IND vs NZ : వరల్డ్ కప్ ముందు భారత్ విశ్వరూపం.. 271 పరుగులతో కివీస్‌కు టీమిండియా చుక్కలు
IND vs NZ : తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం సాక్షిగా టీమిండియా పరుగుల సునామీ సృష్టించింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో భారత బ్యాటర్లు కివీస్ బౌలర్లను ఉతికి ఆరేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరు సాధించి, టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డులను తిరగరాసింది.

IND vs NZ : తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం సాక్షిగా టీమిండియా పరుగుల సునామీ సృష్టించింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఐదో టీ20లో భారత బ్యాటర్లు కివీస్ బౌలర్లను ఉతికి ఆరేశారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 271 పరుగుల భారీ స్కోరు సాధించి, టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డులను తిరగరాసింది. యువ కెరటం ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీతో విరుచుకుపడగా, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా తమదైన శైలిలో మెరుపులు మెరిపించారు.
టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు టీమిండియా తన బ్యాటింగ్ పవర్‌ను ప్రపంచానికి చాటిచెప్పింది. శనివారం జరిగిన ఆఖరి టీ20లో టాస్ గెలిచిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఏమాత్రం ఆలోచించకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే హోమ్ గ్రౌండ్‌లో ఆడుతున్న సంజు శాంసన్ (6) మరోసారి నిరాశపరిచి త్వరగానే పెవిలియన్ చేరాడు. యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (30) మెరుపులు మెరిపించినా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. కానీ, ఆ తర్వాత అసలైన వినోదం మొదలైంది.
జట్టులోకి తిరిగి వచ్చిన ఇషాన్ కిషన్ మొదటి బంతి నుంచే కివీస్ బౌలర్లపై దండయాత్ర మొదలుపెట్టాడు. కేవలం 28 బంతుల్లోనే హాఫ్ సెంచరీని పూర్తి చేసిన ఇషాన్, ఆ తర్వాత మరింత ఉగ్రరూపం దాల్చి కేవలం 42 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. ఇషాన్ ఇన్నింగ్స్‌లో 10 భారీ సిక్సర్లు, 6 ఫోర్లు ఉన్నాయి. కివీస్ స్టార్ స్పిన్నర్ ఈష్ సోధి వేసిన ఒకే ఓవర్‌లో ఇషాన్ 29 పరుగులు రాబట్టడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. ఇషాన్ 103 పరుగుల వద్ద అవుట్ అయినప్పటికీ, అప్పటికే భారత్ విజయావకాశాలను సుగమం చేశాడు.
మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా తన 360 డిగ్రీల బ్యాటింగ్‌తో అలరించాడు. కేవలం 30 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 63 పరుగులు సాధించిన సూర్య, ఇషాన్ కిషన్‌తో కలిసి మూడో వికెట్‌కు 137 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇన్నింగ్స్ చివరలో హార్దిక్ పాండ్యా (17 బంతుల్లో 42) సిక్సర్లతో విరుచుకుపడటంతో భారత్ 20 ఓవర్లలో 271 పరుగుల రికార్డు స్కోరును నమోదు చేసింది. కివీస్ బౌలర్లలో లాకీ ఫెర్గూసన్, జాకబ్ డఫీ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఇప్పుడు న్యూజిలాండ్ ఈ భారీ లక్ష్యాన్ని ఎలా ఛేదిస్తుందో చూడాలి.
