Road Accident: అయ్యో ఎంత ఘోరం.. కారును ఢీకొన్న ట్రక్కు! ఆరుగురు విద్యార్థులు మృతి
కారులో వెళ్తున్న విద్యార్ధుల జీవితాలు రోడ్డు ప్రమాదంలో అర్ధాంతరంగా ముగిశాయి. ఇవాళ్టి తెల్లవారు జామున వీరు ప్రయాణిస్తున్న కారును అదే రోడ్డుపై ఎదురుగా వస్తున్న ట్రక్కు బలంగా ఢీ కొట్టింది. ప్రమాదం ధాటికి కారు నుజ్జయ్యింది. ఇక అందులోని విద్యార్ధులు అక్కడికక్కడే మృతి చెందారు..
డెహ్రాడూన్, నవంబర్ 12: ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కు, ఇన్నోవా కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలోఆరుగురు విద్యార్ధులు ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం ఉదయం తెల్లవారుజామున 2 గంటలకు ఓఎన్జీసీ కూడలి వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు విద్యార్థులు ఉన్నట్లు తెలిసింది. దాంట్లో ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు దుర్మరణం పాలయ్యారు. వీరిలో ఆరుగురూ అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. ఒక విద్యార్థి తీవ్ర గాయాల పాలవగా చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ విద్యార్ధులంతా ఒకే ప్రైవేటు కాలేజీకి చెందిన వారు.
అందిన సమాచారం మేరకు ట్రక్కు ఇన్నోవాను బలంగా ఢీకొనడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. దీంతో కారును కట్ చేసి మృతదేహాలను వెలికి తీయాల్సి వచ్చింది. కొన్ని మృతదేహాల తలలు ఛిద్రమయ్యాయి. దీంతో ప్రమాద స్థలం అంతా రక్తపుటేరులతో భీతాకరంగా కనిపించింది. ప్రమాదం అనంతరం ట్రక్కు డ్రైవర్ అక్కడ నుంచి పారారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని దెబ్బతిన్న కారులోంచి మృతదేహాలను వెలికితీశారు.
డూన్ ఆస్పత్రికి విద్యార్థులు మృతదేహాలను పంపారు. గాయపడ్డ విద్యార్థిని మహంత్ ఇంద్రేశ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. మృతిచెందిన వారిలో ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. మృతులను గునీత్ (19), కామాక్షి (20), నవ్య గోయల్ (23), రిషబ్ జైన్ (24), కునాల్ కుక్రేజా (23), అతుల్ అగర్వాల్ (24)గా గుర్తించారు. గాయపడిన వ్యక్తిని డెహ్రాడూన్‌కు చెందిన సిద్ధేష్ అగర్వాల్‌గా గుర్తించారు.