BHARAT JODO YATRA: సెప్టెంబర్ 7నుంచి భారత్ జోడో యాత్ర.. వ్యూహాత్మకంగా రూటు మ్యాప్.. రాహుల్ వ్యూహం అదుర్స్ అంటున్న విశ్లేషకులు
గతంలో చాలా మంది రాజకీయ నాయకులకు అచ్చొచ్చిన పాదయాత్ర వ్యూహంవైపే రాహుల్ గాంధీ మొగ్గుచూపారు. అయితే, పాదయాత్ర జరపనున్న రూట్‌ను అత్యంత వ్యూహాత్మకంగా ఖరారు చేశారు. హైలైట్స్ చూస్తే వ్యూహం అదిరినట్లే కనిపిస్తోంది.

BHARAT JODO YATRA ROUTE MAP READY RAHULGANDHI STRATEGY REVEALED: 2024 సార్వత్రిక ఎన్నికల్లో చావో రేవో తేల్చుకునేందుకు కాంగ్రెస్ పార్టీ సంసిద్దమవుతున్నది. అందుకు చిరకాలంగా పలువురు నాయకులకు కలిసి వచ్చిన పాదయాత్ర విధానాన్ని ఎంచుకున్నట్లు స్పష్టమవుతోంది. దేశంలో ప్రత్యేక పరిస్థితి నెలకొందని భావిస్తున్న బీజేపీయేతర పార్టీలను ఒక్కతాటి మీదికి తెచ్చేందుకు రాహుల్ గాంధీ ఏకంగా మూడున్నర వేల కిలోమీటర్ల పాదయాత్రకు ముందుకొచ్చారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా భారత్ జోడో యాత్ర పేరిట కాలినడక సాగించేందుకు ప్లాన్ సిద్దం చేశారు. సెప్టెంబర్ ఏడో తేదీన కన్యాకుమారి నుంచి రాహుల్ భారత్ జోడో యాత్ర ప్రారంభం కానున్నది. జాతీయస్థాయిలో బీజేపీ ప్రదర్శిస్తున్న దూకుడు రాజకీయాల కారణంగా గత రెండు సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయాలను మూటకట్టుకుంది. 2014, 2019 జనరల్ ఎలెక్షన్లలో కాంగ్రెస్ పార్టీ 50కి లోపు లోక్‌సభ స్థానాలకు పరిమితమైంది. మరోసారి అంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పరిస్థితి మెరుగుపడకపోతే, మరోసారి బీజేపీనే విజయం సాధిస్తే ఇక కాంగ్రెస్ పార్టీ అన్నది చరిత్రగా మారిపోతుందని ఆ పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. అందుకే చావోరేవో తేల్చుకునేందుకు అన్ని వ్యూహాలను అమలు చేయాలని, ప్రజలకు వీలైనంతగా దగ్గరవ్వాలని తలపెట్టింది. ఇందులో భాగంగానే బీజేపీ దేశంలో విభజన రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ భారత్ జోడో యాత్రకు రాహుల్ గాంధీని సిద్దం చేసింది కాంగ్రెస్ అధినాయకత్వం. దేశ ప్రజలను మతాలకు అతీతంగా ఒక్కటి చేయడమనే లక్ష్యంతో ‘‘ మిలే కదం.. జుడే వతన్ ’’ అంటే కదం కదం కలిపి దేశాన్ని ఒక్కటి చేద్దాం అన్న నినాదంతో సెప్టెంబర్ 7వ తేదీన కన్యాకుమారి నుంచి పాదయాత్రకు రాహుల్ రెడీ అవుతున్నారు. ఈ యాత్రకు సంబంధించిన లోగో, ట్యాగ్‌లైన్, పోస్టర్‌లను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్ న్యూఢిల్లీలో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 12కుపైగా రాష్ట్రాల్లో 3500 కిలోమీటర్ల దూరం సాగే భారత్ జోడో యాత్ర మొత్తం కాలినడకలోనే సాగుతుందని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. యాత్ర కోసం ప్రత్యేక వెబ్‌సైట్ కూడా ప్రారంభించారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ దాకా 148 రోజుల్లో భారత్ జోడో యాత్ర కొనసాగుతుంది. దాదాపు అయిదు నెలల కాలంలో పాదయాత్రలో రాహుల్ గాంధీ పాల్గొనబోతున్నారు. ప్రతీరోజు ఆయన 25 కిలోమీటర్ల మేర నడిచేలా ప్రణాళిక సిద్దం చేశారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో బహిరంగ సభల్లో రాహుల్ ప్రసంగిస్తారు. ఈ పాదయాత్ర కొనసాగినంత కాలం