Bharat Bandh Today: రైల్వే స్టేషన్‌లలో హైఅలర్ట్.. అక్కడ 71 రైళ్లు రద్దు..!
Bharat Bandh Today: కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో హింసాత్మక ప్రదర్శనలు జరుగుతున్నాయి. యువత ప్రారంభించిన నిరసనలో రాజకీయ..
Bharat Bandh Today: కేంద్ర ప్రభుత్వ అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా దేశంలోని అనేక రాష్ట్రాల్లో హింసాత్మక ప్రదర్శనలు జరుగుతున్నాయి. యువత ప్రారంభించిన నిరసనలో రాజకీయ పార్టీలు కూడా చేరాయి. కాగా, సోమవారం కొన్ని సంస్థల తరపున భారత్ బంద్ కొనసాగుతోంది. భారత్ బంద్ నేపథ్యంలో పలు చోట్ల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF), గవర్నమెంట్ రైల్వే పోలీసులు (GRP) హైఅలర్ట్‌లో ఉన్నారు. అల్లర్లు సృష్టించకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. ఈ పథకాన్ని ఉపసంహరించుకోవాలని యువకులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అగ్నిపథ్ పథకాన్ని ఉపసంహరించుకునేది లేదని సైన్యం స్పష్టం చేసింది.
ముఖ్యమైన ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీసు బలగాలు మోహరించాయి. హర్యానాలోని ఫరీదాబాద్‌లో పోలీసు బలగాలను పెద్ద ఎత్తున మోహరించారు. నేడు 2 వేల మందికిపైగా పోలీసులు నగరంలో పహారా కాస్తారని అధికారులు తెలిపారు. అంతేకాదు, బంద్ సందర్భంగా హింసకు పాల్పడే వారిని గుర్తించేందుకు వీడియోలు కూడా తీయనున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. ఝార్ఖండ్‌లో నేడు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. బంద్ సందర్భంగా ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బలగాలు ప్రత్యేక నిఘా పెట్టాయి.
ఢిల్లీ నుంచి నడిచే 71 రైళ్లు రద్దు
అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా భారీ నిరసనల కారణంగా అనేక రైళ్లు రద్దు చేసింది రైల్వే శాఖ. రైళ్ల రద్దు కారణంగా చాలా మంది ప్రయాణికులు చిక్కుకుపోవడంతో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌లో ఆర్పీఎఫ్ కమాండోలను మోహరించారు. ఢిల్లీ నుంచి నడిచే 71 రైళ్లను రద్దు చేసినట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి