AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BJP Strategy: వ్యూహం మార్చిన కమల నాథులు.. తెలంగాణ, రాజస్థాన్‌లపై ప్రత్యేక దృష్టి.. అమిత్ షా పర్యటన కీలకం!

జాతీయ నాయకత్వం బలంగా ఉంటే సరిపోదని, జాతీయ అంశాల ఆధారంగా అసెంబ్లీ ఎన్నికలను గెలవలేమని గ్రహించారు కమలనాథులు. రాష్ట్రాల నాయకత్వంలో నెలకొన్న పొరపొచ్చాలు, మనస్పర్థలు, విబేధాలను పరిష్కరించి ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేయాలని భావిస్తోంది అధిష్టానం.

BJP Strategy: వ్యూహం మార్చిన కమల నాథులు.. తెలంగాణ, రాజస్థాన్‌లపై ప్రత్యేక దృష్టి.. అమిత్ షా పర్యటన కీలకం!
Amit Shah - Bandi Sanjay - Etela Rajender - JP Nadda
Rajesh Sharma
| Edited By: Ram Naramaneni|

Updated on: Jun 12, 2023 | 8:45 PM

Share

కర్నాటక ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ అధినాయకత్వం వ్యూహం మార్చింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో నాయకత్వాన్ని బలోపేతం చేసే దిశగా కసరత్తు చేస్తోంది. కేవలం జాతీయ నాయకత్వం బలంగా ఉంటే సరిపోదని, జాతీయ అంశాల ఆధారంగా అసెంబ్లీ ఎన్నికలను గెలవలేమని గ్రహించారు కమలనాథులు. రాష్ట్రాల నాయకత్వంలో నెలకొన్న పొరపొచ్చాలు, మనస్పర్థలు, విబేధాలను పరిష్కరించి ఎన్నికల యుద్ధానికి సిద్ధం చేయాలని భావిస్తోంది అధిష్టానం. మరికొద్ది నెలల్లో తెలంగాణ, మిజోరాంతో పాటు చత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాల్లో అంతర్గత విబేధాలు, వర్గాలు ఉన్నాయని అధిష్టానం గ్రహించింది. వీటిని తక్షణమే సరిదిద్దకపోతే ఎన్నికల్లో దెబ్బతినే ప్రమాదం ఉందని భావిస్తోంది. దానికి అనుగుణంగా కార్యాచరణకు దిగింది. తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుడు, పార్టీలో సీనియర్లు, ఇతర పార్టీల నుంచి వచ్చి పార్టీలో కొత్తగా చేరినవారికి మధ్య అంతరాలు అధిష్టానానికి తలనొప్పిగా మారాయి. పార్టీలో అంతర్గత విబేధాలు నానాటికీ పెరుగుతున్నాయి. పార్టీలో కొత్తగా చేరినవారికి రాష్ట్ర నాయకత్వం ప్రాధాన్యత ఇవ్వడం లేదని కొందరు, బండి సంజయ్ ఇంకా పరిణితి చెందాల్సి ఉందని మరికొందరు.. ఇలా తలా ఒక విధంగా అధిష్టానం దగ్గర తమ వాదన వినిపిస్తూ వచ్చారు.

తెలంగాణలో పార్టీకి ఊపు తీసుకురావడంలో బండి సంజయ్ సక్సెస్‌ అయినా ఎన్నికలను ఎదుర్కొనేందుకు వ్యూహకర్తలు అవసరమన్న భావన పార్టీ నేతల్లో ఉంది. పైగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న నేత కావాలని పదే పదే చెప్తున్నారు. ఈ పరిణామాలన్నింటి క్రమంలో తీరా ఎన్నికలప్పుడు నాయకత్వంలో మార్పు చేస్తే నిలదొక్కుకునే సరికే సమయం సరిపోతుందని తొలుత భావించిన హైకమాండ్ ఈ ఏడాది జనవరిలో బండి సంజయ్ పదవీకాలం ముగిసినా అప్రకటితంగా కొనసాగిస్తూ వస్తుంది. వాస్తవానికి కర్నాటకలో పార్టీ ఓటమి తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పార్టీలో చేరాలనుకున్న ఇతర పార్టీల నేతలు సైతం వెనుకంజ వేస్తున్నారు. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని చేర్చుకోవడం ద్వారా ఖమ్మంలో పాగా వేయాలని భావించిన కమలనాథులు భంగపడ్డారు. ఈపరిణామాలతో అధిష్టానం ఆలోచనలో పడింది. ఈ క్రమంలోనే రాష్ట్ర నాయకత్వ మార్పుపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఆశిస్తున్న ఈటల రాజేందర్‌కు ప్రచార కమిటీ బాధ్యతలు, జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న డీకే అరుణకు రాష్ట్ర పగ్గాలు అప్పగించి బండి సంజయ్‌ను కేంద్ర హోంశాఖలో సహాయ మంత్రిగా చేస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే ఇటీవలనే కేంద్ర కేబినెట్‌లో మార్పులు చేసిన ప్రధాని నరేంద్ర మోదీ మళ్ళీ మార్పులు చేస్తారా అంటే అనుమానమే. ఇదే సమయంలో ఈటల రాజేందర్ హస్తిన పర్యటనలో ఉండటంతో రాష్ట్ర అధ్యక్షుని మార్పు ఊహాగానాలకు మరింత బలం చేకూరినట్లయ్యింది. దీంతో అసలు బీజేపీలో ఏం జరుగుతోంది..? ఈ వార్తల్లో నిజమెంతో తెలియకపోవడం.. ఏ ఒక్కరూ క్లారిటీ ఇవ్వకపోవడంతో కార్యకర్తలు, అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వ్యవహారం గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పెద్ద హాట్ టాపిక్‌గానే మారింది.

