Telangana: కన్నబిడ్డలా సాకారు.. కన్నీటితో వీడ్కోలు చెప్పారు
మానవత్వ విలువలు మంటకలిసి పోతున్న ఆధునిక సమాజంలో పెంపుడు కుక్క పట్ల అసాధారణమైన ఆప్యాయతను చాటుకుంది ఓ కుటుంబo. ముడున్నరేండ్లుగా అపురూపంగా పెంచుకున్న కుక్క (రిమో) ఇటీవల వీధి కుక్కల దాడిలో మృతిచెందింది, ఈ విషాదాన్ని జీర్ణించుకోలేక ఆ కుటుంబం కన్నీటి పర్యాంతం అయింది. మానవ సాంప్రదాయం ప్రకారం దానికి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది

చనిపోయిన పెంపుడు కుక్కకు కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించి నివాళులర్పించిన ఘటన పెద్దపెల్లి జిల్లాలో చోటుచేసుకుంది. గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన కొలని భాస్కర్ రెడ్డి-అన్నపూర్ణ దంపతులు కొన్నేళ్ల క్రితం రిమో అనే పెంపుడు కుక్కను తెచ్చి పెంచుకోవడం స్టార్ట్ చేశారు. దాన్ని వారు తమ కుటుంబంలో ఒకటిగా భావించారు. కన్నబిడ్డలతో సమానంగా ఎంతో అపురూపంగా పెంచుకున్నారు.
అయితే ఇటీవల అనూహ్యంగా వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాపడిన రిమో మృత్యువాత పడడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. రియోకు హిందూ సాంప్రదాయ రీతిలో అంత్యక్రియలు నిర్వహించారు. దీంతోపాటు ఇంట్లో దశ దినకర్మ కూడా చేసి బంధువులకు, కాలనీవాసులకు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు.
మానవత్వ విలువలు మంట కలిసి పోతున్న ప్రస్తుత తరుణంలో అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్కను కుటుంబంలో ఒకటిగా భావించి, అంత్యక్రియలు, కర్మ కార్యక్రమాలు నిర్వహించడం పట్ల పలువురు ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. మరి కొందరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద పెంపుడు కుక్క పట్ల భాస్కర్ రెడ్డి కుటుంబానికి ఉన్న అభిమానం- ఆప్యాయతలకు ఈ ఘటన నిదర్శనంగా నిలుస్తుంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
