Hair Care: జుట్టు రాలడం వెంటనే ఆగిపోవాలా.. మీ వంటగదిలోనే ఉంది పరిష్కారం..
జుట్టు బలంగా తయారవుతుంది.నేటి ఆధునిక జీవనశైలిలో చాలామందిని ఇబ్బంది పెడుతున్న ప్రధాన సమస్య జుట్టు రాలడం. పోషకాహార లోపం, ఒత్తిడి, కాలుష్యం వంటి కారణాలతో జుట్టు బలహీనపడి ఊడిపోతుంటుంది. అయితే, ఈ సమస్యకు మన వంటగదిలోనే సులభమైన పరిష్కారాలు ఉన్నాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు జుట్టు కుదుళ్లను బలోపేతం చేసి, జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి.

జుట్టు రాలడం అనేది చాలామందిని కలవరపెట్టే సమస్య. ఈ సమస్యకు పరిష్కారం కోసం రకరకాల షాంపూలు, నూనెలు వాడుతుంటాం. కానీ, అసలు సమస్య మన ఆహారపు అలవాట్లలో ఉండవచ్చు. మన జుట్టు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలన్నీ మన వంటగదిలోనే సులభంగా లభిస్తాయి. సరైన ఆహారం తీసుకుంటే జుట్టు రాలడం తగ్గుతుంది.
ఆహార చిట్కాలు ఇలా..
ఉసిరి: విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఉసిరి, తలపై రక్తప్రసరణ మెరుగుపరుస్తుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచి, జుట్టు నెరసిపోవడం నివారిస్తుంది.
కొబ్బరి: లారిక్ యాసిడ్, మినరల్స్ ఎక్కువగా ఉండే కొబ్బరి తల చర్మానికి మంచి పోషణ అందిస్తుంది. దీనితో పొడిబారడం తగ్గుతుంది. జుట్టు ఒత్తుగా, బలంగా తయారవుతుంది.
కరివేపాకు: ఇందులో బీటా-కెరోటిన్, అమినో ఆమ్లాలు ఎక్కువ. ఇవి బలహీనమైన జుట్టు కుదుళ్లను బాగుచేస్తాయి. జుట్టు మళ్లీ పెరగడానికి ప్రేరణగా నిలుస్తాయి.
మెంతులు: ప్రోటీన్, నికోటినిక్ యాసిడ్ నిండిన మెంతులు జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. ఇవి జుట్టు రాలడం తగ్గించి, జుట్టు తిరిగి పెరిగేలా చూస్తాయి.
పెసలు: ప్రోటీన్, ఐరన్, ఫోలేట్ అధికంగా ఉండే పెసలు కెరాటిన్ ఉత్పత్తికి కీలకం. ఇవి పోషకాల లోపం వల్ల వచ్చే జుట్టు రాలడాన్ని అరికడతాయి.
మునగాకు: ఇనుము, జింక్, విటమిన్ బి6 వంటి ముఖ్య పోషకాలు ఇందులో ఉన్నాయి. ఇవి జుట్టు కుదుళ్ల ఎదుగుదలకు తోడ్పడతాయి. జుట్టు విరిగిపోకుండా చూస్తాయి.
రాగులు: క్యాల్షియం, ఐరన్, అమినో ఆమ్లాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇవి తల చర్మానికి రక్తప్రసరణను పెంచి, జుట్టు మూలాలను బలపరుస్తాయి.
నువ్వులు: నువ్వుల్లో జింక్, సెలీనియం, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి తల చర్మానికి పోషణ అందించి, జుట్టు రాలడం తగ్గిస్తాయి.
ఈ ఆహార పదార్థాలు నిత్యం తినడం వల్ల జుట్టుకు కావాల్సిన పోషకాలు అందుతాయి. జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా ఉంటుంది.




