Sonia Gandhi: అన్యాయంపై పోరాడండి.. బాధితులకు అండగా ఉండండి.. పార్టీ శ్రేణులకు సోనియా పిలుపు..
Congress Party meet: కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో చేసిన తీర్మానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నవంబర్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు నిర్వహిస్తామని తెలిపారు...
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో చేసిన తీర్మానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నవంబర్ 1 నుంచి 2022 మార్చి 31 వరకు నిర్వహిస్తామని తెలిపారు. ఏ రాజకీయ ఉద్యమానికైనా కొత్త రక్తమే ప్రాణాధారమని చెప్పిన సోనియా.. దేశంలో యువత తమ గొంతు వినిపించాలని ఎదురుచూస్తున్నారని చెప్పారు. వారికి ఒక వేదికను అందజేయాల్సిన బాధ్యత తమపై ఉందిన్నారు. ప్రతి గ్రామం, ప్రతి వార్డుకు చేరేలా సభ్యత్వ నమోదు పత్రాలను సిద్ధం చేసి పంపిణీ చేయాలని పార్టీ నేతలను ఆదేశించారు. ప్రతి గడపకూ వెళ్లి సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టాలని కోరారు. కార్యకర్తలకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కాంగ్రెస్ పార్టీపై చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి, భావజాలాన్ని విస్తృతపర్చడానికి పూర్తిగా సంసిద్ధంగా ఉండాలని సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీజేబీ,ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక ప్రచారంపై పోరాడాలన్నారు. ఈ యుద్ధంలో గెలవాలని నేతలకు స్పష్టం చేశారు.
ఈ క్రమంలో ఏఐసీసీ ప్రకటనలు చాలా కీలకమని.. అయితే ఇవి క్షేత్రస్థాయి వరకు చేరడం లేదన్నారు. అలాగే విధానపరంగా రాష్ట్రస్థాయి నేతల మధ్య స్పష్టత లోపించిందని చెప్పారు. అన్యాయం, అసమానతలపై పార్టీ పోరాడాలన్నారు. మోదీ సర్కారు వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందని. తద్వారా జవాబుదారీతనం లేకుండా చేయాలని చూస్తోందని సోనియా విమర్శించారు. ప్రజాస్వామ్య మూలాలను, రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతోందని ఆరోపించారు. ఈ ప్రభుత్వ విధానాల కారణంగా బాధితులైన రైతులు, రైతు కూలీలు, యువత కోసం కాంగ్రెస్ శ్రేణులు అండగా నిలబడాలని విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం వహించేలా పార్టీని తీర్చిదిద్దాలన్నారు.
రానున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో పార్టీని గెలిపించడం కోసం ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లాలని చెప్పారు. సమాజంలోని వివిధ వర్గాలతో విస్తృత స్థాయి చర్చలు జరిపి సమగ్ర విధానాలు, కార్యక్రమాలు రూపొందించాలని పార్టీ నేతలకు సూచించారు. అంతిమంగా పార్టీలో క్రమశిక్షణ, ఐక్యత అత్యంత కీలకమన్న విషయాన్ని మరోసారి గుర్తుచేస్తున్నట్లు తెలిపారు. పార్టీని బలోపేతం చేయడమే మనందరి ముందున్న బాధ్యత అని అన్నారు.
Read Also.. Lakhimpur Kheri: ప్రత్యక్ష సాక్షులు 23 మందే ఉన్నారా.. ఎంత మందిని అరెస్ట్ చేశారు..