సోనియా గాంధీ, ప్రియాంక వధేరాలు తమ వీలును బట్టి పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. యాత్రలో భాగంగా రోడ్డు పక్కనే ఏర్పాటు చేసిన టెంట్లలో రాహుల్ బస చేసేలా ప్లాన్ చేశారు. భారత్ జోడో యాత్రలో మొత్తానికి మూడు రకాలుగా ప్రతీ రోజు కనీసం మూడు వందల మంది నడిచేలా ప్లాన్ చేశారు. మొత్తమ్మీద కన్యాకుమారి నుంచి కశ్మీర్‌లోని శ్రీనగర్ దాకా నడిచే వారిని భారత యాత్రీకులుగా నామకరణం చేశారు. ఈ బృందంలోనే రాహుల్ గాంధీ వుంటారు. అదేసమయంలో ఏ రాష్ట్రంలో యాత్ర కొనసాగుతుంటే ఆ రాష్ట్రానికి చెందిన మరో వంద మంది పార్టీ నేతలు, కార్యకర్తలు యాత్రలో భాగస్వాములవుతారు. వీరిని లోకల్ యాత్రికులుగా పరిగణిస్తారు. అదేసమయంలో పాదయాత్ర జరగని రాష్ట్రాల నుంంచి మరో వంద మందిని పాదయాత్రలో పాల్గొనేలా ప్లాన్ చేశారు. వీరిని అతిథి యాత్రికులుగా పిలుస్తారు. ఇలా మూడు విభాగాలుగా మొత్తం ప్రతీరోజు కనీసం మూడు వందల మందికి తక్కువ కాకుండా పాదయాత్రలో పాల్గొనేలా చూస్తున్నారు. ఈ యాత్రను తానొక తపస్సులా భావిస్తున్నానని రాహుల్ గాంధీ పేర్కొనడం విశేషం. అంటే ఈ యాత్ర ద్వారానే తన రాజకీయ లక్ష్యాన్ని చేరుకోగలనని ఆయన బలంగా నమ్ముతున్నట్లు భావించాలి.

Rahulgandhi Route Map
ఇక యాత్ర కొనసాగే మార్గాన్ని పరిశీలిస్తే కాంగ్రెస్ నేతలు ఎంత వ్యూహత్మకంగా ప్లాన్ చేశారో అర్థమవుతోంది. యాత్రను తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభిస్తున్నా ఆ రాష్ట్రంలో పాదయాత్ర పెద్దగా కొనసాగదు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో అధికారంలో వున్నది తమ మిత్రపక్షమైన డిఎంకే. దానికితోడు తమిళనాడులో ఏం చేసినా కాంగ్రెస్ పార్టీ సీట్ల సంఖ్యను పెంచుకునే పరిస్థితి లేదు. సో ఆ రాష్ట్రంలో నడిచినా పెద్దగా ఉపయోగం లేదు. అందుకే కన్యాకుమారిలో ప్రారంభమయ్యే భారత్ జోడో యాత్ర మూడో రోజునే కేరళ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి కేరళ రాష్ట్రం భవిష్యత్తులో ముఖ్యమైనది. కేరళలో ఓసారి కాంగ్రెస్ సారథ్యంలోని యుడీఎఫ్ అధికారంలోకి వస్తే.. తర్వాత టెర్మ్ వామపక్షాల సారథ్యంలోని ఎల్డీఎఫ్ అధికారంలోకి రావడం గతంలో రివాజుగా వుండింది. కానీ గత అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్రను తిరగరాస్తూ ఎల్డీఎఫ్ రెండోసారి అధికారం చేపట్టింది. పినరయి విజయన్ వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. ఈనేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కేరళలో పాగావేయడం కాంగ్రెస్ పార్టీకి అత్యంత ముఖ్యం. అందుకే కేరళలో త్రివేండ్రమ్, కోచ్చి, నీలంబూర్ వంటి ప్రాంతాలను కలుపుతూ.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వయనాడ్ ప్రాంతాన్ని స్పృశిస్తూ రాహుల్ పాదయాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఆ తర్వాత మైసూర్ గుండా రాహుల్ యాత్ర కర్నాటక రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. బీజేపీ దక్షిణాది దండయాత్రలో భాగంగా ముందుగా కర్నాటకలోనే కాంగ్రెస్ పార్టీని దెబ్బకొట్టింది. కర్నాటక అసెంబ్లీకి మొన్నామధ్య జరిగిన ఎన్నికల తర్వాత జెడియూతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అయితే, బీజేపీ చాణక్యనీతితో కర్నాటకలో రాజ్యాధికారాన్ని లాగేసుకుంది. కాంగ్రెస్ పార్టీని చీల్చి దారుణంగా దెబ్బకొట్టింది. దానికి ప్రతీకారం తీర్చుకోవాలంటే కర్నాటకలో కాంగ్రెస్ మరింతగా బలపడాల్సిన అగత్యం వుంది. అందుకే కర్నాటకలోని బీజీపీ ప్రాబల్య ప్రాంతాలను టచ్ చేస్తూ రాహుల్ పాదయాత్రను డిజైన్ చేశారు. మైసూరు, బెళ్ళారి, రాయచూరు వంటి ప్రాంతాలలో భారత్ జోడో యాత్ర కొనసాగబోతోంది. ఆ తర్వాత ఏపీలో కాంగ్రెస్ పార్టీ బలహీన పరిస్థితి దృష్ట్యా ఆ రాష్ట్రంలో యాత్ర పెద్దగా కొనసాగదు. అనంతపురంలో ఎంటరయి.. కర్నూలులోని ఆలూరు గుండా తిరిగి కర్నాటకలోకి రాహుల్ వెళ్ళిపోతారు. ఏపీసీసీ అధ్యక్షుడు శైలజానాథ్ తన సొంత జిల్లాలో రాహుల్ పాదయాత్ర జరిపేలా చూసుకున్నట్లు భావిస్తున్నారు. ఇక కర్నాటకలోని రాయచూరు తర్వాత తెలంగాణలోకి పాదయాత్ర ప్రవేశిస్తుంది. నారాయణపేట జిల్లా మక్తల్ దగ్గర తెలంగాణలోకి రాహుల్ ఎంటరవుతారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన కొడంగల్ ఏరియా మీదుగా ఆయన పాదయాత్ర చేస్తారు.. వికారాబాద్, జహీరాబాద్, నారాయణఖేడ్ మీదుగా జుక్కల్, మద్నూర్ లేదా ఎల్లారెడ్డి, బాన్స్‌వాడ, బోధన్ మీదుగా మహారాష్ట్ర వైపు పాదయాత్ర కొనసాగుతుంది. వీటిలో జహీరాబాద్ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి గీతారెడ్డికి, నారాయణఖేడ్ వైపు వెళుతుంటే ఆందోల్ ఏరియా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహలకు కీలకమని చెప్పుకోవాలి. యాత్ర మద్నూర్ గుండా వెళితే డెగ్లూర్ దగ్గర, బోధన్ గుండా వెళితే నాందేడ్ దగ్గర రాహుల్ గాంధీ మహారాష్ట్రలోకి ఎంటరవుతారు.
ఇటీవల మహారాష్ట్ర రాజకీయాల్లో మారిన సమీకరణల దృష్ట్యా ఆ రాష్ట్రంలో రాహుల్ పాదయాత్ర కీలకం కాబోతోంది. నాందేడ్, జల్గావ్ మీదుగా ప్రయాణించే రాహుల్ యాత్ర మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మీదుగా వెళ్ళి రాజస్థాన్‌లోని కోట, దౌసా, ఆళ్వార్ ప్రాంతాల వైపు వెళుతుంది. ఆ తర్వాత యుపీలోని బులంద్ షహర్, న్యూఢిల్లీ మీదుగా హర్యానా చేరుతుంది. హర్యానాలోని అంబాలా మీదుగా నడవనున్న రాహుల్ గాంధీ.. పఠాన్ కోట్, జమ్మూల మీదుగా వెళ్ళి శ్రీనగర్ చేరుకుంటారు. శ్రీనగర్‌లో భారత్ జోడో యాత్రకు ముగింపు పలుకుతారు. ముఖ్యంగా తమ రాజకీయ ప్రత్యర్థులు పాలించే రాష్ట్రాలపైనే కాంగ్రెస్ నేతలు ఫోకస్ పెట్టినట్లు అర్థం చేసుకోవచ్చు. కేరళలో ఎల్డీఎఫ్, కర్నాటకలో బీజేపీ, ఏపీలో వైసీపీ, తెలంగాణలో టీఆర్ఎస్, మహారాష్ట్రలో బీజేపీ, శివసేన రెబల్ వర్గం, యుపీ, హర్యానాలలో బీజేపీ, పంజాబ్, ఢిల్లీలలో ఆమ్ ఆద్మీ పార్టీలు అధికారంలో వున్నాయి. యాత్ర కొనసాగనున్న రూట్‌లో తమిళనాడులో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం డిఎంకే, మధ్యప్రదేశ్, రాజస్తాన్‌లలో స్వయంగా కాంగ్రెస్ పార్టీలు అధికారంలో వున్నాయి. మొత్తమ్మీద పన్నెండు రాష్ట్రాల గుండా పాదయాత్ర కొనసాగనుండగా అందులో రెండు రాష్ట్రాలే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు. ఈ లెక్కన రాజకీయంగా తాము బలపడాల్సిన రాష్ట్రాలను గుర్తించి, వాటి గుండా యాత్ర కొనసాగేలా వ్యూహరచన చేసినట్లు అర్థం చేసుకోవాలి.




మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




