Ishan Kishan : తిరువనంతపురంలో ఇషాన్ విధ్వంసం..టీ20 కెరీర్లో తొలి సెంచరీ నమోదు
Ishan Kishan : తిరువనంతపురం వేదికగా జరుగుతున్న ఆఖరి టీ20లో టీమిండియా పరుగుల సునామీ సృష్టించింది. కివీస్ బౌలర్లను ఒక ఆట ఆడుకుంటూ ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సిక్సర్ల వర్షం కురిపించారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ తన టీ20 కెరీర్లో తొలి సెంచరీ చేశాడు. అలాగే కెప్టెన్ సూర్య 3000 పరుగుల రికార్డుతో మెరుపు హాఫ్ సెంచరీ సాధించడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది.

Ishan Kishan : తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం సాక్షిగా టీమిండియా ఓపెనర్ ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా విరుచుకుపడ్డాడు. కేవలం 42 బంతుల్లోనే శతక్కొట్టి తన కెరీర్‌లో తొలి అంతర్జాతీయ టీ20 సెంచరీని నమోదు చేశాడు. కివీస్ బౌలర్లను ఒక ఆట ఆడుకున్న ఇషాన్, గాలిలో సిక్సర్ల వర్షం కురిపిస్తూ మైదానాన్ని హోరెత్తించాడు.
టీ20 వరల్డ్ కప్ 2026కు ముందు జరుగుతున్న ఆఖరి పోరులో టీమిండియా బ్యాటర్లు తమ విశ్వరూపాన్ని ప్రదర్శించారు. ముఖ్యంగా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ తన బ్యాట్‌తో చరిత్ర సృష్టించాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే లోకల్ స్టార్ సంజు శాంసన్ (6) వికెట్ కోల్పోవడం షాక్ ఇచ్చింది. అయితే, ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ మాత్రం ఏమాత్రం తడబడకుండా కివీస్ బౌలింగ్‌ను చీల్చి చెండాడాడు. ఈ క్రమంలో కేవలం 42 బంతుల్లోనే 10 సిక్సర్లు, 6 ఫోర్లతో అద్భుతమైన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సెంచరీ పూర్తి చేసిన వెంటనే భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయినప్పటికీ, అప్పటికే భారత్‌కు ఒక భారీ స్కోరును అందించాడు.
మరోవైపు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం తన 360 డిగ్రీల బ్యాటింగ్‌తో అలరించాడు. కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సూర్య, ఓవరాల్‌గా 30 బంతుల్లో 63 పరుగులు (4 ఫోర్లు, 6 సిక్సర్లు) చేసి అవుట్ అయ్యాడు. ఇషాన్, సూర్య కలిసి మూడో వికెట్‌కు కేవలం 57 బంతుల్లోనే 137 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ క్రమంలో సూర్యకుమార్ యాదవ్ అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా 3000 పరుగుల మైలురాయిని దాటిన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు.
వీరిద్దరి విధ్వంసంతో భారత జట్టు 17.3 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. కివీస్ స్పిన్నర్ ఈష్ సోధిని టార్గెట్ చేసిన ఇషాన్, ఒకే ఓవర్‌లో ఏకంగా 29 పరుగులు రాబట్టడం మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచింది. పవర్‌ప్లేలో అభిషేక్ శర్మ (30) మెరుపులు కూడా జట్టుకు మంచి ఊపునిచ్చాయి. ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్ ఉండటంతో టీమిండియా 250 పైచిలుకు స్కోరు సాధించే దిశగా దూసుకుపోతోంది. వరల్డ్ కప్‌కు ముందు ఇషాన్ కిషన్ ఇలాంటి మాస్ ఇన్నింగ్స్ ఆడటం జట్టు సెలెక్టర్లకు తీపి కబురు లాంటిదే.
మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
