Jamili Elections : జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం..

దేశంలో జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. ‘వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్’ బిల్లు త్వరలోనే పార్లమెంట్‌ ముందుకు రానుంది. గతంలో బమిలి ఎన్నికలకు సంబంధించి కోవింద్‌ కమిటీ సిఫార్సు చేసిన విషయం తెలిసిందే.

Jamili Elections : జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం..
One Nation One Election
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 12, 2024 | 2:42 PM

జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించింది. ఈ మేరకు పార్లమెంట్‌లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు పెట్టేందుకు కేంద్రం సిద్దమైంది. గతంలోనే జమిలి ఎన్నికలకు సంబంధించి కోవింద్ కమిటీ సిఫార్సులకు కేబినెట్ ఆమోద్రముద్ర వేసిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం కొనసాగుతున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లోనే జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

జమిలి దిశగా కేంద్రం తీవ్రంగా కసరత్తు చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం జమిలికే మొగ్గు చూపుతుండడంతో దీనికోసం ఉన్న అడ్డంకులన్నీ తొలగించుకునేందుకు రెడీ అవుతోంది. పార్లమెంట్‌ to పంచాయితీ ఎన్నికలు అన్నీ ఒకేసారి నిర్వహించేందుకు సమాయత్తం చేస్తోంది. మొత్తం రెండు దశల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. తొలి దశలో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలు.. అవిపూర్తైన వందరోజుల్లోపు స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయి. దీనికోసం దేశవ్యాప్తంగా ఒకే ఓటరు జాబితాను ఉపయోగించబోతున్నారు. జమిలి ఎన్నికలు.. అంటే.. వన్‌నేషన్‌, వన్‌ ఎలక్షన్‌. దేశానికి ఒక్కసారే ఎన్నికలు.. మిగిలిన ఐదేళ్లూ పరిపాలనపై దృష్టిపెట్టాలన్న దృక్పధంతో జమిలిని తెరపైకి తీసుకొచ్చారు.

అసలు జమిలి ఎన్నికలు సాధ్యమేనా? జమిలిని అమలు చేయాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం…

1952లో తొలి సాధారణ ఎన్నికల నుంచి 1967 వరకు లోక్‌సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు చాలావరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే తర్వాతి కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ట్రాల శాసనసభలను బర్తరఫ్‌ చేయడం వంటి కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్‌సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరపడం మొదలైంది. జమిలి ఎన్నికలు జరగాలంటే దాదాపు 18 రాజ్యాంగ సవరణలు, ప్రజా ప్రాతినిధ్య చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నదని కోవింద్‌ కమిటీ చెప్పింది. ముఖ్యంగా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 356, ఆర్టికల్‌ 324, ఆర్టికల్‌ 83(2), ఆర్టికల్‌ 172(1), ఆర్టికల్‌ 83కు సంబంధించి పలు సవరణలు అవసరమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జమిలి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ సవరణలతో కూడిన బిల్లును పార్లమెంట్‌ ఉభయ సభలు కనీసం 67 శాతం సానుకూల ఓట్లతో ఆమోదించాల్సి ఉంటుంది. అంతేకాకుండా.. ఎన్నికల అంశం ఉమ్మడి జాబితాలో ఉన్న నేపథ్యంలో ఈ బిల్లుకు దేశంలోని కనీసం సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోద ముద్రవేయాలి. అంటే 543 స్థానాలున్న లోక్‌సభలో కనీసం 67 శాతం అంటే.. 362 ఎంపీలు ఈ బిల్లుకు అనుకూలంగా ఓటువేయాలి. దీంతోపాటు రాజ్యసభలో 245 సీట్లలో 67 శాతం అంటే 164 మంది సభ్యులు ఈ బిల్లును సమర్థించాలి. దీనికి తోడు కనీసం 14 రాష్ట్రాల అసెంబ్లీలు బిల్లును ఆమోదించాల్సిన అవసరం ఉన్నది.

జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే లాజిస్టిక్స్‌ సమస్య అడ్డంకిగా మారుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు. ఈవీఎం యంత్రాలతో పాటు వందశాతం వీవీప్యాట్స్‌ అందుబాటులో ఉంచడం అనేది పెద్ద సమస్యని అంటున్నారు. ఎన్నికల సామగ్రిని భద్రపరుచడానికి తగినన్ని గోడౌన్ల కూడా సమస్యగా మారింది. 15 ఏండ్లకోసారి ఈవీఎంలను మార్చాల్సి ఉంది. ఈవీఎంలలో 40% వరకు డెడ్‌లైన్‌ దాటినవేనని నిపుణులు చెబుతున్నారు. 2009 లోక్‌సభ ఎన్నికలకు వెయ్యి 115 కోట్లు, 2014లో 3వేల 870 కోట్లు ఖర్చు అయితే.. 2019లో ఈ ఖర్చు పది వేల కోట్ల రూపాయలకు పెరిగినట్లు అంచనా. ఇక శాసనసభ ఎన్నికల నిర్వహణను కూడా పరిగణనలోకి తీసుకుంటే ఒక్కొక్క రాష్ట్రానికి రూ. 250 కోట్లు ఖర్చవుతుందనుకుంటే, మొత్తం 28 రాష్ట్రాల అసెంబ్లీలకు, లోక్‌సభ ఎన్నికలకు, స్థానిక సంస్థల ఎన్నికలకు కలిపి అయ్యే ఖర్చు పెద్దమొత్తంలో ఉండబోతోంది.

జమిలి వల్ల లాభాలు చూస్తే.. తరచూ వచ్చే ఎన్నికల కోడ్‌ వంటి అడ్డంకులు తప్పడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వాలు దృష్టిసారించవచ్చు. ఎన్నికల వ్యయం, సిబ్బంది వినియోగం, నిర్వహణ భారం తగ్గుతుంది. ఓటింగ్‌ శాతం పెరుగుతుంది. ఒకేసారి ఎన్నికల నిర్వహణతో ఓటు వేయడానికి ప్రజలు తరుచూ వేరే ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఉత్పాదకత పెరుగుతుంది.

నష్టాలు కూడా ఉన్నాయి. భారత్‌ వంటి అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఒకేసారి ఎన్నికలు కష్టం. పారదర్శకతపై అనుమానాలు కలుగొచ్చు. జమిలిపై రాజ్యాంగంలో ప్రస్తావన లేదు కాబట్టి, ఇప్పటికైతే ఇది రాజ్యాంగ విరుద్ధం. గడువులోపే ప్రభుత్వాలు పడిపోతే జమిలి లక్ష్యమే దెబ్బతింటుంది. అవిశ్వాసం ఎదుర్కొనే ప్రభుత్వాల విషయంలోనూ ఇది జరుగొచ్చు. జమిలితో జాతీయ పార్టీలకు మేలు జరుగొచ్చు. జాతీయ అంశాల ఆధారంగా అసెంబ్లీకి కూడా ప్రజలు ఓటేస్తే, ప్రాంతీయ పార్టీలు ఎన్నికల్లో దెబ్బతినే ప్రమాదం ఉంది. జమిలి నిర్వహణకు భారీగా సిబ్బంది, ఈవీఎంలు, వీవీప్యాట్లు అవసరం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి