Bengaluru Blast: రామేశ్వరం కేఫ్‌లో మిస్టరీ పేలుడు.. పలువురికి గాయాలు
కర్ణాటక రాజధాని బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. వైట్‌ఫీల్డ్ ప్రాంత పోలీసులు.. పేలుడుకు గల కారణాలపై దర్యాప్తు మొదలుపెట్టారు. కేఫ్‌లో మంటలు కూడా చెలరేగడంతో.. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని అదుపు చేశారు.
బెంగళూరు నగరంలోని కుండలహళ్లిలోని రామేశ్వరం కేఫ్‌లో మిస్టరీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. పేలుడు తీవ్రతకు రామేశ్వరం కేఫ్ దెబ్బతినగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పేలుడు సంభవించిన వెంటనే ప్రజలు భయంతో పరుగులు తీయడంతో కొంతసేపు అక్కడ ఆందోళన వాతావరణం నెలకొంది. ఈ పేలుడు సమయంలో భారీ శబ్దం వచ్చింది. దీంతో ఒక్క సారిగా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. ఈ పేలుడు ఘటనలో గాయపడ్డవారిలో ఒక మహిళకు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.
సిలిండర్ లేదా బాయిలర్ పేలి ఉండొచ్చని తొలుత అనుమానించారు. అయితే ఆ ప్రాంతంలో కొన్ని ఐడీ కార్డులు లభ్యమయ్యాయి. పేలుడు జరిగిన ప్రదేశానికి సమీపంలో బ్యాటరీని గుర్తించారు. అలాగే, హోటల్‌లో ఓ కస్టమర్ బ్యాగ్ కాలిపోయి కనిపించింది. ఈ నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసు ఉన్నతాధికారులు కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు.
Bomb blast in #RameshwaramCafe #Bangalore caught on cctv, confirmation not #LPGCylinder pic.twitter.com/B5rtDCnsOp
— Abhishek (@abhishekbsc) March 1, 2024
ఏసీపీ రీనా సువర్ణ, మారతహళ్లి పోలీసులు కూడా సంఘటనా స్థలానికి వచ్చి కాలిపోయిన బ్యాగును, ఐడీ కార్డును పరిశీలించారు. హోటల్‌లోని సీసీటీవీలను కూడా పోలీసులు చెక్ చేశారు. పేలుడు వెనుక ముష్కరుల కుట్ర ఉందా అన్న కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు. అయితే పేలుడుకు గల ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం అవసరమైన సామగ్రితో రామేశ్వరం కేఫ్‌కు వచ్చి తనిఖీలు చేపట్టింది. హోటల్‌లో ఏమీ పేలలేదని.. బయటి నుంచి హోటల్‌కు తీసుకొచ్చిన వస్తువు వల్ల పేలుడు సంభవించినట్లు ప్రాథమికంగా తెలిసింది. దీంతో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…