ఇదిలావుంటే నిన్న మొన్నవరకు కాంగ్రెస్‌ పార్టీలోనే అనుకుంటే.. ఇప్పుడు బీజేపీలో కూడా గ్రూపు రాజకీయాలు మొదలైనట్లు కనిపిస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షపదవి మార్పుకు అనుకూల వర్గం ఒక వైపు, వ్యతిరేక వర్గం మరో వైపు మీటింగ్స్ పెట్టడం కమలంపార్టీలో కాక రేపుతోంది. ఇప్పటికే ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఈటెల రాజేందర్ చక్కర్లు కొట్టడం, ఆయనకు పదవి ఖాయం అంటూ రాజకీయ వర్గాల్లోనూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అధ్యక్ష మార్పుని వ్యతిరేకిస్తున్న మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి ఇంట్లో సమావేశం అవ్వడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ సమావేశానికి మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి , విజయశాంతి , బూర నర్సయ్యగౌడ్‌, వివేక్ వెంకట స్వామి, మాజీ మంత్రి మహేశ్వర్ రెడ్డి ఇతర నేతలు హాజరయ్యారు. అధ్యక్ష పదవిమార్పు అంటే బీజేపీలో అంత ఆషామాషీ కాదని, అసలు మార్చాల్సిన అవసరం ఏముందన్నది జితేందర్‌రెడ్డి బ్యాచ్ వాదన. తమ పార్టీ ఇంటర్నల్‌ విషయాలపై చర్చించామన్నారు జితేందర్‌రెడ్డి. సీఎం కేసీఆర్‌ రోజుకో లీక్‌ ఇప్పిస్తూ..బీజేపీ క్యాడర్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీని ఎదుర్కోలేకే కేసీఆర్‌ ఇలాంటి పనులు చేస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ఢీకొట్టాలంటే బీజేపీతోనే సాధ్యమన్నారు మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి. టీ-బీజేపీలో జరుగుతున్న పరిణామాలతోపాటు పార్టీ బలోపేతంపై చర్చించినట్లు బీజేపీ నేతలు తెలిపారు. ఢిల్లీ వరకూ ఈ విషయాలపై వెళ్లాల్సిన అవసరం లేదని, రాష్ట్ర నాయకత్వంలోనే చర్చించుకుని పరిష్కారం చేసుకుంటామన్నారు. అయితే.. అధ్యక్షుడి మార్పులో నిజమెంత..? గత కొన్నిరోజులుగా రాష్ట్ర రాజకీయ పరిణామాలేంటి..? ఇలా అన్ని విషయాలపై మీడియాతో చిట్‌చాట్ నిర్వహించిన బండి సంజయ్‌ ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాను. పదవుల కోసం కాదు.. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తను నేను అంటూ బండి సంజయ్ చెప్పుకొచ్చారు. ఇక అంతే ఘాటుగా ‘‘ బీజేపీ లీకుల పార్టీ కాదు.. కేంద్రంమంత్రి వర్గం విస్తరణ ఆఖరి దాకా ఎవరకీ తెలియదు. బీజేపీకి ఓటు వేయాలని తెలంగాణ సమాజం డిసైడ్ అయింది. బీఆర్ఎస్ పార్టీని ధైర్యంగా ఎదుర్కొనేది బీజేపీ మాత్రమే. ఒక్కో నియోజకవర్గంలో బీజేపీకి ముగ్గురు, నలుగురు అభ్యర్థులున్నారరు.. తెలంగాణలో బీజేపీకి అనుకూలమైన వాతావరణం తయారుచేశాం. పార్టీ నిర్మాణం మాకు ముఖ్యం. నాయకుల మీద అధారపడి బీజేపీ పనిచేయదు. సీఎం కేసీఆర్ ముఖం తెలంగాణ ప్రజలకు నచ్చటం లేదు’’ అని బండి సంజయ్ కీలక కామెంట్లు చేశారు. ఆయన మాటల్లో తానే ఎన్నికలయ్యేదాకా అధ్యక్షునిగా కొనసాగుతానన్న విశ్వాసం ఆయన మాటల్లో కనిపించింది.

మరోవైపు జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్న తమకు రాష్ట్ర పార్టీలో ఏం జరుగుతుందో తెలియటం లేదంటున్నారు కొందరు. బీఆర్ఎస్..బీజేపీ ఒక్కటే అనేలా విస్తృతంగా ప్రచారం జరగాలని బీఆర్‌ఎస్‌ నాయకత్వం కోరుకుంటోందని టీ బీజేపీ సీనియర్ నేతల సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఇందుకోసం ప్రతి అవకాశాన్నీ వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఇటీవల నిజామాబాద్‌ బీజేపీ జిల్లా అధ్యక్షుడి గృహప్రవేశం సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అనూహ్యంగా తారసపడటం ఆ పార్టీ వ్యూహంలో భాగంగా జరిగిందే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల వేళ అధ్యక్షుడి మార్పు అంటూ ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని రాష్ట్ర పార్టీ పెద్దలు నిర్ణయించారు. జూన్ 15న కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖమ్మంలో సభలో పాల్గొంటున్నారు. పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. ఆ సమయంలో అన్ని అంశాల చర్చిస్తారని చెబుతున్నారు. పార్టీ అధ్యక్షుడి మార్పు వ్యవహారంతో పాటుగా పార్టీలో పదవులు..ఎన్నికల కార్యాచరణ పైన స్పష్టత ఇస్తారని చెబుతున్నారు. దీంతో.. అమిత్ షా రాక సమయంలో పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.