Online Gaming Bill: ఆన్‌లైన్ గేమింగ్ ఖేల్ ఖతం.. ఇక వారికి చుక్కలేనా..
లోక్‌సభలో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టగా.. సభ ఆమోదించింది. ఈ బిల్లు నిబంధనలు ఉల్లంఘించేవారితో పాటు ప్రచారం చేసే సెలబ్రిటీలపై ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోనున్నాయి. ఆన్‌లైన్ మనీ గేమ్స్ వల్ల బాగా ఆదాయం వస్తున్నప్పటికీ కేంద్రం ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని నిషేధించింది.

పాచికలు, పేకాట, కోడి పందేలు.. ఇంకా అనేక రకాల ఆటలు ‘జూదం’లో భాగమే. మహాభారతం వంటి పురాణేతిహాస కాలం నుంచి ఇవి భారతీయులకు సుపరిచితమే. నాటి మహాపురుషులు జూదంలో రాజ్యాలనే పోగొట్టుకున్నారు. ఇప్పుడు కాలం మారినా.. ‘జూదం’ మాత్రం మారడం లేదు. కాకపోతే కాస్త రూపు మార్చుకుని జనంపై విరుచుకుపడుతూనే ఉంది. నాడు రాజులు రాజ్యాలను కోల్పోతే.. నేటి ప్రజలు సర్వస్వం కోల్పోతున్నారు. చివరకు ప్రాణాలు సైతం కోల్పోతున్న ఉదంతాలు కోకొల్లలు. నేటి తరం ‘జూదం’లో కోడి పందేలు, పేకాట వంటివి సమాజంలో అక్కడక్కడా కనిపిస్తున్నప్పటికీ.. వాటిపై నియంత్రణ ఉంది. ఎలాంటి నియంత్రణ లేకుండా యావత్ సమాజాన్ని ‘జూదం’లోకి లాగి పీల్చి పిప్పి చేస్తున్న రక్కసి ‘ఆన్‌లైన్ మనీ గేమింగ్’. దేశవ్యాప్తంగా ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని మిగిల్చిన ఈ రాకాసిపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిజానికి ఆన్‌లైన్ గేమింగ్ ద్వారా ప్రభుత్వానికి ఇబ్బడిముబ్బడిగా ఆదాయం సమకూరుతున్నప్పటికీ.. ఆదాయం కంటే సమాజ శ్రేయస్సుకే ప్రాధాన్యత ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. అందుకే కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025 ను ప్రవేశపెట్టి, పాస్ చేసింది. డబ్బుతో ముడిపడ్డ ఎలాంటి ఆన్‌లైన్ గేమింగ్ ప్రక్రియనైనా ఈ బిల్లు పూర్తిగా నిషేధిస్తుంది. అదే సమయంలో గేమింగ్ పరిశ్రమ దెబ్బతినకుండా ఉండేందుకు ‘రియల్ మనీ’తో సంబంధం లేకుండా నిర్వహించే ఈ-స్పోర్ట్స్, ఆన్‌లైన్ సోషల్ గేమింగ్‌ను ప్రోత్సహించడానికి సైతం ఈ బిల్లులో ప్రతిపాదనలు పొందుపరిచింది.
మొత్తంగా ఆన్‌లైన్ ‘రియల్ మనీ’ గేమింగ్ సమాజానికి పెద్ద సమస్యగా మారిందని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ఆన్‌లైన్ మనీ గేమింగ్ అప్లికేషన్లు, వెబ్‌సైటన్లను నిషేధించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో నష్టం వాటిల్లుతున్నప్పటికీ.. ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. “డబ్బుతో ముడిపడిన ఆన్‌లైన్ గేమింగ్ కార్యకలాపాలు సమాజానికి తీవ్ర సమస్యగా మారాయి. పార్టీలకు అతీతంగా ప్రతి ఎంపీ దీని దుష్ప్రభావాలపై ఆందోళన వ్యక్తం చేశారు. గేమింగ్ రంగంలో మూడింట ఒక వంతు ఆదాయం వీటి వల్ల సమకూరుతున్నప్పటికీ.. ఆదాయం – సమాజ సంక్షేమం మధ్య ప్రభుత్వం సమాజ సంక్షేమాన్నే ఎంచుకుంది” అని కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఓ ఉన్నతాధికారి వెల్లడించారు.
యాడ్స్ – ప్రమోషన్లలో పాల్గొన్నా సరే.. నేరమే!
డబ్బు ఆధారిత గేమింగ్‌లో పాల్గొనే సంస్థలపై చర్యలు తీసుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగిస్తూ బిల్లును రూపొందించినట్టు తెలిసింది. బిల్లు నిబంధనలను ఉల్లంఘించి డబ్బు ఆధారిత గేమింగ్ సేవలను అందించే వారికి మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా ఒక కోటి రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా ప్రకటనలు చేసే వారికి రెండేళ్ల వరకు జైలు శిక్ష లేదా 50 లక్షల రూపాయల వరకు జరిమానా లేదా రెండూ విధించే నిబంధన కూడా ఇందులో చేర్చారు. అంటే గేమింగ్ యాప్‌ల ప్రకటనల్లో పాల్గొనే సినీ ప్రముఖులు, ఇతర సెలబ్రిటీలు సైతం కొత్త చట్టం ప్రకారం శిక్షార్హులే అని బిల్లు స్పష్టం చేస్తోంది. చాలా ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫామ్‌లు తమ ఉత్పత్తులను ‘నైపుణ్య ఆధారిత ఆటలు’గా ముసుగు వేసుకుని, బెట్టింగ్ నుంచి వేరుగా కనిపించేందుకు ప్రయత్నిస్తాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కానీ కొత్త బిల్లు ప్రకారం ఇవన్న కచ్చితంగా బెట్టింగ్ (జూదం)గానే పరిగణిస్తూ చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించాయి.
