మళ్లీ ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై యుద్ధ పంజా.. ఇక పరేషాన్లే పరేషాన్లు..
Iran US Conflict: మిడిల్ ఈస్ట్‌లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే సంకేతాలు కనిపిస్తున్నాయి. హొర్ముజ్ జలసంధి వద్ద ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల, ఇంధన వ్యయాలు అధికమవడం వంటి పరిణామాలు సామాన్యుడిపై భారం మోపే అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

అమెరికాపై కల్లో కూడా గెలవలేమని తెలిసినా ఇరాన్ యుద్ధం చేస్తూనే ఉంటుంది. ఇరాన్‌పై యుద్ధం ఎప్పుడో గెలిచేశాం అని ట్రంప్ పదకొండోసారి ప్రకటించుకుంటారు. ఇరాన్ మీదికి ఇజ్రాయెల్‌ని ఉసిగొల్పిన అమెరికానే, ఇప్పుడు ఇకచాలు, ఇరాన్‌ని ఒదిలిపెట్టమని బతిమిలాడుకుంటుంది. ఆ వెంటనే ఏదో ఒక కుంటిసాకుతో ఇరాన్ మీదికి అమెరికానే మిస్సైళ్లతో దొంగదెబ్బ తీస్తుంది. ముగ్గురు మూర్ఖుల మధ్య జరిగే ఈ అర్థం లేని యుద్ధానికి ప్రపంచమంతా మాటల్లో చెప్పుకోలేనంత మూల్యం చెల్లించుకుటోంది. ఆరునెలల నుంచి కొనసాగుతున్న నాన్‌స్టాప్ నాన్సెన్స్.. ఇదిగో ఇప్పుడు మళ్లీ మొదటికొచ్చిందా? ట్రాజెడీ ఏంటంటే, యుద్ధంతో ప్రమేయమే లేని సామాన్యుడే ఇక్కడ ఎక్కువగా దెబ్బైపోతున్నాడు. శుద్దపూసలా ఫోజు కొడుతున్న అమెరికా తాను ఒట్టి యుద్ధపూసనని మళ్లీ ప్రూవ్ చేసుకుంది. చిన్న గ్యాప్ ఇచ్చా.. చిటికెలో వచ్చేస్తా అన్న ట్రంప్, అన్నంత పనీ చేశాడు. ఫలితం ఊహించిందే… పశ్చిమాసియా మళ్లీ భగ్గుమంది. తమ అపాచీ హెలికాప్టర్‌ను కూల్చేసినందుకే తెగ గింజుకుని ఇరాన్‌పై విరుచుకుపడింది అమెరికా. 49 తోమహాక్ మిస్సైళ్లతో ఇరాన్ రాడార్, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను ఛిద్రం చేసినట్టు చెప్పుకుంది. దక్షిణ ఇరాన్‌లోని మినాబ్, బందర్ అబ్బాస్, సిరిక్, టెహ్రాన్ నగరాల్ని స్పెసిఫిక్‌గా టార్గెట్‌చేసిమరీ కొట్టింది. కేవలం ఆత్మరక్షణ కోసమే దాడులు చేసినట్టు సెంట్రల్ కమాండ్ చెప్పుకుంటున్నా, ట్రంప్ లోపలున్న యుద్ధకాంక్ష మళ్లీ జడలు విప్పినట్టు క్లియర్‌గా తెలుస్తోంది. ఇరాన్ మాత్రం తక్కువ తినిందా? గల్ఫ్ ప్రాంతాన్ని ఎరుపెక్కించింది. కువైట్, బహ్రెయిన్‌లోని అమెరికన్ ఎయిర్‌బేస్‌లపై డ్రోన్లతో...
