Jayalalitha Death: ఆర్ముగస్వామి కమిషన్ ద్వారానైనా జయలలిత మరణ రహస్యం వీడేనా? ప్రజల అనుమానాలు తీరేనా?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. పురుచ్చి తలైవి.. జయలలిత మరణంపై విచారణకు నియమించిన కమిషన్ హైకోర్టుకు నివేదికను సమర్పించింది. ఈ నివేదికతో అయినా జయలలిత మరణంపై మిస్టరీ వీడుతుందా?
Jayalalitha Death Mystery: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి.. పురుచ్చి తలైవి.. జయలలిత మరణంపై విచారణకు నియమించిన కమిషన్ హైకోర్టుకు నివేదికను సమర్పించింది. ఈ నివేదికతో అయినా జయలలిత మరణంపై మిస్టరీ వీడుతుందా? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొని ఉంది. జస్టిస్ ఆర్ముగస్వామి సమర్పించిన ఆ నివేదికలో ఏముంది? అసలు జయలలితపై మరణంపై నెలకొన్న అనుమానాలు ఏమిటి? ఈ విషయాలను తెలుసుకుందాం.
అమ్మ, పురుచ్చితలైవి అంటూ తమిళులు జయలలితను ప్రేమగా పిలుచుకునే వారు. వరుసగా రెండవసారి 2016లో అధికారం సంపాదించారు. అయితే, సీఎం అయిన కొద్ది నెలలకే జయలలిత అనారోగ్యం పాలయ్యారు. దీంతో ఆమె 2016 సెప్టెంబరు 22న అర్ధరాత్రి చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆతరువాత ఇక ఆసుపత్రిలోనే ఆమె ఉండిపోయారు. అదే ఏడాది డిసెంబర్ 5వ తేదీన ఆసుపత్రిలోనే మృతి చెందారు. అయితే, జయలలిత అనారోగ్యం నుంచీ ఆసుపత్రిలో చికిత్స, మరణం వరకూ అనేక సందేహాలు ప్రజల్లో నెల్లకొన్నాయి. ఆమె ఆసుపత్రిలో ఉన్న 75 రోజులపాటు తన స్నేహితురాలిగా చెప్పుకునే శశికళ కనుసన్నలలోనే అన్ని వ్యవహారాలూ నడిచాయి.
అన్నీ సందేహాలే..
జయలలిత ఆసుపత్రిలో చేరడం దగ్గరనుంచీ ఆమె మరణం వరకూ అన్నీ సందేహాలే. ఒక్క సందేహానికి ఇప్పటివరకూ సమాధానం దొరకలేదు. ఆమె మరణంపై నెలకొన్న అతి ముఖ్యమైన అనుమానాలు/సందేహాలు ఇవే..
- ఆసుపత్రిలో చేరే సమయానికి జయలలిత ఆరోగ్య పరిస్థితి ఏంటి ?
- ఆమెని కలిసే అవకాశం ఎవ్వరికీ ఎందుకు ఇవ్వలేదు ?
- జయకు ఉన్న అనారోగ్యం ఏమిటి? ఏవిధమైన చికిత్స జరిగింది?
- ఆమె ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఒక ఫోటో కానీ లేదా ఆడియో క్లిప్ కానీ ఎందుకు విడుదల చేయలేదు. ?
- జయలలిత చెంపలపై మూడు గాయాల్లాంటి గుర్తులున్నాయి. దాని అర్థం ఆమె ఎప్పుడో చనిపోయింది అనేనా ?
- ఒకవేళ అదే నిజమైతే, ఆ విషయాన్ని ఎందుకు రహస్యంగా దాచిపెట్టారు ?
- డిసెంబర్ 5వ తేదీన సాయంత్రం 5:30 గంటలకే ఆమె చనిపోయినట్టుగా చెప్పి, వెంటనే అది కేవలం ఓ రూమర్ మాత్రమే అని కొట్టిపారేయాల్సిన అవసరం ఏమొచ్చింది ?
- మళ్లీ రాత్రి 11.30కి చనిపోయినట్లు ప్రకటించారు, ఏది నిజం?
- అసలు ఆ 75 రోజులు ఏం జరిగింది?
కథ ప్రారంభం.. ముగింపు..ఇలా..
