‘కిడ్నీ మార్పిడికి డబ్బే అడ్డంకి కాకూడదనీ.. 33 ఏళ్లలో 9 లక్షలకుపైగా ఉచితంగానే..’ ఓ డాక్టర్ మానవతా సేవ
చెన్నై వీధుల్లో ఆటోరిక్షా నడుపుతున్న చంద్రన్‌ను చూస్తే.. ఆయన దశాబ్దం క్రితమే కిడ్నీ మార్పిడి చేయించుకున్న వ్యక్తి అని ఎవరూ భావించారు. అంతేకాదు, కిడ్నీ మార్పిడికి అవసరమైన డబ్బు కూడా అప్పట్లో ఆయన వద్ద లేదు. ఆయన భార్య కిడ్నీ దాతగా ముందుకు వచ్చినప్పటికీ, ఆపరేషన్ ఖర్చు పెద్ద సమస్యగా మారింది. ఆ సమయంలో ప్రముఖ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ జార్జి అబ్రహం క్రౌడ్‌ఫండింగ్ ద్వారా నిధులు సమీకరించి చంద్రన్‌కు ఉచితంగా కిడ్నీ మార్పిడి చేయించారు. ప్రస్తుతం చంద్రన్ ఆరోగ్యంగా జీవిస్తున్నారు.

చంద్రన్ పరిస్థితి చూసినప్పటి నుంచి తనకు ఒక విషయం అర్థమైందని, కిడ్నీ మార్పిడి అనేది చాలాసార్లు వైద్యం కంటే ముందుగా డబ్బుకు సంబంధించిన సమస్యగా మారుతోందని డాక్టర్ జార్జి అబ్రహం చెబుతున్నారు. కిడ్నీ వైఫల్యంతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి రోగులకు మార్పిడి చికిత్స అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆయన తన ఫౌండేషన్ ద్వారా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. కిడ్నీ మార్పిడి రంగంలో వైద్య సాంకేతికత గణనీయంగా అభివృద్ధి చెందింది. దాత, గ్రహీతకు సరైన మ్యాచ్‌ను గుర్తించే విధానం మెరుగుపడింది. వైద్య పరీక్షలు మరింత ఆధునికంగా మారాయి. కొత్త తరహా యాంటీ-రిజెక్షన్ మందులు అందుబాటులోకి రావడంతో మార్పిడి చేసిన కిడ్నీలు ఎక్కువ కాలం పనిచేసే అవకాశం పెరిగింది. అయితే పేద రోగులకు డయాలసిస్ నుంచి కిడ్నీ మార్పిడి వరకు ప్రయాణం ఇప్పటికీ ఆర్థిక పరిస్థితిపైనే ఆధారపడుతోంది. దాత సిద్ధంగా ఉన్నా.. ఆపరేషన్‌కు అవసరమైన డబ్బును సమకూర్చలేక చాలామంది చికిత్సకు దూరమవుతున్నారని డాక్టర్ అబ్రహం చెబుతున్నారు. అందుకే తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి కిడ్నీ మార్పిడి సేవలు అందేలా ఒక నమూనాను రూపొందించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థలు, దాతల సహకారంతో ఖర్చులను తగ్గించడం, మృతదాతల నుంచి కిడ్నీలను సమర్థంగా సేకరించడం, మార్పిడి తర్వాత అవసరమైన మందులు, వైద్య సంరక్షణకు సహాయం అందించడం ఈ విధానంలో ప్రధాన అంశాలు.
మార్పిడి తర్వాత మందుల ఖర్చు కూడా భారమే
సాధారణంగా జీవించి ఉన్న దాత నుంచి తీసుకున్న కిడ్నీ సరైన వైద్య పర్యవేక్షణతో సగటున 15 నుంచి 20 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ కాలం పనిచేయవచ్చు. మృతదాత నుంచి తీసుకున్న కిడ్నీ సుమారు 10 నుంచి 15 ఏళ్ల వరకు పనిచేసే అవకాశం ఉంటుంది. అయితే కిడ్నీ మార్పిడి తర్వాత రోగులు క్రమం తప్పకుండా యాంటీ-రిజెక్షన్ మందులు తీసుకోవాలి. మార్పిడి అనంతరం ప్రారంభ దశలో దాత-గ్రహీత మధ్య సరిపోలికను బట్టి ఈ మందుల ఖర్చు నెలకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఉండొచ్చు. కొంతమందికి నెలకు రూ.10 వేల వరకు ఖర్చవుతుంది. కాలక్రమేణా అవసరమైన మందుల మోతాదు తగ్గడంతో ఖర్చు కూడా తగ్గుతుంది. మార్పిడి తర్వాత మందుల ఖర్చుకు కొంత సహాయం అందితే, చంద్రన్‌లా రోగులు తమ సంపాదనతోనే మందుల ఖర్చును భరించగలరు. చంద్రన్‌కు చేసిన మార్పిడి విజయవంతంగా కొనసాగుతున్నందున ప్రస్తుతం ఆయనకు అవసరమైన యాంటీ-రిజెక్షన్ మందుల మోతాదు తక్కువగా ఉందని డాక్టర్ అబ్రహం తెలిపారు.
