Zone Zero Fitness Trend: జిమ్‌కు వెళ్లే పనిలేదు.. ఇంట్లోనే ఇలా చేస్తే చాలు ఆరోగ్యం మీ సొంతం!
ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు, ఫిట్‌నెస్ పెంచుకోవడంపై చాలా మంది శ్రద్ద చూపిస్తున్నారు. ఫిట్‌నెస్ కోసం కొందరు జిమ్‌కి వెళ్లి ఎక్సర్‌సైజులు చేస్తారు. మరొకొందరు యోగా చేస్తారు. కొందరు ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకుంటారు. మరికొందరు అన్ని రకాల ఫుడ్స్ తింటూనే జిమ్‌లో చెమటోడ్చుతుంటారు.

సాధారణంగా ఫిట్‌నెస్ అనగానే మనకు గుర్తొచ్చేది భారీ బరువులు ఎత్తడం లేదా వేగంగా పరుగెత్తడం. కానీ ‘జోన్ జీరో’ వీటన్నింటికీ భిన్నమైనది. దీని కోసం మీరు ప్రత్యేకంగా స్పోర్ట్స్ షూస్ వేసుకోవాల్సిన అవసరం లేదు, గ్రౌండ్‌కు వెళ్లాల్సిన పనిలేదు. జస్ట్ నిలబడటం, ఒళ్లు విరుచుకోవడం (స్ట్రెచింగ్), సాధారణ శారీరక కదలికల ద్వారానే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది తక్కువ ఇంటెన్సిటీ కలిగిన యాక్టివిటీలపై ఆధారపడుతుంది. మీ గరిష్ట హార్ట్ రేట్‌లో 50 శాతం కంటే తక్కువ స్థాయిలో ఉండే కదలికలనే జోన్ జీరో వ్యాయామాలుగా పిలుస్తారు.
దైనందిన పనులే వ్యాయామాలు
నిజానికి మనం రోజూ చేసే చిన్న చిన్న పనులే ఈ జోన్ జీరో కిందికి వస్తాయి. ఉదాహరణకు, ఫోన్ మాట్లాడుకుంటూ గదిలో అటు ఇటు నడవడం, కూరగాయల కోసం నడుచుకుంటూ వెళ్లడం, ఇంట్లో బట్టలు మడతపెట్టడం, ఇల్లు సర్దడం, మొక్కలకు నీళ్లు పోయడం వంటివన్నీ ఇందులో భాగమే. నడక కంటే కూడా తక్కువ వేగంతో సాగే ఈ కదలికలు శరీరానికి పెద్దగా శ్రమ కలిగించవు, చెమట పట్టవు. కానీ శరీరంలోని ప్రతి అవయవం యాక్టివ్‌గా ఉండేలా చేస్తాయి. ముఖ్యంగా వృద్ధులు, కండరాల బలహీనత ఉన్నవారు ఈ పద్ధతిని సులభంగా అనుసరించవచ్చు.
అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు
జోన్ జీరో వల్ల కలిగే లాభాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఇది శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరచడమే కాకుండా, మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. భోజనం చేసిన తర్వాత చేసే ఇలాంటి చిన్నపాటి కదలికలు బ్లడ్ షుగర్ లెవల్స్‌ను నియంత్రిస్తాయి. తద్వారా టైప్ 2 డయాబెటిస్ ముప్పు తప్పుతుంది. ‘లాన్సెట్ రివ్యూ’ వంటి పరిశోధనలు సైతం ఈ విషయాన్ని ధృవీకరించాయి.
రోజువారీ సాధారణ కదలికలు మనిషి ఆయుష్షును పెంచుతాయని, అకాల మరణాల ముప్పును తగ్గిస్తాయని ఈ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఏమీ చేయకుండా సోఫాలో కూర్చుని ఉండటం కంటే, ఇంట్లోనే అటు ఇటు తిరుగుతూ చిన్న చిన్న పనులు చేసుకోవడం మేలు. కాబట్టి, భారీ వ్యాయామాలు చేయలేకపోయినా పర్వాలేదు.. ఈ జోన్ జీరో ట్రెండ్‌ను ఫాలో అవ్వండి, ఆరోగ్యంగా ఉండండి.