జయలలిత స్వల్ప అనారోగ్య కారణాలతో 2016 సెప్టెంబరు 22న రాత్రి 8.45కి చెన్నై అపోలో ఆసుపత్రిలో చేరారు. ఆ సమయంలో న్నిహితురాలు శశికళ ఆమెతోనే ఉన్నారు. ఏక్యూట్ పల్మనరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ కేసు కింద అపోలో ఆసుపత్రిలో చికిత్స ప్రారంభించారు. ఆసుపత్రి వర్గాలు సెప్టెబరు 23న విడుదల చేసిన ప్రెస్ రిలీజ్‌లో ముఖ్యమంత్రికి జ్వరం, డీహైడ్రేషన్ మాత్రమే అని చెప్పాయి. తరువాత అనేక రోజుల పాటు “అంతా బాగానే ఉంది” అనే ప్రచారమే నడిచింది. ఆసుపత్రి రెండో ఫ్లోర్‌లో మల్టి-డిసిప్లినరీ సిసియు వద్ద కట్టుదిట్టమైన సెక్యూరిటీతో జయలలితకు చికిత్స అందించారు. చికిత్స జరిగిన 75 రోజులలో పార్టీ నేతలు, మంత్రులు, ముఖ్యమంత్రి, గవర్నర్ సహా ఎవరినీ జయ గదిలోకి రానివ్వకుండా శశికళ కాపలా కాశారు. దీంతో ప్రజలు, పార్టీ కార్యకర్తలలో విపరీతంగా అనుమానాలు పెరిగిపోయాయి. దీనికి తోడు అపోలో ఆసుపత్రి వర్గాలు కూడా చికిత్స వివరాలు వెల్లడించలేదు. 75 రోజులూ ఆసుపత్రిలోని సీసీటీవీ కెమెరాలన్నింటినీ స్విచ్ ఆఫ్ చేశారు. చివరకు 2016 డిసెంబరు 5 రాత్రి 11.30కి జయ చనిపోయినట్లు ప్రకటించారు.
ఈ సమయంలో అమ్మ ఆసుపత్రిలో ఇడ్లీ, చెట్నీ తింటున్నారని తాము చెప్పింది అంతా అబద్దం అని, శశికళకు భయపడే అలా చెప్పామని మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. అమ్మ మృతిపై ఎలాంటి వివాదాలు, రహస్యాలు లేవని ముఖ్యమంత్రి పళనిస్వామి చెప్పారు.
దర్యాప్తు..
జయ ఆరోగ్యం, చికిత్స, మరణంపై పెద్ద ఎత్తున ప్రజల్లో అనుమానాలు వెల్లువెత్తాయి. జయ ఆసుపత్రిలో చేరిన రోజు సీసీ టీవీ ఫుటేజిని అపోలో ఆసుపత్రి వర్గాలు కమిషన్ కు ఇవ్వలేదు. దీనిపై చెన్నై హైకోర్టులో పిటిషన్లు దాఖలు అయింది. తమ పార్టీ అధికారంలోకి వచ్చాక జయ మరణ రహస్యాన్ని బయటపెడతామని ఇప్పటి ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రకటించారు. జయ చనిపోయిన దాదాపు 10 నెలల తరువాత ప్రభుత్వం విచారణ కమిషన్ ఏర్పాటు చేసింది. దీనికి చైర్మన్ గా హైకోర్టు రిటైడ్ న్యాయమూర్తి ఆర్ముగస్వామిని ఆమె మేనల్లుడు దీపక్, మేనకోడలు దీపలకే హక్కు ఉందని తేల్చింది.
మరోవైపు కమిషన్ విచారణ ఏళ్ల తరబడి సాగుతుండటంపై గత జూలై నెలలో హైకోర్టు ఆగ్రహం వ్ వ్యక్తం చేసింది. దీంతో కమిషన్ హైకోర్టుకు నివేదిక సమర్పించింది. ఇప్పుడు అందరి చూపూ ఈ కమిషన్ నివేదికపైనే ఉన్నాయి. తమిళనాట ఈ నివేదికపై ఉత్సుకత నెలకొని ఉంది. జయలలిత మరణ రహస్యం ఆర్ముగస్వామి కమిషన్ ద్వారానైనా బయటపడుతుందా? లేదా? అనేది వేచి చూడాలి.