AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20 World Cup 2026 : వరల్డ్ కప్ ప్రైజ్ మనీ లిస్ట్ వచ్చేసింది.. సెమీఫైనల్, గ్రూప్ స్టేజ్ జట్లకు కూడా కాసుల పంట

T20 World Cup 2026 : 2026 టీ20 వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత్ రూ.27.48 కోట్ల ప్రైజ్ మనీని అందుకుంది. రన్నరప్ న్యూజిలాండ్‌కు రూ.14.65 కోట్లు లభించగా, మొత్తం రూ.120 కోట్ల ప్రైజ్ పూల్‌ను ఐసీసీ పంపిణీ చేసింది.ఈ మెగా టోర్నీలో పాల్గొన్న ప్రతి జట్టుపై ఐసీసీ కాసుల వర్షం కురిపించింది.

T20 World Cup 2026 : వరల్డ్ కప్ ప్రైజ్ మనీ లిస్ట్ వచ్చేసింది.. సెమీఫైనల్, గ్రూప్ స్టేజ్ జట్లకు కూడా కాసుల పంట
T20i World Cup 2026
Rakesh
|

Updated on: Mar 09, 2026 | 6:12 PM

Share

T20 World Cup 2026 : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం సాక్షిగా ఆదివారం టీమిండియా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. న్యూజిలాండ్‌ను 96 పరుగుల తేడాతో మట్టికరిపించి, వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ 2026 కైవసం చేసుకుని భారత్ చరిత్ర సృష్టించింది. ఈ అద్భుత విజయంతో ఐసీసీ ప్రకటించిన భారీ ప్రైజ్ మనీ టీమిండియా ఖాతాలో చేరింది. అయితే కేవలం భారత్, న్యూజిలాండ్ మాత్రమే కాదు.. ఈ మెగా టోర్నీలో పాల్గొన్న ప్రతి జట్టుపై ఐసీసీ కాసుల వర్షం కురిపించింది. మొత్తం రూ.120 కోట్ల భారీ ప్రైజ్ పూల్‌ను ఐసీసీ ఎలా పంపిణీ చేసిందో వివరంగా తెలుసుకుందాం.

విజేత భారత్‌కు భారీ నజరానా.. కివీస్‌కు సగం

ప్రపంచ విజేతగా నిలిచిన టీమిండియాకు ఐసీసీ 3 మిలియన్ అమెరికన్ డాలర్లను బహుమతిగా ఇచ్చింది. మన భారత కరెన్సీలో దీని విలువ సుమారు రూ.27.48 కోట్లు. గత వరల్డ్ కప్‌తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీ దాదాపు రూ.4 కోట్లు పెరగడం విశేషం. ఇక రన్నరప్‌గా నిలిచిన న్యూజిలాండ్ జట్టుకు దాదాపు రూ.14.65 కోట్లు దక్కాయి. ఫైనల్లో ఓడినప్పటికీ, టోర్నీ ఆద్యంతం అద్భుతంగా ఆడినందుకు కివీస్‌కు ఈ భారీ మొత్తం లభించింది.

సెమీ ఫైనలిస్టులు, సూపర్-8 జట్లకు ఎంతంటే?

సెమీ ఫైనల్ వరకు వచ్చి తృటిలో ఫైనల్ చేరలేకపోయిన ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లకు ఐసీసీ తలా రూ.7.24 కోట్లు అందజేసింది. ఇక సూపర్ 8 దశకు చేరుకుని వెనుదిరిగిన జట్లు కూడా తక్కువ ఏమీ సంపాదించలేదు. పాకిస్థాన్, జింబాబ్వే, శ్రీలంక, వెస్టిండీస్ జట్లకు ఒక్కో జట్టుకు రూ.3.48 కోట్లు చొప్పున ప్రైజ్ మనీ దక్కింది. అంటే టోర్నీలో ఎంత ముందుకు వెళ్తే అంత ఎక్కువ డబ్బులు జట్లకు అందాయన్నమాట.

గ్రూప్ స్టేజ్ జట్లకు కూడా కోట్ల పంట

ఈ టోర్నీలో కనీసం గ్రూప్ స్టేజ్ దాటలేకపోయిన జట్లు కూడా ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లలేదు. ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, కెనడా, యూఏఈ, యూఎస్‌ఏ, నెదర్లాండ్స్, స్కాట్లాండ్, నేపాల్, ఐర్లాండ్, ఇటలీ, ఒమన్, నమీబియా.. ఇలా మొత్తం 12 జట్లకు ఐసీసీ ఒక్కో జట్టుకు రూ.2.29 కోట్లు పంపిణీ చేసింది. ఆస్ట్రేలియా లాంటి దిగ్గజ జట్టు గ్రూప్ స్టేజ్‌లోనే వెనుదిరగడం అందరినీ ఆశ్చర్యపరిచినప్పటికీ, వారికి కూడా ఐసీసీ తగిన నజరానాను అందించింది.

మొత్తానికి 2026 టీ20 వరల్డ్ కప్ కేవలం ఆట పరంగానే కాదు, ఆదాయం పరంగా కూడా జట్లకు మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి ఇప్పటికే ప్లేయర్లకు అదనపు బోనస్‌లు ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఈ గెలుపుతో భారత్ కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా మరోసారి మారుమోగిపోయాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us