CM Jagan: ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ.. ఏపీకి సంబంధించిన కీలక అంశాలపై చర్చ
ప్రధాని మోడీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భేటీ ముగిసింది. ప్రధానితో గంటకు పైగా సీఎం భేటీ కొనసాగింది. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై సమావేశంలో..
ప్రధాని మోడీతో(PM Modi) ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి(CM Jagan) భేటీ ముగిసింది. ప్రధానితో గంటకు పైగా సీఎం భేటీ కొనసాగింది. ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు. రాత్రి 7 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రితో సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధానితో సీఎం చర్చించినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్ ప్రధానికి వివరించినట్లు సమాచారం. పోలవరం ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితి, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ అంశాలు, రెవెన్యూ లోటు, విభజన నేపథ్యంలో రాష్ట్రానికి రావాల్సిన రెవెన్యూ గ్యాప్ విడుదల అంశాన్ని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
అయితే మరికాసేట్లో కేంద్ర మంత్రి అమిత్ షాను సీఎం జగన్ కలవనున్నారు. విభజన హామీల అమలు, ఇతర సమస్యల పరిష్కారంపై కేంద్ర మంత్రులతో సీఎం చర్చిస్తారని సమాచారం. ఈ రాత్రికి ఢిల్లీలోనే బస చేయనున్నట్లుగా తెలుస్తోంది. బుధవారం ఉదయం మరికొందరు కేంద్రమంత్రులను కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రధానికి సీఎం నివేదించిన అంశాలు:
- పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలకు ఆమోదం తెలపాలని కోరుతున్నాను. 2019, ఫిబ్రవరి 11న జరిగిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను రూ. 55, 548.87 కోట్లుగా నిర్ధారించింది. ఈ అంచనాలకు వెంటనే ఆమోదం తెలపాలని విజ్ఞప్తిచేస్తున్నాను.
- ప్రాజెక్టును పూర్తిచేయడానికి ఇంకా రూ.31,188 కోట్లు ఖర్చు చేయాల్సిన అవసరాన్ని మీ ముందుకు తెస్తున్నాను. ఇందులో నిర్మాణ పనులకోసం రూ.8,590 కోట్లు, భూ సేకరణ – పునరావాసంకోసం రూ.22,598 కోట్లు ఖర్చవుతుంది.
- పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో కాంపొనెంట్ వైజ్‌గా బిల్లుల చెల్లింపును సవరించాలని కోరుతున్నాం. దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఖర్చుకు, కేంద్ర చెల్లిస్తున్న బిల్లులకు మధ్య చాలా వ్యత్యాసం ఉంటోంది. ఈ ఆంక్షల వల్ల రూ.905 కోట్ల బిల్లులను కూడా పోలవరం ప్రాజెక్ట్‌అథారిటీ తిరస్కరించింది. కాంపొనెంట్‌వారీగా కాకుండా మొత్తం ప్రాజెక్టులో జరిగే పనులను ³రిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తిచేస్తున్నాను. అంతేకాకుండా నిధులను సకాలానికే విడుదలచేయాలని కోరుతున్నాను.
- పోలవరం ప్రాజెక్ట్ కారణంగా నిర్వాసితులైన కుటుంబాలకు ఎలాంటి ఆలస్యం లేకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీచేయాలని కోరుతున్నాను.
- జాతీయ ఆహార భద్రతా చట్టం కింద లబ్ధిదారుల గుర్తింపుకోసం అనుసరిస్తున్న విధానం లోపభూయిష్టంగా ఉంది. దీనివల్ల ఏపీకి అన్యాయం జరుగుతోంది. రాష్ట్రంలో 1.45 కోట్ల కుటుంబాలకు రేషన్ అందిస్తుంటే, ఇందులో కేంద్రం నుంచి కేవలం 0.89 కోట్ల కుటుంబాలకు మాత్రమే అందుతోంది. మిగిలిన 0.56 కోట్ల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా నిధులు ఖర్చుచేస్తూ రేషన్ ఇస్తోంది. ఆర్థికంగా బాగున్న మహారాష్ట్ర, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లోని 75శాతం, పట్టణ–నగర ప్రాంతాల్లోని 50శాతం ప్రజలకు రేషన్‌ను కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే, ఏపీలో మాత్రం 61శాతం రూరల్, 41శాతం అర్బన్ ప్రజలకు మాత్రమే రేషన్‌ను ఇస్తున్నారు. దీన్ని వెంటనే సరిదిద్దాలని విజ్ఞప్తిచేస్తున్నాను.
- భోగాపురం అంతర్జాతీయ ఎయిర్‌పోర్టుకు సంబంధించి సైట్ క్లియరెన్స్ అప్రూవల్ గడువు ముగిసింది. తాజాగా క్లియరెన్స్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈమేరకు పౌరవిమానయాన శాఖకు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నాను.
- రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం కడపలో సమగ్ర స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ మెకాన్ ఇప్పటికీ తన నివేదికను ఇవ్వలేదు. రాయలసీమ, కడప జిల్లా ప్రజల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వమే స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు నడుంబిగించింది. దీనికోసం వైయస్సార్ స్టీల్ కార్పొరేషన్ లిమిటెడ్‌ను ఏర్పాటు చేసింది. ఈమేరకు కేంద్రం తోడ్పాటు అందించాలని విజ్ఞప్తిచేస్తున్నాను.
- అలాగే ఏపీ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు బీచ్‌శాండ్ మినరల్స్ ప్రాంతాలను కేటాయించాలని విజ్ఞప్తిచేస్తున్నాను. 16 చోట్ల బీచ్‌శాండ్ ఉన్న ప్రాంతాలను ఏపీఎండీసీకి కేటాయించాలని కోరుతున్నాను. అటమిక్ ఎనర్జీ విభాగం ఇప్పటికే 2 ప్రాంతాలను ఏపీఎండీసీకి కేటాయించింది. దీనికి సంబంధించిన అనుమతులు కూడా పెండింగులో ఉన్నాయి. మిగిలిన 14 ప్రాంతాలకు సంబంధించి కేటాయింపులు, అనుమతులకు ఆదేశాలివ్వాలని కోరుతున్నాను.
- మహమ్మారులు సోకినప్పుడు ప్రజారోగ్య వ్యవస్థ ఎంత కీలకమో ఇటీవల కోవిడ్ పరిస్థితుల్లో వెల్లడైంది. ప్రజారోగ్య వ్యవస్థలో మౌలిక వసతులను గణనీయంగా పెంచడానికి ఏపీ ప్రభుత్వం భారీ కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలో 11 బోధనాసుపత్రులు ఉన్నాయి. కొత్తగా మరో మూడింటికి కేంద్రం అనుమతులు మంజూరుచేసింది. వీటి పనులు చురుగ్గా సాగుతున్నాయి. మరో 12 బోధనాసుపత్రులకు కూడా వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరుతున్నాం.
- విభజన కారణంగా రాష్ట్రానికి భారీ నష్టం వాటిల్లింది.
- రెవిన్యూ గ్యాప్‌ను భర్తీకోసం ఇచ్చిన నిధుల్లో తీవ్ర వ్యత్యాసం ఉంది. ఆమేరకు ఆర్థికంగా ఏపీకి నష్టం వాటిల్లింది.
- రాష్ట్ర విభజన వల్ల 58.32శాతం జనాభా విభజిత ఆంధ్రప్రదేశ్‌కురాగా, కేవలం 46శాతం రెవిన్యూ మాత్రమే దక్కింది. ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 9శాతం జానాభా ఉన్న హైదరాబాద్ నగరంను కోల్పోవడంద్వారా ఆ నగరం నుంచి అందే 38శాతం రెవిన్యూను కోల్పోయాం. తర్వాత వచ్చిన కోవిడ్.. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గణనీయంగా దెబ్బతీసింది. దాదాపు రూ. 33,478 కోట్ల మేర ఆదాయం కోవిడ్ కారణంగా రాకుండాపోయింది. కోవిడ్ నివారణా, చికిత్సలకోసం మరో రూ.7,130 కోట్ల రూపాయలను అదనంగా ఖర్చు చేయాల్సిన అనివార్య పరిస్థితులు తలెత్తాయి. 15వ ఆర్థిక సంఘం కేటాయింపులు కూడా రాష్ట్రానికి తగ్గడం మరొక ప్రతికూల పరిణామం.
- తెలంగాణ డిస్కంలు రూ.6,455.76 కోట్ల రూపాయలను ఏపీ జెన్‌కోకు చెల్లించాల్సి ఉంది. రాష్ట్రాన్ని విభజించిన నాటినుంచీ జూన్ 2017 వరకూ తెలంగాణ డిస్కంలకు చేసిన విద్యుత్ పంపిణీకి సంబంధించి ఈమొత్తాన్ని ఇవ్వాల్సి ఉంది. ఈ డబ్బును ఇప్పించాల్సిందిగా కోరుతున్నాను. ఈమేరకు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తిచేస్తున్నాం. తీవ్ర రుణభారాన్ని ఎదుర్కొంటున్న ఏపీ విద్యుత్ పంపిణీ సంస్థలు తమ ఆర్థిక నిర్వహణకోసం ఈ డబ్బు చాలా అవసరం.
ఇవి కూడా చదవండి: Viral Video: ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో.. అమ్మను ముద్దాడింది.. వెళ్లిపోయింది.. వీడియో చూస్తే మీరు అదే అంటారు..
Drugs Case: హాష్ ఆయిల్ కేసులో కీలక సూత్రధారి అరెస్ట్.. విచారణ ముమ్మరం చేసిన నార్కోటిక్ వింగ్..
Sanjay Raut: శివసేన ఎంపీ ఆస్తులపై ఈడీ దాడులు.. మనీలాండరింగ్ చేసినట్లుగా ఆరోపణలు..