బోరుబావిలో చిక్కుకున్న బాలుడు.. సరదాగా ఆడుకుంటుండగా ఘటన
చిన్నారుల పాలిట బోరు బావులు మృత్యుబావులుగా మారుతున్నాయి. నీళ్లు పడకపోవడంతో.. రైతులు వాటిని పూడ్చకుండా అలాగే వదిలేస్తున్నారు. వాటిని గమనించని పిల్లలు ఆడుకుంటూ..

చిన్నారుల పాలిట బోరు బావులు మృత్యుబావులుగా మారుతున్నాయి. నీళ్లు పడకపోవడంతో.. రైతులు వాటిని పూడ్చకుండా అలాగే వదిలేస్తున్నారు. వాటిని గమనించని పిల్లలు ఆడుకుంటూ ప్రమాదవశాత్తు గుంతల్లోకి పడిపోతున్నారు. కొన్ని సార్లు ప్రాణాలనూ కోల్పోతున్నారు. కన్నవారికి శోకాన్ని మిగుల్చుతున్నారు. తాజాగా రాజస్థాన్లోని శిఖర్జిల్లాలో ప్రమాదవశాత్తు నాలుగున్నరేళ్ల వయసున్న బాలుడు బోరుబావిలో పడిపోయాడు. సరదాగా స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది. బాలుడి ఏడుపు విని అక్కడికి చేరుకున్న స్థానికులు పిల్లవాడిని వెలికితీసేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోవడంతో అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు, అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. బాలుడు జారి పడిపోయిన బోరుబావి లోతు 55 అడుగులు ఉంటుందని అధికారులు వెల్లడించారు. వీలైనంత త్వరగా బాలుడిని వెలికి తీస్తామని చెప్పారు. చిన్నారిని సురక్షితంగా బయటకు తీసేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.
పూడ్చకుండా వదిలేసిన బోరు గుంతల్లో పడి చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు నిత్యకృత్యంగా మారాయి. చిన్నారులు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోతే వారు పడే వేదన ఊహకు అందనిది. బోరుబావులను పూడ్చే విషయంపై రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత అధికారులదే. ఈ విషయమై ప్రభుత్వం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చి, వాటిని అమలు చేసేందుకు చిత్తశుద్ధితో పనిసేలా చూడాలి. పూడ్చకుండా మధ్యలో వదిలేసిన బోరుబావిలో జంతువులు, పిల్లలు పడిపోకుండా సీల్ చేయాలి. అందరికీ తెలిసేలా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేయాలి. బోరు గుంతల వద్ద ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి చర్యలు తీసుకున్నపుడే ఏ కుటుంబానికీ కడుపుకోత ఉండదు. రాళ్లతోనో, మట్టితోనో బోరుగుంతలను తాత్కాలికంగా పూడ్చినా- వర్షాలు కురిస్తే తిరిగి ప్రమాదకర పరిస్థితి తప్పదు. కాబట్టి గుంతలను పూడ్చేందుకు శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి.
– నిపుణుల సూచనలు
Also Read
భారీ ఎత్తున ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రీరిలీజ్ ఈవెంట్.. ముఖ్య అతిథులుగా స్టార్ హీరోయిన్లు..
Ram Charan: రామ్ చరణ్ సినిమాలో చిన్నపాత్రలో కనిపించనున్న స్టార్ హీరో..?



