విజృంభిస్తున్న కరోనా కేసులు.. ఈ ఐదు రాష్ట్రాల్లోనే ఎక్కువగా నమోదు
కరోనా మళ్లీ జడలు విప్పుతోంది. రోజురోజుకు కేసులు పెరుగడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 2,151 కొత్త కొవిడ్ కేసులు నమోదుకాగా.. ఏడుగురు మృతి చెందారు. దాదాపు ఐదు నెలల తర్వాత ఇంత భారీ స్థాయిలో కేసులు రావడం ఇదే మొదటిసారి.
కరోనా మళ్లీ జడలు విప్పుతోంది. రోజురోజుకు కొవిడ్ కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో 2,151 కొత్త కొవిడ్ కేసులు నమోదుకాగా.. ఏడుగురు మృతి చెందారు. దాదాపు ఐదు నెలల తర్వాత ఇంత భారీ స్థాయిలో కేసులు రావడం ఇదే మొదటిసారి. అయితే దేశం మొత్తంలో కరోనా పెరుగుతుండగా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఐదు రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యధికంగా బయటపడుతున్నాయి. మొదటగా మహారాష్ట్రలో మంగళవారం రోజున దాదాపు 450 కొవిడ్ కేసులు వచ్చాయి. అయితే సోమవారం ఒక్కరోజే 205 కేసులు రాగా మంగళవారం వాటి సంఖ్య డబుల్ కావడం ఆందోళన కలిగిస్తోంది. అలాగే ఈ రాష్ట్రంలో ముగ్గురు కరోనా బారిన పడి మృతిచెందారు.
ఇక కరోనా కేసులు అత్యధికంగా నమోదవుతున్న రెండవ రాష్ట్రం ఢిల్లీ. మంగళవారం రోజున ఇక్కడ 214 కొత్త కేసులు వచ్చాయి. కానీ గత 24 గంటల్లో ఈ రాష్ట్రంలో ఒక్కరూ కూడా కరోనా వల్ల మృతి చెందలేదు.ప్రస్తుతం ఇక్కడ 671 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మూడో అత్యధిక కరోనా కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా కేరళ నిలిచింది. ఇక్కడ సోమవారం రోజున సుమారు 191 కేసులు బయటపడ్డాయి. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో 2,662 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అయితే దేశంలో అత్యధికంగా యాక్టివ్ కేసులు కేరళలోనే ఉన్నాయి. అలాగే ఇక్కడ మూడు కరోనా మరణాలు సంభవించాయి. కర్ణాటకలో గత 24 గంటల్లో 135 కేసులు రాగా యాక్టివ్ కేసులు సంఖ్య 800 దాటింది. అలాగే ఒకరు ప్రాణాలు కోల్పోయారు. చివరగా తమిళనాడులో 105 మంది కరోనా బారిన పడ్డారు. ఒక్క చెన్నైలోనే సుమారు 31 కేసులు నమోదయ్యాయి. ఈ ఐదు రాష్ట్రాలు దేశంలో అత్యధికంగా కరోనా కేసులు వెలుగుచుస్తున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి