Tamil Nadu LS Polls: దమ్ముంటే వారిని తమిళనాడు నుంచి పోటీ చేయించండి.. బీజేపీకి అన్నాడీఎంకే సవాలు..!
General Elections 2024: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కొన్ని మాసాల క్రితం ఎన్డీయే కూటమి నుంచి వైదొలగిన అన్నాడీఎంకే.. బీజేపీని టార్గెట్ చేస్తూ ఘాటు విమర్శలు చేసింది.
సార్వత్రిక ఎన్నికలు (General Elections 2024) సమీపిస్తున్న వేళ తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు జోరుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నాయి. డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కొన్ని మాసాల క్రితం ఎన్డీయే కూటమి నుంచి వైదొలగిన అన్నాడీఎంకే.. బీజేపీని టార్గెట్ చేస్తూ ఘాటు విమర్శలు చేసింది. తమిళనాడులో గెలుస్తామంటూ బీజేపీ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి కేపీ మునుస్వామి ఎద్దేవా చేశారు. తమిళనాడులో గెలుస్తామన్న నమ్మకముంటే కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జైశంకర్‌ను రాష్ట్రం నుంచి పోటీ చేయించాలని సవాల్ విసిరారు.
తమిళనాడులో బీజేపీ మంచి ఫలితాలు సాధిస్తుందన్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఆ నమ్మకముంటే తమిళనాడుకు చెందిన కేంద్ర సహాయ మంత్రి ఎల్ మురుగన్‌ను రాజ్యసభకు ఎందుకు పంపారని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయించాల్సిందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలిచే పరిస్థితి లేనందునే ఆయన్ను రాజ్యసభకు పంపారని చెప్పారు. అయితే రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ గెలుస్తుందని ప్రచారం చేస్తూ ప్రజలను మోసగించాలని చూస్తున్నారని విమర్శించారు. బీజేపీ నేతలకు దమ్ముంటే.. తమిళనాడుకు చెందిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, తమిళనాడులో పుట్టి పెరిగిన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను తమిళనాడు నుంచి పోటీ చేయించాలని సవాల్ చేస్తున్నట్లు చెప్పారు. తమిళనాడులోని ఏ లోక్‌సభ నియోజకవర్గం నుంచైనా వారిని పోటీ చేయించొచ్చని అన్నారు. తమిళనాడులో గెలుస్తామన్న నమ్మకం బీజేపీ నేతలకు ఉంటే తన సవాలును స్వీకరించాలన్నారు. ద్రవిడ గడ్డ తమిళనాడులో బీజేపీ గెలిసే అవకాశమే ఉండదన్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ బీజేపీకి తమిళనాడు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
దేవుడు కూడా కాపాడలేరు..ఈపీఎస్
కాగా లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే విజయం సాధిస్తే రాష్ట్రాన్ని దేవుడు కూడా కాపాడలేరని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఎడపాడి పళనిస్వామి అన్నారు. కావేరీ నదిపై మేకెదట్టు వద్ద కర్ణాటక ప్రభుత్వం చేపడుతున్న అక్రమ డ్యామ్ నిర్మాణాన్ని అడ్డుకోవడంలో స్టాలిన్ సర్కారు విఫలం చెందిందని ఆరోపించారు. డీఎంకే ప్రభుత్వ హయాంలో రైతుల పరిస్థితి దారుణంగా మారుతోందన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి డీఎంకేకి గట్టిగా బుద్ధిచెప్పాలని పిలుపునిచ్చారు. కావేరీ డెల్టా రైతుల ప్రయోజనాల పరిరక్షణ అన్నాడీఎంకేతోనే సాధ్యమన్నారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి కావేరీ నదీ జలాలు విడుదల చేయించే దమ్ము స్టాలిన్ ప్రభుత్వానికి లేదని విమర్శించారు.
తమిళనాడులోని 39 లోక్‌సభ నియోజకవర్గాలు, పుదుచ్చేరిలోని 1 స్థానానికి మరో రెండు మాసాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డీఎంకే నేతృత్వంలోని ఇండియా కూటమి, అన్నాడీఎంకే, బీజేపీ మధ్య గట్టిపోటీ నెలకొంటోంది. ఇటీవల అన్నాడీఎంకేకి చెందిన పలువురు మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. తమిళనాడులో పర్యటించిన ప్రధాని మోదీ.. బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.