INDI Alliance: ఇండియా కూటమిలో ఎవరికి వారే యమునా తీరే.. కాంగ్రెస్‌ తీరుపై మిత్రపక్షాల అసంతృప్తి..!

కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలో విభేదాలు బయటపడుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ తీరుపై అసంతృప్తితో ఉన్న మిత్రపక్షాల సంఖ్య పెరుగుతోంది. పార్లమెంటు సాక్షిగా మరోసారి బయటపడింది.

INDI Alliance: ఇండియా కూటమిలో ఎవరికి వారే యమునా తీరే.. కాంగ్రెస్‌ తీరుపై మిత్రపక్షాల అసంతృప్తి..!
Indi Alliance
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 04, 2024 | 7:33 AM

లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకమై ఇండియా కూటమిని ఏర్పాటు చేశాయి. హ్యాట్రిక్ అధికారం చేపట్టకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇండియా కూటమి ఆపలేకపోయాయి. కానీ, భారత కూటమి NDAకి గట్టి పోటీనిచ్చింది. ఇక ఫలితాల తర్వాత విపక్షాల ఐక్యత మెల్ల మెల్లగా విచ్ఛిన్నం అవుతూ వస్తోంది. ఢిల్లీ-హర్యానాలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య రాజకీయ వైరుధ్యం పెరుగుతూ వచ్చింది. ఇటు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యుబిటి) మధ్య విభేదాలు స్పష్టంగా కనిపించాయి.

ఈ నేపథ్యంలోనే ఇండియా కూటమిలో కాంగ్రెస్‌కు మిత్రపక్షాల నుంచి వరుస షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌లో చర్చకు కాంగ్రెస్‌ పట్టుబడుతున్న సమయంలో ఎస్పీ, టీఎంసీ లాంటి పార్టీల నుంచి మద్దతు లభించలేదు. అదానీ కంటే చర్చించాల్సిన విషయాలు చాలా ఉన్నాయని ఆ పార్టీల ఎంపీలు స్పష్టం చేస్తున్నారు.

ఇండియా కూటమిలో ఎవరికి వారే యమునా తీరే లాగా పరిస్థితి తయారయ్యింది. కాంగ్రెస్‌ తీరుపై అసంతృప్తితో ఉన్న మిత్రపక్షాల సంఖ్య పెరుగుతోంది. ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేస్తామని ఆప్‌ ఇప్పటికే ప్రకటించింది. పార్లమెంట్‌ సమావేశాలు ఇండియా కూటమి లోని విభేదాలను మరోసారి బయటపెట్టాయి. అదానీ అంశంపై పార్లమెంటు లోపలేకాదు, బయటకూడా రచ్చ ఆగడం లేదు. మోదీని విమర్శిస్తూ రాహుల్‌గాంధీ నేతృత్వంలో పార్లమెంటు మకరద్వారం దగ్గర విపక్ష ఎంపీలు నిరసన తెలిపారు. అయితే ఇండియా కూటమిలో రెండు పార్టీలు మాత్రం ఈ ఆందోళనకు దూరం అయ్యాయి. ఇండియా కూటమి ఆందోళనకు తృణమూల్‌, సమాజ్‌వాదీ పార్టీలు దూరంగా ఉన్నాయి.

ఉత్తర ప్రదేశ్ సంభల్ మతఘర్షణలపై చర్చకు సమాజ్‌ వాదీ పట్టుబట్టింది. సంభల్ కంటే అదానీ వ్యవహారం పెద్దది కాదన్నారు ఎస్పీ నేతలు. బంగ్లాదేశ్‌ హింస, నిరుద్యోగం, అధిక ధరలు, మణిపూర్ అల్లర్లు, బెంగాల్ సమస్యలపై చర్చకు తృణమూల్‌ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అంతేకాకుండా ఇండియా కూటమి పగ్గాలు మమతా బెనర్జీకి అప్పగిస్తే బాగుంటుందని అంటున్నారు టీఎంసీ నేతలు. ప్రధాని మోదీని ఢీకొట్టే శక్తి కాంగ్రెస్‌ నేతలకు లేదన్నారు టీఎంసీ ఎంపీ కీర్తిఆజాద్‌. బెంగాల్‌లో బీజేపీని దీదీ సిక్సర్‌ కొట్టారని, ఆరు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటారని అన్నారు. ప్రధాని మోదీ బెంగాల్‌కు వచ్చి మమతను విమర్శించినప్పుడల్లా ఆమె శక్తి రెట్టింపు అవుతోందన్నారు కీర్తి ఆజాద్‌.

అదానీ వ్యవహారంలో మరో మిత్రపక్షం ఎన్సీపీ నుంచి కూడా కాంగ్రెస్‌కు మద్దతు లభించడం లేదు. దీంతో ఇండియా కూటమిలో పెద్ద భాగస్వామి పార్టీలు అదానీ వ్యవహారంలో కాంగ్రెస్‌కు దూరమవుతున్నాయి. అయితే ఇండియా కూటమి పగ్గాలు దీదీకి అప్పగించడం పెద్ద జోక్‌ అని వ్యాఖ్యానించారు కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్కం ఠాకూర్‌. అదానీ వ్యవహారంపై పార్లమెంట్‌ లోపల , బయట తమ ఆందోళన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..