IND vs NZ 5th T20I: చోటా ప్యాకెట్ విధ్వంసం.. 23 సిక్సర్లతో భారత్ ప్రపంచ రికార్డు..!
India 23 sixes record: భారత్ వర్సెస్ న్యూజిలాండ్ 5వ టీ20లో టీమిండియా సిక్సర్ల సునామీ సృష్టించింది. 23 సిక్సర్లతో పాత రికార్డును సమం చేస్తూ, 271 పరుగులు సాధించిన భారత్.. సరికొత్త రికార్డులతో టీ20 ప్రపంచకప్ 2026కు ముందు నూతనోత్సాహంతో బరిలోకి దిగనుంది.

India vs New Zealand T20 series: టీ20 ప్రపంచకప్ 2026కు ముందు జరిగిన ఆఖరి పోరులో భారత బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఈ క్రమంలో భారత్ మొత్తం 23 సిక్సర్లు బాది, అంతర్జాతీయ టీ20ల్లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన తన పాత రికార్డును సమం చేసింది.
ఇషాన్ కిషన్ వీరవిహారం.. రీఎంట్రీ ఇచ్చిన ఇషాన్ కిషన్ కేవలం 42 బంతుల్లోనే తన తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తం 43 బంతుల్లో 103 పరుగులు చేసిన కిషన్ ఇన్నింగ్స్‌లో 10 సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి.
సూర్యకుమార్ ‘స్కై’ షో: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ 30 బంతుల్లో 63 పరుగులు (4 ఫోర్లు, 6 సిక్సర్లు) చేశాడు. అలాగే టీ20ల్లో వేగంగా (బంతుల పరంగా) 3000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు.
ముగింపులో పాండ్యా మెరుపులు: చివర్లో హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 42 పరుగులు) 3 సిక్సర్లతో విరుచుకుపడటంతో భారత్ 270 మార్కును దాటింది.
ఇప్పటికే భారత్ 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-1 తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ కూడా గెలిచి ఆధిక్యతను పెంచుకోవాలని చూస్తోంది. ఈక్రమంలో ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియాలో కొండంత ఆత్మవిశ్వాసాన్ని నింపింది.
అయితే, ఇప్పటి వరకు టీమిండియాకు సమస్యగా మారిన సంజూ శాంసన్ తన సొంత గడ్డపై ఆడినా 6 పరుగులకే వెనుదిరగడం కొంత నిరాశకు గురిచేసింది.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