ఆన్‌లైన్ గేమింగ్ వ్యాపార సంస్థలు, వాటిని ప్రమోట్ చేసే సెలబ్రిటీల సంగతి సరే.. మరి ఈ ఆటల్లో మునిగితేలి తమ భవిష్యత్తును పాడుచేసుకునే యువత సంగతేంటి అనే ప్రశ్న తలెత్తవచ్చు. ఈ బిల్లు ఆటగాళ్లను బాధితులుగానే పరిగణిస్తోంది. వ్యభిచారం వంటి నేరాల్లో నిర్వాహులు, విటులు మాత్రమే నేరం పరిధిలోకి వస్తారు. వొల్లు అమ్ముకునే వేశ్యలను బాధితులుగా పరిగణిస్తారు. ఇదే మాదిరిగా ఆన్‌లైన్ గేమింగ్ ఆటగాళ్లను సైతం బాధితులుగా బిల్లు పరిగణిస్తుంది. వారికి ఎలాంటి శిక్ష ఉండదు. ఆన్‌లైన్ మనీ గేమింగ్ ప్లాట్‌ఫాంలు, వారితో లావాదేవీలు జరిపేవారు, సేవలను సమకూర్చేవారు, ఆ ప్లాట్‌ఫాంలను ప్రోత్సహిస్తూ ప్రకటనలు ఇచ్చేవారిపై మాత్రం చట్టపరమైన చర్యలు ఉంటాయి.
నిష్ఫలంగా మారిన నియంత్రణ చర్యలు
గత మూడున్నర సంవత్సరాలుగా ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. కానీ ‘రియల్ మనీ’ గేమింగ్ కంపెనీలు ఈ ప్రయత్నాల నుంచి చాకచక్యంగా తప్పించుకుంటూ వచ్చాయి. జీఎస్టీ ద్వారా వాటిని అరికట్టే ప్రయత్నం జరిగింది. ఆన్‌లైన్ గేమింగ్ లావాదేవీలను అత్యధిక పన్ను శ్లాబ్ పరిధిలోకి చేర్చింది. కానీ అది కూడా విఫలమైంది. బ్యాంకులను నియంత్రించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టెలీకాం సంస్థలను నియంత్రించేందుకు టెలీకాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మాదిరిగా ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫాంల నియంత్రణకు కూడా ఒక రెగ్యులేటరీని ఏర్పాటు చేయాలని భావించినప్పటికీ.. అది కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ప్రజానీకంతో పాటు ప్రజాప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో కేంద్రం ఈ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది.
ఆందోళనలో ఆన్‌లైన్ గేమింగ్ రంగం
ఇదిలా ఉండగా, డబ్బు ఆధారిత గేమింగ్ రంగంతో సంబంధం ఉన్న సంస్థలు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాసి, ఈ చట్టం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న రంగాన్ని నాశనం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశాయి. ఆల్ ఇండియా గేమింగ్ ఫెడరేషన్, ఈ-గేమింగ్ ఫెడరేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫాంటసీ స్పోర్ట్స్ లేఖలో.. ఆన్‌లైన్ నైపుణ్య గేమింగ్ రంగం విలువ రూ. 2 లక్షల కోట్లకు పైగా ఉందని, దీని ద్వారా రూ. 31,000 కోట్ల మేర వార్షిక ఆదాయం సమకూరుతుందని తెలిపాయి. ఈ రంగం ప్రత్యక్ష, పరోక్ష పన్నుల రూపంలో రూ. 20,000 కోట్ల మేర ప్రభుత్వానికి చెల్లిస్తోందని, 2028 నాటికి ఇది రెట్టింపు అవుతుందని గేమింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆర్థిక లావాదేవీలతో సంబంధం లేకుండా సాగే ఈ-స్పోర్ట్స్, ఆన్‌లైన్ సామాజిక ఆటలను ప్రోత్సహించడానికి బడ్జెట్, కొత్త పథకాలతో పాటు ఒక ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయనున్నట్టు బిల్లు ద్వారా తెలియజేస్తోంది. తద్వారా ఈ రంగం దెబ్బతినకుండా చూడ్డంతో పాటు ప్రోత్సహించే చర్యలు చేపట్టినట్టు వివరిస్తోంది. మొత్తంగా ఎలాంటి చర్చ లేకుండానే ప్రతిపక్షాల ఆందోళనల నడుమ ఈ బిల్లు లోక్‌సభలో పాసైంది. రాజ్యసభలోనూ పాసైతే.. తర్వాత రాష్ట్రపతి ఆమోదముద్రతో చట్ట రూపం సంతరించుకుంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..