డయాలసిస్ ఖర్చును తగ్గించేందుకు పెరిటోనియల్ డయాలసిస్
కిడ్నీ వైఫల్యంతో బాధపడేవారికి డయాలసిస్ ఖర్చును తగ్గించేందుకు డాక్టర్ అబ్రహం గతంలోనే పెరిటోనియల్ డయాలసిస్‌ను ప్రోత్సహించారు. ఇది ఇంటి వద్దే చేసుకునే డయాలసిస్ విధానం. పొత్తికడుపులోని పెరిటోనియం పొరను ఉపయోగించి ప్రత్యేక ద్రావణం ద్వారా రక్తంలోని వ్యర్థాలు, అదనపు ద్రవాన్ని తొలగిస్తారు. ఆయన వద్ద చికిత్స పొందిన శాంతి రాజ్ మోహన్ అనే రోగి కిడ్నీ వైఫల్యంతో 23 ఏళ్ల పాటు డయాలసిస్‌తో జీవించారు. కిడ్నీ వైఫల్యం ఉన్నప్పటికీ జీవితంలో ఒక లక్ష్యంతో ముందుకు సాగవచ్చని శాంతి నాకు నేర్పించారని డాక్టర్ అబ్రహం గుర్తుచేసుకున్నారు. కిడ్నీ ఆరోగ్యంపై అవగాహన పెంచడంతో పాటు, మార్పిడి చేయించుకున్న రోగులు ఎక్కువ కాలం ఆరోగ్యంగా, అర్థవంతమైన జీవితాన్ని గడపడానికి ప్రేరణ కల్పించేలా ఆయన రోగుల అనుభవాలను నమోదు చేసి ప్రత్యేక మ్యూజియాన్ని కూడా ఏర్పాటు చేశారు.
33 ఏళ్లలో 9.04 లక్షలకు పైగా ఉచిత డయాలసిస్ సెషన్లు
డాక్టర్ అబ్రహం ఫౌండేషన్ గత 33 ఏళ్లలో 3,378 మంది రోగులకు 9.04 లక్షలకు పైగా ఉచిత లేదా సబ్సిడీ డయాలసిస్ సెషన్లను అందించింది. ప్రస్తుతం 16 కేంద్రాల ద్వారా నెలకు దాదాపు 10 వేల డయాలసిస్ సెషన్లు నిర్వహిస్తోంది. ప్రభుత్వ ఆరోగ్య బీమా పథకాలు, స్థానిక సంస్థలు, ప్రైవేట్ దాతల సహకారంతో ఎక్కువ శాతం చికిత్సలను ఉచితంగా అందిస్తున్నారు. 1990ల ప్రారంభంలో పెరిటోనియల్ డయాలసిస్ ద్రావణాన్ని పొందడం చాలా కష్టంగా ఉండేది. 1994 వరకు భారత ప్రభుత్వం డయాలసిస్ ద్రావణాన్ని దిగుమతి చేసుకునేందుకు అనుమతి ఇవ్వలేదని డాక్టర్ అబ్రహం తెలిపారు. 1994లో ఈ ద్రావణాన్ని ఓపెన్ జనరల్ లైసెన్సింగ్ పరిధిలోకి తీసుకురావడంతో పరిస్థితి మారింది. ప్రస్తుతం దేశీయ తయారీదారులు దేశవ్యాప్తంగా పెరిటోనియల్ డయాలసిస్ ద్రావణాన్ని సరఫరా చేస్తున్నారు. అయితే ఈ విధానం ఇప్పటికీ ఆశించిన స్థాయిలో వినియోగంలోకి రాలేదని ఆయన అంటున్నారు. లాజిస్టిక్స్, రీయింబర్స్‌మెంట్ సమస్యలే ఇందుకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు.
కిడ్నీలు పూర్తిగా దెబ్బతినే వరకు ఎందుకు వేచి ఉండాలి?
ప్రస్తుతం డాక్టర్ అబ్రహం దృష్టి మరో కీలక అంశంపై ఉంది. “కిడ్నీలు పూర్తిగా దెబ్బతినే వరకు ఎందుకు వేచి ఉండాలి?” అన్న ప్రశ్నతో ఆయన దేశవ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో కిడ్నీ వ్యాధుల ముందస్తు స్క్రీనింగ్‌ను ప్రోత్సహిస్తున్నారు. పంచాయతీ స్థాయిలోనే సాధారణ క్రియాటినిన్ రక్త పరీక్ష, మూత్ర పరీక్ష, రక్తపోటు పరీక్షల ద్వారా కిడ్నీ వ్యాధి ప్రమాదాన్ని ముందుగానే గుర్తించవచ్చని ఆయన చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారు, కుటుంబంలో కిడ్నీ వ్యాధి చరిత్ర ఉన్నవారు, గతంలో తీవ్రమైన కిడ్నీ సమస్య ఎదుర్కొన్నవారు, ప్రత్యామ్నాయ వైద్యం ఉపయోగించేవారు, 45 ఏళ్లు పైబడినవారు ముందస్తు పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. క్రియాటినిన్‌ను కొలిచే సాధారణ రక్త పరీక్ష, మూత్ర పరీక్ష ద్వారా చాలాసార్లు కిడ్నీ వ్యాధి ఉందో లేదో గుర్తించవచ్చని ఆయన తెలిపారు. 2016లో ‘ది లాన్సెట్’లో ప్రచురితమైన ఒక సర్వేలో మన దేశంలో క్రానిక్ కిడ్నీ డిసీజ్ (CKD) ప్రాబల్యం సుమారు 17.2 శాతంగా ఉందని డాక్టర్ అబ్రహం పేర్కొన్నారు. దేశ జనాభా భారీగా ఉన్న నేపథ్యంలో కిడ్నీ వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించడంలో జరిగే చిన్నపాటి లోపం కూడా భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో ప్రజలు తీవ్రమైన కిడ్నీ వైఫల్యానికి చేరుకునే పరిస్థితికి దారితీయవచ్చని ఆయన హెచ్చరిస్తున్నారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం 60, 70, 80, 90 ఏళ్ల వయసులో ఉన్నవారు కూడా డయాలసిస్ చేయించుకుంటున్నారని ఆయన తెలిపారు. మెరుగైన దాత-గ్రహీత సరిపోలిక, అధునాతన స్క్రీనింగ్, కొత్త యాంటీ-రిజెక్షన్ మందుల కారణంగా కిడ్నీ మార్పిడి మరింత సురక్షితంగా మారిందని చెప్పారు.
మార్పిడి ఒక్కటే పరిష్కారం కాదు
కిడ్నీ మార్పిడి వైద్యంలో ఎంతో పురోగతి సాధించినప్పటికీ, దేశంలోని ప్రతి కిడ్నీ వైఫల్య రోగికి మార్పిడి చేయడం సాధ్యం కాదని డాక్టర్ అబ్రహం స్పష్టం చేస్తున్నారు. డయాలసిస్‌పై ఉన్న ప్రతి రోగికి కిడ్నీ మార్పిడి చేయలేం. ప్రపంచంలోని ఏ ప్రాంతంలోనూ ఇది సాధ్యం కాదని ఆయన అన్నారు. అందువల్ల కిడ్నీ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించడం అత్యంత కీలకమని ఆయన అభిప్రాయపడుతున్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనే స్క్రీనింగ్ జరిగితే, కొంతమంది రోగులకు ముందుగానే చికిత్స అందించి వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో సుమారు 3,300 మంది కిడ్నీ నిపుణులు (నెఫ్రాలజిస్టులు) ఉన్నారని, మరో దశాబ్దంలో ఈ సంఖ్యను 10 వేల వరకు పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. టీవల ఢిల్లీలోని ఎయిమ్స్‌ను సందర్శించినప్పుడు ఒక వైద్యుడు రోజుకు 100 మందికి పైగా రోగులను చూడాల్సిన పరిస్థితిని గమనించానని ఆయన తెలిపారు. ఇంతమంది రోగులను పరీక్షిస్తూ ప్రతి ఒక్కరి వైద్య చరిత్రను పూర్తిగా తెలుసుకోవడం వైద్యులకు చాలా కష్టమవుతుందని చెప్పారు.
యువతలో కిడ్నీ వ్యాధులు పెరిగాయా?
ఇటీవల యువతలో కిడ్నీ వ్యాధులు విపరీతంగా పెరుగుతున్నాయనే భావనపై కూడా డాక్టర్ అబ్రహం కొంత భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వ్యాధి పెరగడం కంటే.. గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా గుర్తించబడటం కూడా ఒక కారణమని ఆయన చెబుతున్నారు. దేశ జనాభా పెరగడం, వైద్య పరీక్షలు మెరుగుపడటం, కిడ్నీ బయాప్సీలు, ఇమేజింగ్ పరీక్షలు అందుబాటులోకి రావడం, ప్రజల్లో అవగాహన పెరగడం, నెఫ్రాలజిస్టుల సంఖ్య పెరగడం వల్ల కిడ్నీ వ్యాధుల గుర్తింపు పెరిగిందని ఆయన వివరించారు. అయితే ఈ పెరిగిన అవగాహన, గుర్తింపు వ్యాధి ముదిరిన తర్వాత కాకుండా ప్రారంభ దశలోనే జరిగేలా చూడటం ఇప్పుడు ప్రధాన సవాలని డాక్టర్ అబ్రహం చెబుతున్నారు. కిడ్నీ వ్యాధి తీవ్రమైన దశకు చేరుకున్న తర్వాత డయాలసిస్ లేదా మార్పిడి అవసరం రావచ్చు. ఆ దశకు చేరుకోకముందే ప్రమాదంలో ఉన్నవారిని గుర్తించి చికిత్స అందిస్తే అనేక సమస్యలను నివారించే అవకాశం ఉంటుంది. అందుకే మధుమేహం, అధిక రక్తపోటు, గుండె జబ్బులు, కుటుంబంలో కిడ్నీ వ్యాధి చరిత్ర వంటి ప్రమాద కారకాలు ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్యుల సలహాతో కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.




