Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indo-China Border: భారత్, చైనా బోర్డర్ వద్ద 19 మంది కూలీలు మిస్.. నదిలో ఒక మృత దేహం లభ్యం.. 18మంది కోసం గాలింపు

కార్మికులకు సెలవు ఇవ్వడానికి కాంట్రాక్టార్ నిరాకరించడంతో.. సుమారు 19మంది కూలీలు కాలినడకన అస్సాంకు వెళ్ళడానికి బయలుదేరినట్లు తెలుస్తోంది. అలా వెళ్తున్న సమయంలో మార్గం మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.  

Indo-China Border: భారత్, చైనా బోర్డర్ వద్ద 19 మంది కూలీలు మిస్.. నదిలో ఒక మృత దేహం లభ్యం.. 18మంది కోసం గాలింపు
Arunachal Pradesh
Follow us
Surya Kala

|

Updated on: Jul 19, 2022 | 8:44 AM

Indo-China Border: అరుణాచల్ ప్రదేశ్ నుంచి పెను ప్రమాదం సంభవించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. భారత్-చైనా సరిహద్దులో రహదారుల నిర్మాణంలో కూలీల బృందం పనిచేస్తోంది. వారిలో 19మంది మంది కార్మికులు గత వారం రోజుల క్రితం తప్పిపోయారు.  అలా మిస్సైన వారిలో ఒకరి మృతదేహం కుమి నదిలో లభ్యమైంది. దీంతో మిగిలిన కూలీలు కూడా నదిలో మునిగి చనిపోయి ఉంటారని కొందరు ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఇది అనుమానం మాత్రమేనని.. ఖచ్చితంగా తెలియదని అంటున్నారు.

ఈ కార్మికులకు సెలవు ఇవ్వడానికి కాంట్రాక్టార్ నిరాకరించడంతో.. సుమారు 19మంది కూలీలు కాలినడకన అస్సాంకు వెళ్ళడానికి బయలుదేరినట్లు తెలుస్తోంది. అలా వెళ్తున్న సమయంలో మార్గం మధ్యలో ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.

మీడియా కథనాల ప్రకారం.. అసోం కు చెందిన కొందరు కార్మికులను రోడ్డు నిర్మాణం కోసం BRO అరుణాచల్‌కు తీసుకువచ్చారు. చైనా సరిహద్దు సమీపంలో రోడ్డు నిర్మాణ పనుల్లో నిమగ్నమయ్యారు. అయితే ఈద్ సందర్భంగా అసోం లోని తమ ఇళ్లకు వెళ్లాలనుకున్నారు. కార్మికులు ఇంటికి వెళ్లేందుకు కాంట్రాక్టర్‌ బెంగియా బడోను సెలవు అడిగారు. అయితే.. కాంట్రాక్టర్  కూలీల కోరికను అంగీకరించకపోవడంతో.. కాంట్రాక్టర్ కు చెప్పకుండా కాలినడకన అస్సాంకు బయలుదేరారు. అయితే సమాచారం అరుణాచల్‌లోని కురుంగ్ కుమే జిల్లా అడవులలోకూలీలు అదృశ్యమైనట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే నదిలో మృతదేహం లభ్యం కావడంతో కూలీలంతా నదిలో మునిగి చనిపోయి ఉండవచ్చు అంటూ అనుమానిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సంఘటనా స్థలం నుండి డిప్యూటీ కమిషనర్ ఒక మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అయితే కూలీలందరూ మరణించారని స్థానికులు చెబుతున్నారు. దీంతో సంఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్ ని పంపి.. మిగిలిన కూలీల ఆచూకీ కోసం కృషి చేస్తామని అధికారులు చెప్పారు.

కూలీలు నదిలో మునిగిపోయారా లేదా మరేదైనా ప్రమాదంలో మరణించారా అనే దానిపై ఇప్పటివరకు ఖచ్చితమైన సమాచారం లేదని పోలీసు అధికారులు తెలిపారు. అయితే కుమి నదిలో పడి మృతి చెంది ఉంటాడని అనుమానిస్తున్నారు. ఎందుకంటే నదిలోనే కూలీ మృతదేహాన్ని వెలికితీశారు. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల పెద్ద నెట్‌వర్క్‌ను నిర్మిస్తోంది. భారతదేశం-చైనా సరిహద్దుకు సమీపంలోని మారుమూల ప్రాంతమైన డామిన్ సర్కిల్‌లో రహదారి నిర్మాణ పనులను పూర్తి చేయడానికి ఈ కూలీలను నియమించారు. నిర్మాణ స్థలం చైనా సరిహద్దుకు సమీపంలోని డామిన్‌లో ఉంది.

అయితే కుమి నదిలో కూలీలు ఎప్పుడు, ఎలా గల్లంతయ్యారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కూలీలు నదిని దాటడానికి ప్రయత్నిస్తున్నారా? నది వేగంగా ప్రవహిస్తుందా? ఇలా అనేక సమాధానాలు లేని అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని చెప్పారు.

ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ కారణంగా, ఇప్పటికే నదుల నీటిమట్టం పెరిగింది. ఇటువంటి పరిస్థితిలో.. ఎవరైనా నదిలో మునిగిపోతే.. బాధితులను రక్షించడం పెద్ద సవాల్ అని అధికారులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..