంగారెడ్డి వరకు దక్షిణ కారిడార్‌ నిర్మాణం పూర్తయితే హైదరాబాద్‌ చుట్టూ రవాణా వ్యవస్థ మరింత బలోపేతమవుతుందని తెలిపారు. దక్షిణ భాగానికి సంబంధించిన అలైన్‌మెంట్‌ మ్యాపులు, హెచ్‌ఎండీఏ మాస్టర్‌ ప్లాన్‌ నోటిఫికేషన్లను ఇప్పటికే కేంద్ర రోడ్డు రవాణా శాఖకు అందించామని చెప్పారు. ఉత్తర, దక్షిణ కారిడార్లను ఒకేసారి ఆమోదించి అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.

హైదరాబాద్–అమరావతి–బందర్ పోర్ట్ ఎక్స్‌ప్రెస్‌వే

హైదరాబాద్‌–అమరావతి–బందర్‌ పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌వేకు కేంద్రం అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి కోరారు. హైదరాబాద్‌ నుంచి అమరావతి మీదుగా బందర్‌ పోర్టును కలిపే 12 లేన్‌ ఎక్స్‌ప్రెస్‌వే తెలంగాణకు వ్యూహాత్మకంగా ఉపయోగపడుతుందని చెప్పారు.120 మీటర్ల రైట్‌ ఆఫ్‌ వే తో ప్రతిపాదించిన ఈ హైవే ద్వారా సముద్ర తీరం లేని తెలంగాణకు పోర్ట్‌ కనెక్టివిటీ లభిస్తుందని వివరించారు. ఫార్మా, ఎలక్ట్రానిక్స్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాల ఎగుమతులకు ఇది కీలక మార్గంగా నిలుస్తుందని తెలిపారు.

వరంగల్ ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణ

వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ పనులను ప్రారంభించాలన్న అంశాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రధానంగా ప్రస్తావించారు. ఇప్పటికే అవసరమైన భూసేకరణ పూర్తిచేసి ఎయిర్ పోర్ట్ అథారిటీకి అప్పగించామని తెలిపారు. వరంగల్‌ ఎయిర్‌పోర్ట్‌ అందుబాటులోకి వస్తే ఉత్తర తెలంగాణ పారిశ్రామిక, విద్యా, పర్యాటక రంగాలకు మరింత లబ్ది చేకూరుతుందని అన్నారు.

హైదరాబాద్‌లో ‘ఐఐఎం’ (IIM) ఏర్పాటు

అలాగే హైదరాబాద్‌లో ఐఐఎం ఏర్పాటు చేయాలని కోరారు. ఐఐఎంకు అవసరమయ్యే 200 ఎకరాల స్థలం కేటాయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తెలంగాణలో ఇప్పటికే ఐఐటీ, ఐఐఐటీ, నల్సార్‌, టీఐఎఫ్‌ఆర్‌ వంటి ప్రముఖ జాతీయ విద్యాసంస్థలున్నాయని, ఐఐఎం ఏర్పాటు చేస్తే నూతన విద్యావిధానం-2020 ఆశించిన లక్ష్యం కూడా నెరవేరుతుందని ప్రస్తావించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us