Arvind Kejriwal: కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఆప్ భవిష్యత్తుపై నీలినీడలు.. పార్టీని ముందుకు నడిపేది ఎవరు?
ఉవ్వెత్తున ఎగిసిన అవినీతి వ్యతిరేక ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన కేజ్రీవాల్.. ఇప్పుడు ఆ అవినీతి మరకలతో సతమతమవుతున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఆప్ కథ ముగుస్తుందా ?.. లేక ప్రస్తుత పరిస్థితుల్లో ఆప్ అంచనాలు తలకిందులవుతాయా ? అనేది జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది..
ఉవ్వెత్తున ఎగిసిన అవినీతి వ్యతిరేక ఉద్యమంతో వెలుగులోకి వచ్చిన కేజ్రీవాల్.. ఇప్పుడు ఆ అవినీతి మరకలతో సతమతమవుతున్నారు. కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఆప్ కథ ముగుస్తుందా ?.. లేక ప్రస్తుత పరిస్థితుల్లో ఆప్ అంచనాలు తలకిందులవుతాయా ? అనేది జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది..
రాజకీయాల్లో ఓ సామాన్యుడు రాణించడం.. అది కూడా సొంతంగా ఓ పార్టీ పెట్టి అధికారంలోకి రావడం అసాధ్యం అనుకున్న వారి అంచనాలను తలకిందులు చేశారు అరవింద్ కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ పార్టీని ఏర్పాటు చేసి ఢిల్లీ సీఎం పదవి చేపట్టడంతో.. పంజాబ్‌లోనూ ఆప్‌ను అధికారంలోకి తీసుకొచ్చి బీజేపీకి కొరకరాని కొయ్యగా మారారు కేజ్రీవాల్.. అవినీతి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంతో వెలుగులోకి వచ్చి.. సీఎం స్థాయికి ఎదిగిన కేజ్రీవాల్.. ఇప్పుడు అదే అవినీతి కేసుల్లో అరెస్ట్ కావడం ఆయనకున్న క్లీన్ ఇమేజ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తుపై ప్రభావం
లిక్కర్ స్కాంలో అరెస్టయిన కేజ్రీవాల్ ఎప్పుడు బయటకు వస్తారో ఎవరూ చెప్పలేని పరిస్థితి. కేజ్రీవాల్ అరెస్ట్.. ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తుపై ఏ రకమైన ప్రభావం చూపుతుందనే అంశంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎవరు నాయకత్వం వహిస్తారన్నది ప్రశ్న అందరినీ వేధిస్తోంది. కస్టడీలో ఉన్నప్పటికీ, పోర్ట్‌ఫోలియో లేకపోయినా, ముఖ్యమంత్రిగా కొనసాగడానికి కేజ్రీవాల్‌కున్న అర్హత చట్టపరంగా చెక్కుచెదరలేదు. అయినప్పటికీ నైతికంగా ఈ విషయంలో ఆయన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
కేజ్రీవాల్ స్థాయిలో ప్రభావం చూపుతారా ?
ఇక రాబోయే ఎన్నికల్లో ఆప్ ప్రచారానికి ఎవరు నాయకత్వం వహిస్తారన్నది దానిపై కూడా ఆసక్తి నెలకొంది. భగవంత్ మాన్, అతిషి, సౌరవ్ భరద్వాజ్ వంటి నేతలు ఆప్ ప్రచార బాధ్యతలు తీసుకునే అవకాశం ఉన్నా.. వారంతా కేజ్రీవాల్ స్థాయిలో ప్రభావం చూపుతారో చెప్పడం కష్టం. మరోవైపు కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఆప్ కథ ముగుస్తుందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఆ పార్టీ అస్తిత్వ సవాళ్లను ఎదుర్కొంటోంది. దీన్ని ఆ పార్టీ ఏ విధంగా అధిగమిస్తుందన్న ప్రశ్నలు కూడా మొదలయ్యాయి.
విపక్షాలు ఏకమవుతాయా ?
ఇక కేజ్రీవాల్ అరెస్ట్ ద్వారా ఆప్ పట్ల ప్రజల్లో సానుభూతి పెరుగుతుందా ? అనే వాదన ఓ వైపు వినిపిస్తోంది. అయితే ఆప్‌ను దేశవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తున్న కేజ్రీవాల్‌కు తాజా అవినీతి మరక పెద్ద మైనస్ అవుతుందనే వాదన కూడా ఉంది. కేజ్రీవాల్ అరెస్టు ఎన్నికల ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తుందనే అంశం అత్యంత కీలకం. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో కేజ్రీ అరెస్ట్ అంశం కీలకంగా మారుతుందనడంలో సందేహం లేదు. అయితే దీన్ని ఆప్ తమకు అనుకూలంగా మలుచుకుంటుందా ? లేక బీజేపీ ఆప్‌ను టార్గెట్ చేసే విషయంలో ఈ పరిణామాలను ఉపయోగించుకుంటుందా ? అన్నది చూడాలి. ఇక కేజ్రీవాల్ అరెస్ట్ ప్రతిపక్షాలను ఏకం చేయగలదా? అనే ప్రశ్నలు కూడా మొదలయ్యాయి. కాంగ్రెస్ సహా బీజేపీని వ్యతిరేకించే విపక్షాలు ఆప్‌కు ఏ మేరకు మద్దతుగా నిలుస్తాయన్నది చూడాలి. విపక్షాల మధ్య ఐక్యత లేదని బీజేపీ పదే పదే విమర్శలు చేస్తోంది. అయితే కేజ్రీవాల్ అరెస్ట్ పరిణామంతో పరిస్థితులు మారితే.. అది బీజేపీకి కొంత ఇబ్బందులు కలిగించవచ్చు. మొత్తానికి కేజ్రీవాల్ అరెస్ట్‌తో ఆప్ భవిష్యత్తు ఎలా ఉండబోతోందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..