- Telugu News Photo Gallery Made in India Nagastra 1: Indian Army receives supply of 480 indigenous loitering munitions
Nagastra-1: భారత సైన్యం అమ్ములపొదిలో సరికొత్త అస్త్రం.. నాగాస్త్రం 1.. దీని స్పెషాలిటీ ఏమిటంటే
భారత సైన్యం అమ్ములపొదిలోకి సరికొత్త అస్త్రం వచ్చి చేరింది. జీపీఎస్ ఆధారంగా కూడా పనిచేసే నాగాస్త్ర 1 డ్రోన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. రాత్రివేళ కూడా లక్ష్యాలను చేధించడం వీటి ప్రత్యేకత. ఈ నాగాస్త్ర-1 శత్రు బంకర్లను, పోస్టులను, ఆయుధ డిపోలను ధ్వంసం చేయగల సామర్ధ్యం కలిగి ఉంది.
Updated on: Dec 04, 2024 | 8:09 AM

భారత సైన్యానికి అత్యాధునిక డ్రోన్లు అందుబాటులోకి వచ్చాయి. ఆత్మాహుతి డ్రోన్లుగా పిలిచే నాగాస్త్ర 1 తో ఇప్పుడు భారత సైనికులకు మరికొంత ఆయుధ బలం వచ్చి చేరినట్టయింది. రాత్రి వేళ కూడా టార్గెట్‌ని చేధించడం వీటి స్పెషాలిటి. స్వదేశీ పరిజ్ఞానంతో నాగపూర్‌కు చెందిన సోలార్ ఇండస్ట్రీస్ వీటిని తయారు చేసి, భారత సైన్యానికి అందించింది. జీపీఎస్ ఆధారంగా కూడా నాగాస్త్ర 1 డ్రోన్లు పనిచేస్తాయి.

చైనా సరిహద్దుకు సమీపంలోని లడఖ్‌లోని నుబ్రా వ్యాలీలో ఈ నాగాస్త్రం పరీక్షలు జరిగాయి. అంటే భవిష్యత్తులో సర్జికల్ స్ట్రైక్స్ కోసం యుద్ధ విమానాల అవసరం లేదన్నమాట. ఈ డ్రోన్ల ద్వారా శత్రువుల స్థావరాల్లోకి రహస్యంగా ప్రవేశించి దాడులు చేయవచ్చు.

నాగాస్త్ర 1 డ్రోన్లు శత్రువుల భూభాగంలోకి వెళ్లి విధ్వంసం కలిగిస్తాయి. అత్యవసర సేకరణ అధికారాల కింద సోలార్ ఇండస్ట్రీస్ ఎకనామిక్స్ ఎక్స్‌ప్లోజివ్స్ లిమిటెడ్‌కి గతంలోనే వీటి తయారీకి ఆర్డర్ ఇచ్చింది భారత సైన్యం. ఈ డ్రోన్లను సైనిక భాషలో మందుగుండు సామగ్రి అంటారు. వీటిని భూమి నుంచి సులభంగా ప్రయోగించవచ్చు.

1.5 కిలోల పేలుడు వార్ హెడ్‌లను మోసుకెళ్లడంలోనూ ఎలాంటి ఇబ్బంది ఉండదు. టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్లు, శత్రవుల శిక్షణా శిబిరాలను ఈ డ్రోన్లతో దాడులు జరపవచ్చు. ఈ డ్రోన్ల బరువు తొమ్మిది కిలోలు ఉంటుంది. ఇది ఒకేసారి 60 నిమిషాల పాటు ఎగరగలదు. కార్యాచరణ పరిధి రెండు భాగాలుగా విభజించబడింది. వీడియో లింక్ పరిధి 15 కిలోమీటర్లు.

4500 మీటర్ల ఎత్తులో ఎగిరే ఈ డ్రోన్ శత్రు ట్యాంకులు, బంకర్లు, సాయుధ వాహనాలు, ఆయుధ డిపోలు లేదా సైనిక బృందాలపై నేరుగా దాడి చేయగలదు.

రక్షణ రంగంలో మేక్ ఇన్ ఇండియా కింద సైన్యం 480 నాగాస్త్ర 1 డ్రోన్‌లను ఆర్డర్ చేసింది. ఈ డీల్ విలువ 300 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొదటిసారిగా ఇలాంటి డ్రోన్లను నాగపూర్‌కు చెందిన EEL కంపెనీ విదేశాల నుంచి కొనుగోలు చేసింది.

వాటిని సైన్యానికి కావాల్సిన విధంగా రూపొందించింది. నాగాస్త్ర 1 డ్రోన్లతో భారత సైన్యం చేతికి మరో అత్యాధునిక అస్త్రం వచ్చి చేరినట్టయింది. ఇక శత్రువులను టార్గెట్ చేసి, విధ్వంసం చేయడం సులభతరం కానుందని భారత సైన్యంలోని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.

GPS లక్ష్య పరిధి 60 కి.మీ. ఈ ఆయుధం ఇజ్రాయెల్, పోలాండ్ నుంచి దిగుమతి చేసుకున్న వాయు ఆయుధాల కంటే 40 శాతం చౌకగా లభిస్తుంది. రెండు సంవత్సరాల క్రితం సోలార్ ఇండస్ట్రీస్ Z మోషన్ అటానమస్ సిస్టమ్స్‌లో 45% ఈక్విటీ వాటాను తీసుకుంది. దీంతో మానవరహిత వైమానిక వాహనం (యూఏవీ) తయారు చేసేందుకు సోలార్ కంపెనీకి అవకాశం లభించింది.





























